కుటుంబ క‌థా చిత్రాల బ్రాండ్ అంబాసిడ‌ర్‌

కుటుంబ క‌థా చిత్రాల బ్రాండ్ అంబాసిడ‌ర్‌,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,SV Krishna Reddy Brand Ambassador For Family Movies,Director SV Krishna Reddy Latest News,SV Krishna Reddy Upcoming Movies,SV Krishna Reddy Next Film Updates

సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి ఎంతోమంది ద‌ర్శ‌కులు వ‌స్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అయితే కొంత‌మంది మాత్ర‌మే బ‌ల‌మైన ముద్ర వేస్తారు. అలాంటి ముద్ర వేసిన ద‌ర్శ‌కుల‌లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒక‌రు. ఓ సినిమా ‘స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతం’గా చూడ‌ద‌గ్గ విధంగా ఉందంటే.. అది క‌చ్చితంగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ష‌న్ చేసిన సినిమానే అని 1990ల ద‌శ‌కంలో ప్రేక్షకులు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల వారు ముక్త‌కంఠంతో చెప్పుకునేవారు. అలా కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మోస్ట్‌ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌. ద‌ర్శ‌కుడిగా చేసిన‌ మొద‌టి సినిమా నుంచి గ‌త చిత్రం వ‌ర‌కు త‌న ప్ర‌తి సినిమాలోనూ కుటుంబ‌ విలువ‌లు, ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యం మిస్ కాకుండా చూసుకుని.. ఆ త‌ర‌హా చిత్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నిలిచారాయ‌న‌. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా భిన్నమైన కథలతో సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులను అలరించారు.

డబ్బుపై ఆశతో మొగుణ్ణి కూడా అమ్మేసే ఒక భార్యామణి కథని తెరక్కించాలన్నా.. పెళ్ళికి ఆహ్వాన పత్రిక ఉన్నట్టే – భార్యభర్తలు విడిపోవడానికి కూడా ఒక విడాకుల ఆహ్వాన పత్రిక ఉంటే ఎలా ఉంటుంది? అనే కొత్త పాయింట్‌తో సినిమాని రూపొందించినా అది కృష్ణారెడ్డికే చెల్లు. అంతేకాదు.. ఒక ఏనుగుతో భావోద్వేగ సన్నివేశాలను పండించాలన్నా, యముడితో డాన్స్ చేయించాలన్నా కూడా అవి కేవలం కృష్ణారెడ్డికి మాత్రమే సొంతం. అందుకే ఆయన సినిమాలు క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి. తెలుగులో టాప్ డైరెక్టర్స్ సరసన కూర్చోబెట్టాయి.

నేడు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన సాగించిన సినీ ప్రయాణంపై దృష్టి సారిస్తే.. ‘పగడాల పడవ’ (1979)తో నటుడిగా తెరంగేట్రం చేసిన ఎస్వీ.. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ‘కిరాతకుడు’ (1986) చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు. అయితే.. 1991లో వచ్చిన ‘కొబ్బరిబొండాం’ సినిమాకి కె.అచ్చిరెడ్డితో పాటు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూనే కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసారు కృష్ణారెడ్డి. అనంతరం ద‌ర్శ‌కుడిగా మారి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నెంబర్ వన్’, ‘యమలీల’, ‘శుభలగ్నం’ ‘మావిచిగురు’, ‘వినోదం’, ‘ఎగిరే పావురమా’, ‘ఆహ్వానం’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘పెళ్ళాం ఊరెళితే’ లాంటి ప‌లు విజయవంతమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్‌లలో ఒకరిగా ఎదిగారు. అలాగే.. తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా 2012లో ‘డివోర్స్ ఇన్విటేషన్’ (‘ఆహ్వానం’కి రీమేక్‌) అనే ఆంగ్ల చిత్రాన్ని తెరకెక్కించారు.

దర్శకుడిగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, సంగీత దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న కృష్ణారెడ్డి.. క‌థానాయ‌కుడిగా అవ‌తారం ఎత్తి ‘ఉగాది’, ‘అభిషేకం’ చిత్రాలలో నటించారు. అంతేగాకుండా.. ‘ఉగాది’ సినిమాలో పాట పాడి గాయకుడిగా కూడా నిరూపించుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక అవార్డుల విషయానికొస్తే.. ‘శుభలగ్నం’ (1994) చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును, ‘ఆహ్వానం’ (1997) సినిమాకి స్పెషల్ జ్యూరి నంది అవార్డును, ‘సకుటుంబ సపరివార సమేతం’ (2000) చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా తొలి నందిని తన ఖాతాలో వేసుకున్నారు కృష్ణారెడ్డి. ఇటీవ‌లే ‘య‌మ‌లీల 2’తో ప‌ల‌క‌రించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. భ‌విష్య‌త్‌లో మరెన్నో మంచి చిత్రాలను తెరకెక్కించాలని ఆశిస్తూ.. ఈ దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here