తెలుగు సినిమా విస్తృతి, వికాస వైభవ ప్రాభవాలకు కారకులు, ప్రేరకులు అయిన దర్శక శ్రేష్ఠులు ఎందరో ఉన్నారు . ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో తమ ప్రతిభా సామర్ధ్యాలను ప్రదర్శించి తెలుగు సినిమా ప్రతిష్ఠ ను ఇనుమడింపజేశారు . జానపద, సాంఘీక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో ప్రేమ ,పగ, త్యాగం ,,హాస్యo ,భీభత్స, శృంగారాది రసాల రసావిష్క రణ గావించి ప్రేక్షకుల్ని మెప్పించారు .అయితే అన్ని రసాలను ఒక్కరే పండించలేరు .
ఒకొక్కరు ఒక్కో జోనర్ లో స్పెషలిస్ట్ అనిపించుకుంటారు . ఈ కోణంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ను తెలుగు సినిమా గ్లామర్ విభాగాధిపతి గా అభినందించవచ్చు . సినిమా అంటే కనువిందు…సినిమా అంటే వీనుల విందు….అది షడ్రసోపేతమైన వినోదాల విందు అని త్రికరణ శుద్దిగా నమ్మిన పదహారణాల కమర్షియల్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు. ప్రేక్షకులకు పూర్తిగా పైసా వసూల్ ఫీలింగ్ ను ఇవ్వటాన్ని మించిన బాక్స్ ఆఫీసు ఫార్ములా మరేదీ లేదన్నది రాఘవేంద్రరావు నమ్మిన సినీ సిద్ధాంతం. అందుకే ఆయన సినిమాల్లో వెండి తెర ఇంద్రధనస్సు అవుతుంది….ఆయన కథానాయికలు శృంగార కావ్య నాయికలై పురుష ప్రేక్షకుల ఆదరణకు, స్త్రీ ప్రేక్షకుల అసూయకు కారణమవుతుంటారు . ఆయన పాటల చిత్రీకరణలోని కొంటె కోణంగి కోణాలు, శృంగార సూత్రాలు యువకులకు గిలిగింతలు పెడితే…యువ దర్శకులకు సినీ కామర్స్ క్లాస్సెస్ అవుతాయి.
తెలుగు సినీ చరిత్రలో గ్లామర్ అనే పదానికి నిర్వచనం గా రాఘవేంద్రరావును ఆయన చిత్రాలను ఉదహరిస్తాం …అది ఆయనకు మాత్రమే దక్కిన ప్రత్యేకమైన గుర్తింపు…కీర్తి…. అయితే కె .రాఘవేంద్రరావు అంటే కేవలం గ్లామర్ ఒరియెంటెడ్ డైరెక్టర్ అనుకునే వాళ్ల అమాయకత్వానికి సమాధానం గా కొన్ని సినిమాలు చూపించాలి . దర్శకుడిగా ఆయనలోని విభిన్న కోణాల విశ్వరూపానికి అద్దం పట్టే ఉత్తమ, ఉదాత్త చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో కనిపిస్తాయి ఆ శతాధిక చిత్ర దర్శకుడి చిత్రావళిలో… అయితే కమర్షియల్ ఫార్ములాల అంచనాలు తారుమారై కొన్ని అపజయాలు ,కొన్ని అపవాదులు ఎదురైనప్పటికి ఆ ఒడిదుడుకులు , ఆ స్వల్ప విమర్శలు ఆ శిఖరాగ్ర దర్శకుడి కీర్తి ప్రతిష్టలకు ఏ మాత్రం భంగం కలిగించలేవు . ” తెలుగు సినిమా గ్లామర్ విభాగాధిపతి ” గా ఆయనకు ఉన్న గ్లామర్ ఎప్పటికి చెక్కు చెదరదు.. తెలుగు, హిందీ భాషల్లో అగ్ర హీరోలు ,సుప్రసిద్ధ నటీనటులు అందరి తో పనిచేసి One of The Top Ranked Personalities of the Indian Silver Screen గా నిలిచిన కె.రాఘవేంద్రరావు కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు పలుకుతుంది “తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్ .