2019 ప్రథమార్ధ ఫలితాలు అత్యంత నిరాశాజనకం

2019 ప్రథమార్థం పూర్తయింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అందించిన అధికారిక జాబితా ప్రకారం గడచిన ఆరు నెలల్లో 93 స్ట్రైట్ చిత్రాలు, 44 డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే సక్సెస్ రేటు షరా మామూలే. నిజానికి మామూలు కంటే తక్కువనే చెప్పాలి. 93 స్ట్రెయిట్ చిత్రాలను , 44 డబ్బింగ్ చిత్రాలను కలుపుకుని ఈ ఆరు నెలల్లో 137 చిత్రాలు విడుదలయ్యాయి. 180 రోజులలో 137 చిత్రాలు విడుదలయ్యాయి అంటే సంఖ్యా పరంగా ఆ ఫిగర్ చూసుకొని ఆనందపడాలో… ఆ మూకుమ్మడి పరాజయాల పరంపరను చూసి బావురుమనాలో తెలియని పరిస్థితి. వరుస ఫ్లాప్ లను చవిచూడటం చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు.కానీ 2019 ప్రథమార్థం ఇచ్చినంతటి షాకింగ్ రిజల్ట్స్ ను గత కొన్నేళ్లలో చూడలేదు. ముఖ్యంగా సినిమా వారికి సిరులు కురిపించే సంక్రాంతి సీజన్లో దారుణమైన ఫలితాలు రావటంతో సినీ ట్రేడ్ దిమ్మెరపోయింది. సంక్రాంతి సినిమాలతో కలుపుకొని జనవరి నెలలో మొత్తం 11 చిత్రాలు పైగా విడుదల అయ్యాయి. వాటిలో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2, మిస్టర్ మజ్ను చిత్రాల పట్ల అంచనాలు ఉన్నాయి. కానీ వాటిలో “ఎఫ్ 2” ఒక్కటి మాత్రమే అంచనాలను మించిన అద్భుత విజయాన్ని సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ ఘోరపరాజయాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాల పరాజయ ప్రభావం వ్యక్తిగతంగా ఆ యూనిట్స్ నే కాకుండా మొత్తం ఇండస్ట్రీనే షాక్ కు గురిచేసింది. ఇక ఫిబ్రవరి మాసానికి వస్తే విడుదలయిన 15 కు 15 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన “యాత్ర” చిత్రానికి విమర్శకుల ప్రశంసలైనా దక్కాయి గానీ , మరో బయోపిక్ అయిన “ఎన్టీఆర్- మహా నాయకుడు”కు ఆ ప్రశంసలు కూడా దక్కలేదు. బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే ఫిబ్రవరిని సున్నా ఫలితాలనిచ్చిన శూన్య మాసం గా చెప్పుకోవచ్చు. ఇక 2019 మార్చి విషయానికి వస్తే- సంఖ్యాపరంగా 24 రిలీజ్ లతో టాప్ లో నిలిచిన మార్చి ఫలితాల పరంగా దారుణం అనే చెప్పాలి. మార్చి 1 న విడుదలైన కళ్యాణ్ రామ్”118″ ఒక మోస్తరు విజయాన్ని నమోదు చేసుకోగా మిగిలిన ఇరవై మూడు సినిమాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో వచ్చిన దారుణ ఫలితాలే మార్చిలో కూడా రావడంతో చిత్ర పరిశ్రమ దిమ్మెర పోయింది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి- ఈ మూడు మాసాలలో విడుదలైన 50 చిత్రాలలో ఒక్క “ఎఫ్ 2 ” మాత్రమే సమగ్ర విజయంగా నిలిచింది. ఎక్స్పెక్టెడ్ చిత్రాలలో సూర్యకాంతం, లక్ష్మీస్ ఎన్టీఆర్ బాగా డిసప్పాయింట్ చేశాయి. మొత్తానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు జీవిత చరిత్ర నేపథ్యంలో రూపొందిన మూడు చిత్రాలు ఆయన ప్రతిష్టను ఇనుమడింప చేయకపోగా ఆయన పేరుమీద నానా రచ్చ జరగటం ఆయన అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. ఇదే అదనుగా ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని కొంతమంది సన్నాసులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోవడం మినహా ఆ చిత్రాల వలన ఎలాంటి ప్రయోజనం సిద్ధించకపోవటం బాధాకరం. ఇక మార్చిలో చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమా అడల్ట్ కంటెంట్ కారణంగా రెవిన్యూ పరంగా కొంత బెటర్ అనిపించింది. ఇక 2019 ప్రథమార్ధంలోని ద్వితీయార్ధం మాత్రం కొంత ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడం ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో వారానికి ఒకటి చొప్పున వరుసగా మూడు వారాలలో మూడు హిట్స్ రావటంతో టాలీవుడ్ ఊపిరిపీల్చుకుంది. ఏప్రిల్ 5న” మజిలీ” , ఏప్రిల్ 12న “చిత్రలహరి”, ఏప్రిల్ 19న “జెర్సీ” చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. ఈ నెలలో మొత్తం 11 చిత్రాలు విడుదల కాగా మూడు హిట్స్ కాగా మిగిలిన 7 చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇక సినిమా వారు మాత్రమే శుభ మాసంగా భావించే మే నెలలో మొత్తం15 చిత్రాలు విడుదల కాగా మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ముగ్గురు అగ్ర నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన “మహర్షి” ఈ ప్రథమార్ధానికే టాప్ హిట్ గా , మహేష్ బాబు కెరీర్ కే టాప్ గ్రాసర్ గా సంచలన విజయాన్ని సాధించింది. ఈ నెలలో ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ గా విడుదలైన ఎ బి సి డి, సీత చిత్రాలు బాగా డిసప్పాయింట్ చేసాయి. మాసాంతంలో వచ్చిన” ఫలక్ నూమా దాస్” హైదరాబాద్ సిటీ వరకు బాగా సక్సెస్ అయింది. మొత్తం మీద ఓవర్సీస్, రాయలసీమలోని కొన్ని ఏరియాల్లో కొంత డ్రాపింగ్ ఉన్నప్పటికీ “మహర్షి” సాధించిన అద్భుత విజయమే ఈ సంవత్సరం మొత్తానికి చాలు అన్నంత రేంజిలో హిట్ అయింది . ఇక 2019 ప్రథమార్ధంలో చివరి మాసమైన జూన్ నెలకు వస్తే – ఈ నెలలో కూడా అత్యధికంగా 17 చిత్రాలు విడుదల కావడం గమనార్హం. అయితే ఎక్స్పెక్టెడ్ చిత్రాలు ఎక్కువగా ఉండటమే ఈ నెలలో ఉన్న ప్రత్యేకత. కాగా ఏమాత్రం అంచనాలు లేని కొన్ని సినిమాలు ఆడటం , ఎక్స్పెక్టెడ్ చిత్రాలు ప్లాప్ కావటంతో ఎలాంటి సినిమాలు తీయాలో… ఎలాంటివి తీయకూడదో అర్ధం కాని అయోమయంలో పడిపోయింది టాలీవుడ్. ముఖ్యంగా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా చిత్రాల మీద ప్రీ రిలీజ్ అంచనాలు లేవు. కానీ ఆ సినిమాలు విడుదలైన తరువాత అవి సాధిస్తున్న విజయాలు చాలా స్పూర్తిదాయకంగా ఉన్నాయి. ఇక ఈ నెలలో మంచి పబ్లిసిటీతో , ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన 7, హిప్పీ, వజ్రకవచధర గోవిందా, ఓటర్, స్పెషల్ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. మల్లేశం, గేమ్ ఓవర్, స్పెషల్, కల్కి వంటి చిత్రాలకు ప్రశంసలు లభించాయి. ఈ నెలలో మొత్తం మీద విడుదలైన 17 చిత్రాలలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. కల్కీ టాక్ బాగున్నప్పటికీ రెవిన్యూ ఇంకా పెరగాల్సి ఉంది. ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే ఈ ఆరు నెలల్లో తమిళ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళ భాషలకు చెందిన 44 డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. జనవరి 10న విడుదలైన రజనీకాంత్ ‘పేట’ తో ప్రారంభమైన అనువాద చిత్రాల అపజయ పరంపర కూడా యధావిధిగా కొనసాగుతుంది. గతంలో స్ట్రయిట్ చిత్రాల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన డబ్బింగ్ చిత్రాల ఊపు, ఉదృతి ఇప్పుడు బాగా తగ్గింది. తెలుగులో తనకంటూ రేంజ్ ని క్రియేట్ చేసుకున్న సూర్య నటించిగా ఇటీవల విడుదలైన ఎన్. జీ.కే. వంటి చెత్త చిత్రాలు ఇంకొన్ని వస్తే డబ్బింగ్ నిర్మాతలు, తెలుగు ప్రేక్షకులు అనువాద చిత్రాల ఊసు కూడా ఎత్తరు. 2019 ఫస్ట్ ఆఫ్ లో కాంచన-3, విజయ్ ఆంటోని కిల్లర్ వంటి రెండు మూడు అనువాద చిత్రాలు మాత్రమే విజయవంతమయ్యాయి. ఇదీ  2019 ప్రథమార్ధంలో విడుదలైన 93 స్ట్రైట్ అండ్ 44 డబ్బింగ్ చిత్రాల జయాపజయాల విహంగ వీక్షణం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=1KZdKlUWUm8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =