2018 మే – జ‌యాప‌జ‌యాల స‌మీక్ష‌

సంక్రాంతి సీజ‌న్ త‌రువాత నెల‌ల వారీగా చూసుకుంటే సినిమా వాళ్ళు మే నెల‌ను ‘మోస్ట్ హ్యాపెనింగ్ మంత్‌’గా భావిస్తారు. స్కూళ్ళ‌కు సెల‌వులు, పెళ్ళిళ్లూ, ప్ర‌యాణాలు, ప‌రీక్ష ఫ‌లితాలు వంటి సంద‌డి మొత్తం మే నెల‌లోనే క‌నిపిస్తుంది. అందుకే సినిమా వాళ్ళ వ‌ర‌కూ పండ‌గ‌లేని పండ‌గ సీజ‌న్ ‘మే’ నెల అంటారు.
మే నెల‌లో వ‌చ్చే జయాప‌జ‌యాల ప్ర‌భావం సంవ‌త్స‌రం పొడుగునా ప‌రిశ్ర‌మ మీద ఉంటుంది. ఈ నేప‌థ్యంలో 2018 మే నెల‌లో విడుద‌లైన సినిమాల జ‌యాప‌జ‌యాల స‌మీక్ష ఎలా ఉందో చూద్దాం..
సాధార‌ణంగా మే నెల‌లో ప‌ది ప‌న్నెండు సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ 2018 మేలో కేవ‌లం 7 చిత్రాలు మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి. సంఖ్యాప‌రంగానే కాకుండా స‌క్సెస్ ప‌రంగా కూడా మే 2018 బాగా నిరాశ‌ప‌రిచింది. ఆ వివ‌రాలు ఏమిటో చూద్దాం..

* మే 4 : ద‌ర్శ‌కుడిగా మారిన ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ త‌న తొలి ప్ర‌య‌త్నంగా అల్లు అర్జున్ హీరోగా రూపొందించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. గీతా ఆర్ట్స్ స‌పోర్ట్‌తో నాగ‌బాబు, ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఒక ప‌వ‌ర్‌ఫుల్ మిల‌ట‌రీ మ్యాన్ క్యారెక్ట‌ర్‌లో అల్లు అర్జున్ హై ఓల్టేజ్ ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ ప్ర‌జెంటేష‌న్‌లో ఏదో అస్ప‌ష్ట‌మైన లోపం కార‌ణంగా ఈ హై ఎక్స్‌పెక్టెడ్ ఏక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ప‌ర్‌ఫెర్మాన్స్‌కు ఫిదా అవ్వ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌డు.

* మే 9: ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ‘మ‌హాన‌టి’ అద్భుత విజ‌యాన్ని సాధించ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేసింది. దివంగ‌త ‘మ‌హాన‌టి’ సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తీసిన ఈ బ‌యోపిక్ ఇంత గొప్ప‌గా ఉంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ, సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ అభిన‌య సామ‌ర్థ్యం ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేయ‌డంతో ‘మ‌హాన‌టి’ ఒక మ‌హా విజ‌యంగా నిలిచిపోయింది. ఆర్థికంగా ఎంత ఘ‌న విజ‌యంగా నిలిచిందో.. వైజ‌యంతి బ్యాన‌ర్‌కు ప‌దింత‌ల హార్థిక ప‌రిపుష్ఠిని అందించింది ‘మ‌హాన‌టి’ విజ‌యం.

* మే 11: ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత పూరీ జ‌గ‌న్నాథ్ త‌న త‌న‌యుడు ఆకాష్ పూరీని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ నిర్మించిన ‘మెహ‌బూబా’ మే 11న విడుద‌లైంది. మిల‌ట‌రీ, ల‌వ్, పున‌ర్జ‌న్మ వంటి డిఫ‌రెంట్ ఎలిమెంట్స్ నేప‌థ్యంలో నిర్మించిన ఈ భారీ చిత్రం కూడా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఆకాష్ పూరీ అప్పీరియ‌న్స్‌, ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌కు మంచి మార్కులు ప‌డ్డాయిగానీ ఆ స్థాయిలో ఆర్థిక విజ‌యం ల‌భించ‌క‌పోవ‌టం శోచ‌నీయం. త‌న త‌న‌యుల‌ను హీరోగా నిల‌బెట్టుకోవ‌డంలో మ‌న అగ్ర ద‌ర్శ‌కుల వైఫ‌ల్యం పూరీ జ‌గ‌న్నాథ్ విష‌యంలో కూడా కంటిన్యూ అవ్వ‌డం బ్యాడ్ ల‌క్‌.

* మే 18: ఈ రోజున విప్ల‌వ చిత్రాల క‌మిటెడ్ ఫిలిమ్ మేక‌ర్ ఆర్‌.నారాయ‌ణ మూర్తి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన ‘అన్న‌దాత సుఖీభ‌వ‌’, ‘బిచ్చ‌గాడు’ ఫేమ్ విజ‌య్ ఆంటోని న‌టించిన ‘కాశి’ చిత్రాలు విడుద‌ల‌య్యాయి. రెండూ ఆర్థికంగా నిరాశ‌ప‌రిచాయి.

* మే 25: ఇక ఆఖ‌రివారంలో మే 25న భారీ అంచ‌నాల మ‌ధ్య ర‌వితేజ – క‌ళ్యాణ్ కృష్ణ‌ల ‘నేల టిక్కెట్టు’ విడుద‌లైంది. అయితే అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక ర‌వితేజ కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌గా నిలిచిపోయింది ‘నేల టిక్కెట్టు’. ఇక అదే రోజున విడుద‌లైన ‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ రెవిన్యూ ప‌రంగా మొద‌టి రోజు స్లోగా ఉన్న‌ప్ప‌టికీ క్ర‌మంగా పుంజుకుంటూ మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఒక మోస్తరు విజ‌యంగా నిలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇదీ మే 2018 స‌మీక్ష‌. ‘మ‌హాన‌టి’ అనే ఒకే ఒక్క స‌క్సెస్ లేక‌పోతే మే నెల ‘మంత్ ఆఫ్ డిజాస్ట‌ర్స్‌’గా మిగిలిపోయేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here