క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, విల‌న్ పాత్ర‌ల‌కు స్టార్‌డ‌మ్ తెచ్చిన మ‌హాన‌టుడు ఎస్వీఆర్‌

SVR 100th Birth Anniversary Special Article, SV Ranga Rao 100th Birth Anniversary, S V Ranga Rao Birth Centinary, Remembering #SVRangaRao, Unknown Facts about SV Ranga Rao, SV Rangarao Trivia, Lesser Known Facts about SVR, Telugu FilmNagar, Telugu cinema news, Tollywood Celebrity News,
SVR 100th Birth Anniversary Special Article

సామర్ల వెంకట రంగారావు.. ఈ పేరు వినగానే ఎవరాయన అని చాలామంది ఆలోచించకమానరు. అదే ఎస్వీఆర్ అంటే చాలు.. నిండైన విగ్రహం స్మరణకు వచ్చి.. వెనువెంటనే ఆయన చేసిన మరపురాని పాత్రలెన్నో కనుల ఎదుట కదలాడతాయి. ఏ క్యారెక్టర్ ఇచ్చినా… దానికి న్యాయం చేయగల సత్తా ఉన్న కంప్లీట్ ఆర్టిస్ట్ ఆయన. అసలు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల‌కు గానీ, విలన్‌ల‌కుగానీ స్టార్ డమ్ రావడం మొదలైంది యశస్సు కోసమే పుట్టిన ఈ నటయశస్వితోనే. రెండున్నర దశాబ్దాల పాటు నటనను శ్వాసించి.. తెలుగు తెరను శాసించారు ఈ మహానటుడు. అలాంటి చిరస్మరణీయమైన ఎస్వీఆర్ శ‌త‌జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భాన్ని పురస్కరించుకుని `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్‌` అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం మీ కోసం..

ఫార్టీస్, ఫిప్టీస్, సిక్స్ టీస్, సెవన్ టీస్.. ఇలా ఈ డికెడ్‌ల‌ సమయం తెలుగు సినిమాకి స్వర్ణయుగంలాంటిది. ఈ టైంలో ఎన్నో మెమరబుల్ మూవీస్ టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేసాయి. ఆ చిత్రాలు అలా గుర్తుండిపోయాయంటే.. వాటికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన‌ సేవలు కూడా అమూల్యమైనవైతేనే సాధ్యమౌతుంది. అలా విలువ కట్టలేని కళా సేవను అందించిన నటులలో ఎస్వీ రంగారావు ఒకరు.

కృష్ణాజిల్లాలోని నూజివీడులో జులై 3, 1918న సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మి దంపతులకు జన్మించారు రంగారావు. 12 ఏళ్ల వయసులో నాటకాలపై మోజు పెంచుకున్న సామర్ల వారి కుర్రాడు.. డిగ్రీ పూర్తయ్యాక పూర్తిస్థాయి నటుడుగా మారాలని
నిశ్చ‌యించుకున్నారు. అందులో భాగంగానే రంగస్థలంపై రంగప్రవేశం చేసారు రంగారావు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకే వన్నె తెచ్చే వైనం తనకి దక్కిందంటే.. ఆయన చేసిన స్టేజ్ పెర్ ఫార్మెన్స్ ల వల్లేనన్నది జగమెరిగిన సత్యం.

రంగస్థలంపై ఆయన ప్రదర్శించిన నటనైపుణ్యం.. ఆయనను చిత్రరంగంలోకి ప్రవేశింపజేసేలా చేసింది. 1946లో రిలీజైన ’వరూధిని‘ కోసం తొలిసారిగా ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా మేకప్ వేసుకున్న రంగారావు.. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రమైన
’మనదేశం‘ని రెండో సినిమాగా చేశారు. అదే ఎన్టీఆర్ నటించిన రెండో చిత్రం’షావుకారు‘, మూడో చిత్రం ’పల్లెటూరి పిల్ల‘లోనూ ఎస్వీఆర్ కీలక పాత్రలు పోషించారు. అంటే.. తెలుగు తెరను శాసించిన మహానటులు ఎన్టీఆర్, ఎస్వీఆర్ సినీ ప్ర‌యాణం ఒకే స‌మ‌యంలో వేగాన్ని పుంజుకుంద‌న్న‌మాట. ’షావుకారు‘లో సున్నపు రంగడు అనే గూండా
పాత్రలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన ఈ విశ్వ నట చక్రవర్తి.. ఏఎన్నార్‌తో ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి చిత్రమైన `పల్లెటూరి పిల్ల`లో తాత వేషమేసి మెప్పించారు.

’షావుకారు‘లో నెగెటివ్ టచ్ పాత్ర వేసినా ప్రతినాయకుడిగా ఎస్వీఆర్ స్థాయిని పెంచిన చిత్రం మాత్రం ఎన్టీఆర్ నటించిన ఏడవ సినిమా అయిన ’పాతాళ భైరవి‘నే. 1951లో వచ్చిన ఈ చిత్రంలో నేపాళ మాంత్రికుడుగా రంగారావు ప్రదర్శించిన అభినయం.. అతని పేరుని జనాల నోళ్లలో నానేలా చేసింది. మరీ ముఖ్యంగా సాహసం సేయరా డింభకా, డింగరీ.. అనే ఊతపదాలు అయితే ప్రజాదరణను ఇట్టే పొందేసాయి. పాతాళ భైరవి సినిమా దెబ్బతో ఒక్కసారిగా హౌస్ హోల్డ్ నేమ్‌గా అయిపోయింది ఎస్వీఆర్ పేరు.

’పాతాళ భైరవి‘ తరువాత ’పెళ్లి చేసి చూడు, పల్లెటూరు, దాసి, దేవదాసు, చండీరాణి, సంఘం‘ తదితర సినిమాల్లో నటించినా.. ఆయనలోని నటుడిని ఎలివేట్ చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది మాత్రం 1954లో వచ్చిన ’బంగారు పాప‘ చిత్రమే. ఇందులో విధివంచితుడైన కోటయ్య పాత్రలో రంగారావు కనబరిచిన ఉత్తమ నటన ప్రశంసలను
పొందేలా చేసింది. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ’బంగారు పాప‘తో నటుడిగా మరో మెట్టు ఎక్కారాయన.

1957లో వచ్చిన ’మాయాబజార్‘ సినిమా అయితే.. రంగారావులో కొత్త కోణాన్ని చూపింది. ఆ సినిమాలో పౌరాణిక పాత్ర అయిన ఘటోత్కచుడు వేషంలో కనిపించిన ఆ మహానటుడు.. అమాయకత్వం, చమత్కారం ఇలా అన్ని కలగలసిన ఆ క్యారెక్టర్‌లో లీనమై నటించారు. మరీ ముఖ్యంగా మాటలతో మాయ చేయడమే కాకుండా.. ’వివాహ భోజనంబు‘ పాటలోనూ.. అలాగే మాయా శశిరేఖగా కనిపించే ’అహ నా పెళ్లంట‘ సాంగ్ లోనూ కలకాలం గుర్తుండిపోయే అభినయాన్ని ప్రదర్శించారు.

’మాయా బజార్‘ తరువాత.. ’తోడి కోడళ్లు, అప్పు చేసి పప్పు కూడు, బాలనాగమ్మ, నమ్మిన బంటు, కలిసి ఉంటే కలదు సుఖం‘ వంటి ఎన్నో చిత్రాల్లో మంచి మంచి వేషాలేసిన ఆయన కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది ’గుండమ్మ కథ‘. ఇందులో తన వయసుకి దగ్గరగా ఉండే.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల‌కి తండ్రి పాత్రలో నటించారాయన. అంతకు
ముందు కూడా ఆ హీరోలకు తండ్రిగా నటించినా.. ఒకే సినిమా కోసం ఇలా వారికి తండ్రిగా నటించడం ప్రేక్షకులకు కొత్తదనమిచ్చినట్లయ్యింది. హుందాగా ఉండే ఆ పెద్దాయన పాత్రకి తనదైన నటనతో జీవం పోశారాయన. విశేషమేమిటంటే.. ’గుండమ్మ కథ‘ కంటే ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన ’మిస్సమ్మ‘లో హీరోయిన్ల
పాత్రధారులు సావిత్రి, జమునలకు నాన్న గా కనిపించిన ఎస్వీఆర్.. ’గుండమ్మ కథ‘ కోసం ఆ నాయికలకు మామ వేషంలో కనిపిస్తూ హీరోలుగా నటించిన ఆ మహానటులకు తండ్రిగా కనిపించారు.

ఇక ’నర్తనశాల‘ సినిమా విషయానికి వ‌స్తే ఎస్వీఆర్ పోషించిన కీచకుడు పాత్ర అయితే.. ఆయన పేరుని జకార్తా పెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకునే స్థాయిలో నిలిపింది. అజ్ఘాత వాసంలో భాగంగా సైరంధ్రి పేరుతో విరాటుని కొలువులో ఉండే ద్రౌపదిని వేధించే పాత్రలో నభూతో న భవిష్యత్ అన్నంతగా అల్లుకుపోయారు రంగారావు.

1965లో అయితే వారం రోజుల వ్యవధిలో ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన రెండు సినిమాల కోసం కీలక పాత్రల్లో నటించి మెప్పించారు ఎస్వీఆర్. సాంఘిక చిత్రమైన `నాదీ ఆడజన్మే`లో అందవిహీనంగా ఉండే కోడలుని సపోర్ట్ చేసే మామ పాత్రలో ఆయన అలరిస్తే.. `పాండవ వనవాసం` లో దుర్యోధనుడుగా గుర్తుండిపోయే పాత్రని పోషించారు.
అంటే.. సేమ్ పెయిర్ యాక్ట్ చేసిన ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ.. మరో చిత్రంలో విలన్ గానూ నటించి వైవిధ్యం చూపించారన్నమాట.

1967లో వచ్చిన `భక్త ప్రహ్లాద` సినిమాలో హిరణ్యకశివుడు పాత్రలో చూపిన నటవిశ్వరూపం రంగారావు స్థాయిని మరింత పెంచింది. హరి భక్తుడైన కొడుకు ప్రహ్లాదుడు.. ఆ పేరంటేనే, వింటేనే కోపంతో ఊగిపోయే తండ్రి హిరణ్యకశివుడు మధ్య సంఘర్షణగా ఉండే ఈ సినిమాలో ఎస్వీఆర్ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇదివరకు `చెంచు లక్ష్మి`లోనూ హిరణ్యకశివుడు పాత్ర చేసినప్పటికీ.. 1967కి గానూ తృతీయ ఉత్తమ చిత్రంగా నందిని అందుకున్న `భక్త ప్రహ్లాద`లోని పాత్ర ఎక్కువ పేరు తీసుకువచ్చింది.

అదే 1967లో వచ్చిన `చదరంగం` సినిమా ఎస్వీఆర్ లోని మరో కొత్త కోణాన్ని చూపింది. అదేమిటంటే.. డైరెక్టర్ గా అవతారం ఎత్తడం. `చదరంగం` రంగారావుకి దర్శకుడిగా పేరు తేవడమే కాకుండా.. ద్వితీయ ఉత్తమ చిత్రంగా నందిని పొందింది. అంటే ఎస్వీఆర్‌కి సంబంధించిన రెండు సినిమాలు ఒకే ఏడాదిలో నందిని అందుకుని మరీ సత్తాని చాటాయన్నమాట. అలాగే ఎస్వీఆర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగా అవతారం ఎత్తి మరి తీసిన `బాంధవ్యాలు` సినిమా అయితే 1968 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా నందిని పొందింది. దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ రెండు ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి మరీ ద‌ర్శ‌కుడిగా తన అభిరుచిని చాటుకున్నారాయన.

ఆ తరువాత వచ్చిన `లక్ష్మీ నివాసం, దసరా బుల్లోడు, ప్రేమ నగర్, సంపూర్ణ రామాయణం, పండంటి కాపురం` వంటి సినిమాల్లోనూ కలకాలం గుర్తుండిపోయే పాత్రలో మురిపించారు ఎస్వీఆర్. అదేవిధంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా `తాత మనవడు`లోని తాత పాత్రలో ఆయన నటన శిఖ‌రాగ్ర శ్రేణిలో
ఉంటుంది. ఈ చిత్రం ఆయన నటజీవితంలో ఓ కలికితురాయిగా నిలిచిపోయింది.

`తాత మనవడు` తరువాత వచ్చిన మల్టీస్టారర్ `దేవుడు చేసిన మనుషులు` కోసం ఎన్టీఆర్, కృష్ణ కి తండ్రి పాత్రలో నటించి మరోసారి స్టార్ ఫాదర్‌గా ప్రశంసలు పొందారు ఎస్వీఆర్. ఆ తరువాత ’బంగారు కలలు, మైనర్ బాబు, చక్రవాకం, అందరూ దొంగలే‘ వంటి సినిమాల్లో కనిపించిన రంగారావు.. నటుడిగా కనిపించిన ఆఖరి చిత్రం`యశోద కృష్ణ`లోనూ కంసుడి పాత్రలో అలరించారు.

జానపద పాత్ర అయిన నేపాళ మాంత్రికుడుతో స్టార్ డమ్‌ని పొందిన ఎస్వీఆర్.. తన చివర రోజుల్లో పౌరాణిక పాత్రతో వీడ్కోలు తీసుకున్నారు. తెలుగు సినిమాల్లో పురాణ పాత్రతో తెరమెరుగైన ఎస్వీఆర్.. తన నటజీవితంలో చేసిన ప్రతి పురాణ పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి మరీ ఆ వేషాలకి జీవం పోసారు. దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, యముడు, హిరణ్యకశివుడు, బాణాసురుడు, భీష్ముడు, దక్షుడు, కీచకుడు, నరకాసురుడు, మాయాసురుడు, హరిశ్చంద్రుడు వంటి మైథలాజికల్ క్యారెక్టర్లన్నీ తెలుగు జనాలకి మరింత చేరువయ్యాయంటే దానికి ఆ మహానటుడి
యాక్టింగ్ కూడా ఓ కారణంగానే చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

డైలాగ్స్ పలకడంలో ఎస్వీఆర్ శైలే వేరు. ఎంతటి క్లిష్టమైన సంభాషణలైనా ఆయన అలవోకగా పలికే తీరు జనాలని విపరీతంగా మెప్పించేది. పురాణ పాత్రల కోసం గ్రాంథికంలో మాటలు చెప్పాలన్నా.. సాంఘికాల్లోనూ సరళమైన పలుకులు పలకాలన్నా రంగారావు తరువాతే ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా హీరోలు.. సింహాలు, పులులు, గుర్రాలను తమ పాత్రలను ఎలివేట్ చేయడం కోసం వాడుకుంటే.. ఆ శైలి పలుకులను నలభై సంవత్సరాల క్రితమే రంగారావు చెప్పి మెప్పించారు. `జగత్ జెట్టీలు` సినిమాలో ’బోనులో ఉన్నా.. అడవిలో ఉన్నా పులి పులేరా డోంగ్రే‘ అంటూ ఆయన చెప్పే డైలాగ్ అప్పట్లో జనాలని విపరీతంగా అలరించింది. డోంగ్రే అనే కాకుండా డుంబ్రే, గూఖ్లే..లాంటి ఎన్నో జనరంజక ఊతపదాలను తన ఖాతాలో వేసుకున్న ఘనత కూడా ఎస్వీఆర్ కుంది.

’బాంధవ్యాలు‘ అనే సినిమాని తీయడమే కాకుండా.. అన్న, బావ, నాన్న, మావయ్య, తాత.. ఇలా అన్ని బాంధవ్యాలను కథానాయకుడు, కథానాయిక పాత్రల పక్కన పండించిన ఘనత రంగారావుది. తన గంభీరమైన కంఠంతో, నిండైన విగ్రహంతో, అద్భుతమైన నటనతో చిత్ర రంగాన్ని రంగరించారాయన. ఆయన వెండితెరపై చివరగా కనిపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఆయన నటించిన సినిమాలు బుల్లితెరలో ప్రసారమవుతూ ఆ మహానటుడిని
స్మరింపజేస్తూనే ఉన్నాయి. పాత్రల్లో నటించడం కాకుండా.. జీవించే ప్రయత్నం చేసిన తీరే ఆ మహానటుడిని ఇంకా సజీవంగా ఉండేలా చేసిందన్నది జగమెరిగిన సత్యం.

యస్వీ రంగారావుని మరపించే నటుడు ఇప్పటివరకు తెలుగు పరిశ్రమకు లభించలేదు.  మరొకరికి రీ ప్లేస్‌మెంట్‌ ఇవ్వలేని ప్లేస్‌ని తెలుగు ప్రజల గుండెల్లో పొందిన ఆ యశస్వి ఎప్పటికీ చిరంజీవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here