తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌… నందమూరి తారక రామారావు

Remembering Legendary Actor Sr NTR On His Birth Anniversary,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sr NTR Birth Anniversary Today,Sr NTR Birth Anniversary Special News,Legendary Actor Sr NTR Latest Updates,#HappyBirthdayLegendaryNTR
Remembering Legendary Actor Sr NTR On His Birth Anniversary

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు, ఇలవేలుపులవుతారు”… ఇది అక్షరాల పాటించారు కాబట్టే ఆయన తెలుగువారి ఇలవేలుపు అయ్యారు. యుగపురుషుడయ్యారు. ఆయన మరెవరో కాదు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. తెలుగు వాడు ముద్దుగా పిలుచుకునే… యన్టీఆర్. 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన య‌న్టీఆర్‌… తెలుగునాట సినీ, రాజకీయ రంగాల్లో చిరస్మ‌ర‌ణీయ ముద్ర వేశారు. నేడు ఆయ‌న 97వ జ‌యంతి. ఈ సందర్భంగా ఆ మ‌హాన‌టుడు, మ‌హానేత‌ గురించి కొన్ని జ్ఞాప‌కాలు:

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యన్టీఆర్ అంటే… ఒక సాహసం, ఒక ప్రయోగం, ఒక మొండితనం. ఈ లక్షణాలే యన్టీఆర్‌ను ఉన్నత శిఖరాలపై కూర్చోబెట్టాయి. కేవలం నటుడిగానే కాదు… దర్శకునిగా, నిర్మాతగా ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు.

కేవలం కథకి మాత్రమే విలువిచ్చే యన్టీఆర్… నటుడిగా శిఖర స్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నా… ఏ రోజు ఆ ఇమేజ్‌ను పట్టించుకోలేదు. కథ నచ్చితే చాలు గ్లామర్ పాత్రైనా, డీ-గ్లామర్ రోల్ అయినా చేసేసేవారు. అందమైన యువరాజుగా ‘జగదేకవీరుని కథ’లో నటించి… ఆ వెంటనే ‘కలసివుంటే కలదుసుఖం’లో అవిటివాడిగా పిలకతో కనిపించినా… అంత‌కంటే ముందే ‘చిరంజీవులు’లో అంధుడి పాత్రలో దర్శనమిచ్చినా… కెరీర్ ఉన్న‌త‌ స్థాయిలో ఉన్నప్పుడు ‘బడిపంతులు’ లాంటి వయసుకు మించిన పాత్రలను చేసినా… అటువంటి సాహసం కేవలం యన్టీఆర్‌కి మాత్రమే చెల్లింది. అంతేకాదు… నెగటివ్ పాత్రలను చేయడానికి కూడా వెనకాడని మనస్తత్వం ఈ మహానటుడి సొంతం. కె.వి.రెడ్డి లాంటి దర్శకులు ఎంత చెప్పినా వినకుండా… ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో రావణాసురుని పాత్రతో ప్రయోగం చేసి… ఆ పాత్రకే వన్నె తేవడం కాకుండా ఆ పాత్రను వేయొద్దని చెప్పిన కె.వి.రెడ్డి నుంచే ప్రశంసలు అందుకున్న మొండితనం యన్టీఆర్‌ది.

రాముడిగా, కృష్ణుడిగా, భీమసేనుడిగా, అర్జునుడిగా, దుర్యోధనుడిగా, భీష్ముడిగా, కర్ణుడిగా, బృహన్నలగా, కీచ‌కునిగా… ఇలా ఆయన చేసినన్ని పాత్రలు, వేసినన్ని గెటప్‌లు మరే నటుడు వేయలేదు, వేయలేరు కూడా. ఇలా… పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న యుగ పురుషుడు యన్టీఆర్. య‌న్టీఆర్ అంటే విభిన్న పాత్ర‌లు, ప‌లు ఘ‌న విజ‌యాలే కాదు… ప‌లు రికార్డులు కూడా. ముఖ్యంగా… 60వ దశకం యన్టీఆర్‌కు ఎంతో ప్రత్యేకమైన దశాబ్దంగా చెప్పుకోవచ్చు. 60వ దశాబ్దంలో ఒకే కేంద్రంలో (విజయవాడ) 40 డైరెక్ట్ శతదినోత్సవ చిత్రాలు గల ఏకైక హీరో యన్టీఆర్ మాత్రమే. ఇది తెలుగు చలన చిత్ర చరిత్రలో ఏ దశాబ్దానికైనా ఆల్ టైమ్‌ రికార్డు. అంతేకాదు… 1962లో ‘గులేబకావళి కథ’, ‘భీష్మ’, ‘గుండమ్మ కథ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ వంటి చిత్రాలతో జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రక… ఇలా ప‌లు జాన‌ర్స్‌లో శతదినోత్సవాలు చూసిన‌ ఘనత కూడా ఈ మహానటుడి సొంతం.

ఇక యన్టీఆర్‌లోని దర్శకుని విషయానికొస్తే… దర్శకుడిగా ఏ ఒక్క జానర్‌కో పరిమితం కాకుండా… పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం… ఇలా ప‌లు జాన‌ర్‌ చిత్రాలను తెరకెక్కించారు. అంతేకాదు… ఆ యా జానర్‌లలో (‘సీతారామ కళ్యాణం’, ‘గులేబకావళి కథ’, ‘తల్లా? పెళ్లామా?’, `శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) శతదినోత్సవ చిత్రాలను రూపొందించిన రికార్డు కూడా యన్టీఆర్ సొంతం.

ఇక నిర్మాతగా ఓ వైపు వాణిజ్య అంశాలను దృష్టిలో పెట్టుకుంటూనే… మానవతా విలువలున్న సినిమాలను నిర్మించారు యన్టీఆర్. వాటికి ఉదాహరణగా… ‘తోడు దొంగలు’, ‘సీతారామ కళ్యాణం’, ‘వరకట్నం’, ‘కోడలు దిద్దిన కాపురం’ వంటి పలు చిత్రాలను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులను కూడా అందుకున్నారు.

సినీ రంగంలోనే కాదు… రాజకీయ‌రంగంలోనూ తనదైన ముద్రను వేసారు యన్టీఆర్. తెలుగు వాడి ఆత్మ గౌరవం అనే నినాదంపై తెలుగు దేశం పార్టీని స్థాపించి… కేవలం 8 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం రాజకీయ చరిత్రలోనే సంచలనం.

ఇలా… సినీ, రాజ‌కీయ రంగాల్లో పెను సంచలనాలకు చిరునామాగా నిలిచిన య‌న్టీఆర్‌… తెలుగు వారి ఇలవేల్పై వారి గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు.

[subscribe]
[youtube_video videoid=NGFeA0FJ3lI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =