ఉన్నత ప్రమాణాల నట శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా “మయూఖ యాక్టింగ్ స్కూల్” ప్రారంభిస్తున్నాను – ఉత్తేజ్

Uttej Starts his Own Acting School Named Mayukha Acting School,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Uttej Starts his Own Acting School,Actor Uttej Own Acting School Name,Actor Uttej Starts Acting School,Actor Uttej Launches an Acting School,
Uttej Starts his Own Acting School Named Mayukha Acting School

ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుండేది పుష్పక విమానం .అలాగే ఎంతమంది వచ్చినా మరొకరికి చోటుండేది చిత్ర పరిశ్రమ. అలాంటి చిత్రపరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదో ఒక క్రాఫ్ట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. వారిలో ఎక్కువ శాతం ప్రయత్నించేది నటులు కావాలనే. అయితే ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నాలుగు డైలాగులు చెప్పినంత మాత్రాన ఎవరూ నటులై పోలేరు. నిజానికి నటన అన్నది ఒక తీరని దాహం…. అలాంటి నటనకు “శిక్షణ” చాలా అవసరం. ఎలాంటి శిక్షణ లేకుండానే గొప్ప నటులు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి శిక్షణతో ఉత్తమ నటులుగా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నిజానికి మంచి శిక్షణ తీసుకొని నటులుగా వచ్చిన వాళ్లకు ఉండే కాన్ఫిడెన్స్ శిక్షణ లేకుండా వచ్చిన వాళ్లకు ఉండదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఉత్తమ నటులను తీర్చిదిద్దడానికి అవసరమైన ఉత్తమ నట శిక్షణాలయాలు ఉన్నాయా అన్నది ప్రశ్న. పేరుకు,లెక్కకు కొన్ని శిక్షణాలయాలు ఉన్నప్పటికీ ఉన్నత ప్రమాణాలతో, ఉన్నత శ్రేణి నట శిక్షణ ఇవ్వగలిగిన యాక్టింగ్ స్కూల్స్ చాలా తక్కువ. ఆ అవసరాన్ని, ఆ కొరతను దృష్టిలో పెట్టుకొని అత్యున్నత ప్రమాణాలతో అప్డేటెడ్ యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేందుకు హైదరాబాద్ లో ఒక కొత్త యాక్టింగ్ స్కూల్ రాబోతుంది. అదే” మయూఖా టాకీస్” యాక్టింగ్ స్కూల్. ప్రముఖ నటుడు, రచయిత, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన “ఉత్తేజ్” ఈ మయూఖ యాక్టింగ్ స్కూల్ ను హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గుడా లో స్థాపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాక్టింగ్ స్కూల్ వ్యవస్థాపక లక్ష్యాల గురించి , విధివిధానాల గురించిన విశేషాలను ఉత్తేజ్ మాటల్లోనే విందాం.

* ఉత్తేజ్ గారు.. మీరు మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్ స్థాపించటానికి ముఖ్య కారణం ఏమిటి?

ఉత్తేజ్ : సినిమా యాక్టర్ కావాలి అనే లక్ష్యంతో రోజుకు కొన్ని వందల మంది ఫిల్మ్ ఇండస్ట్రీ కి వస్తున్నారు. వారిలో అతి కొద్ది మంది మాత్రమే కొద్దిపాటి అవకాశాలను దక్కించుకోగలిగితే కొన్ని వేల మంది నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. ఆ కొద్దిపాటి అవకాశాలు వచ్చిన వాళ్ళు కూడా నటన పరంగా తమ టాలెంట్ ను ప్రూఫ్ చేసుకోలేకపోతున్నారు. నటుడు అనిపించుకోవటానికీ, “మంచి నటుడు” గా ఎదగటానికి
మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మంచి నటుడు అనిపించుకోవటానికి అవసరమైన రిఫైన్డ్ యాక్టింగ్ చాలామందిలో కనిపించడం లేదు. ఇచ్చిన పాత్రను ఆకళింపు చేసుకుని, ఆవహింపచేసుకుని నటించడానికి అవసరమైన “ట్రైన్డ్ , రిఫైన్డ్ అండ్ ప్రొఫెషనల్” యాక్టర్స్ ను అందించే లక్ష్యంతో “మయూఖ యాక్టింగ్ స్కూల్” ను ప్రారంభిస్తున్నాను.

* సంపాదనే లక్ష్యంగా చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ పుట్టుకొస్తున్న తరుణంలో మంచి నటులను తయారుచేయాలనే లక్ష్యంతో యాక్టింగ్ స్కూల్ ను ప్రారంభిస్తున్నామని మీరు చెప్తున్నారు. ఇది బాధ్యతా ? ప్యాషనా ?

ఉత్తేజ్ : డబ్బు సంపాదించాలి అనుకుంటే ప్రస్తుతం ఫుడ్ బిజినెస్, పౌల్ట్రీ బిజినెస్ వంటివి చాలా లాభదాయకంగా ఉన్నాయి. వాటిలో చాలా మంచి సంపాదన ఉంటుంది. ఇక్కడ మేము వసూలు చేసేది చాలా తక్కువ ఫీజు. అలాంటి తక్కువ ఫీజ్ స్ట్రక్చర్ తో లక్షల లాభాలు సంపాదించడం సాధ్యపడదు. 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉండి, ఈ ఫీల్డ్ తో మమేకమైన వ్యక్తిగా యాక్టింగ్ పట్ల ప్యాషన్ తో చేస్తున్నానే తప్ప డబ్బు సంపాదన లక్ష్యంతో కానేకాదు. యాక్టింగ్ స్కూల్ కంటే ముందు నేను “మయూఖా డాన్స్ స్కూల్” రన్ చేస్తున్నాను. దానికి ఎక్స్టెన్షనే ఈ ” మయూఖా యాక్టింగ్ స్కూల్ ” . డాన్స్ స్కూల్ తో పాటే యాక్టింగ్ స్కూల్ కూడా ప్రారంభించే వాడిని. కానీ మంచి ఫ్యాకల్టీ కోసం ఇన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. గొప్ప ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దొరికారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను.

* యాక్టింగ్ స్కూల్ ప్రారంభించడానికి మీ వ్యక్తిగత అనుభవం ఏ మేరకు తోడ్పడుతుంది అనుకుంటున్నారు?

ఉత్తేజ్ : చిత్ర పరిశ్రమతో నా వ్యక్తిగత అనుభవ, అనుబంధాలను పురస్కరించుకుని, క్రోడీకరించుకొని యాక్టింగ్ స్కూల్ ప్రారంభిస్తున్నాను. ఊహ తెలిసిన నాటి నుండే నాది నటనతో ముడిపడిన జీవితం. మా నాన్న ఆకుపత్ని శ్రీరాములు గారు స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, బుర్రకథ కళాకారులు. రజాకార్ల ఉద్యమంలో యువతను ఉర్రూతలూగించిన నాన్నగారు నాకు చిన్నప్పుడే బొట్టు పెట్టి బుర్రకథలు, ఏకపాత్రాభినయాలు చేయించారు.ఐదేళ్ళ వయసులోనే నాతో దుర్యోధన ఏకపాత్రాభినయం చేయించి తొడలు విరిగిన దుర్యోధనుని బాధ తెలియటం కోసం రెండు కాళ్లు వెనక్కు విరిచికట్టి యాక్టింగ్ చేయించారు. అలా కన్నతండ్రే తొలి గురువుగా నా నటనాభ్యాసం ప్రారంభమైంది.
ఆ తరువాత దీక్షితులు మాస్టారు దగ్గర చేరి అక్కడే ఉంటూ, అక్కడే తింటూ ఆయన శిక్షణలో నటనను సశాస్త్రీయంగా నేర్చుకున్నాను.

ఆ తరువాత ‘శివ’ చిత్రంతో రాంగోపాల్ వర్మ దగ్గర చేరి నటనతో పాటు అసిస్టెంట్ గా, అసోసియేట్ గా 13 చిత్రాలకు పనిచేశాను. వాటిలో చాలా చిత్రాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేశాను. మనీ, మనీ మనీ, రాత్రి, అంతం, హిందీ రాత్రి చిత్రాలకు రచనా సహకారం చేశాను.
ఆ తర్వాత కృష్ణవంశీ దగ్గర నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, డేంజర్, రాఖీ వంటి హిట్ చిత్రాలకు కో డైరెక్టర్ కం డైలాగ్ రైటర్ గా పని చేశాను. నటుడిగా మూడు వందల చిత్రాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 60 చిత్రాలకు పని చేశాను. ఈటీవీ, మాటీవీ ప్రోగ్రామ్స్ తో పాటు కొన్ని వందల ఫంక్షన్స్ కు యాంకర్ గా చేశాను. రంగస్థలం మీద కన్యాశుల్కం, శ్రీ కృష్ణ దేవరాయలు తో పాటు చాలా సోషల్ డ్రామాల్లో నటించాను. ఒక కవిగా సమకాలీన సామాజిక పరిస్థితుల మీద సోషల్ మీడియాలో వందలాది కవితలు రాశాను. ఇదీ నా అనుభవం. సినీ, నాటక, రచనా రంగాలతో ఉన్న ఈ అనుభవ, అనుబంధాలే యాక్టింగ్ స్కూల్ స్థాపనకు నన్ను ఇన్స్పైర్ చేశాయి.

* మంచి ఫ్యాకల్టీ కోసం ఎదురు చూశాను అని చెప్పారు. మరి ఇప్పుడు దొరికిన ఫ్యాకల్టీ ఎవరు? వాళ్ల వివరాలు ఏమిటి?

ఉత్తేజ్: నాతోపాటు మరో నలుగురు మెయిన్ ఫ్యాకల్టీ ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకోవటమే కాకుండా గత 10 సంవత్సరాల నుండి ఇండియాలోని టాప్ ఇన్స్టిట్యూట్స్ లో ఫ్యాకల్టీగా పనిచేసి , కొన్ని వందల యాక్టింగ్ వర్క్ షాప్స్ నిర్వహించిన బషీర్, అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యాక్టింగ్ లో పీహెచ్డీ చేసి నట శిక్షణలో
విశేష అనుభవం ఉన్న రామ్మోహన్ , మా గురువుగారు దీక్షితులు గారి అబ్బాయి సీనియర్ యాక్టింగ్ కోచ్, రామానాయుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో ఫ్యాకల్టీగా చేసిన శ్రీధర్, డిప్లమో ఇన్ యాక్టింగ్ చేసి యాక్టింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసిన అనుభవం ఉన్న కృష్ణ …
వీళ్ళు నా ఫ్యాకల్టీ.

* మయూఖ యాక్టింగ్ స్కూల్ లో అడ్మిషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? కోర్స్ వివరాల గురించి చెప్పండి.

ఉత్తేజ్: ఏప్రియల్ థర్డ్ వీక్ లో అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి. ఇది రెండు నెలల యాక్టింగ్ కోర్స్ . ఫీజు 75,000/. అడ్మిషన్ టైమ్ లో 50000 కట్టాలి… మిగిలిన ఇరవై ఐదు వేలు నెల రోజుల తర్వాత కట్టాలి. అప్లికేషన్ ఫామ్ రూ.200/ . అప్లికేషన్స్ వెబ్ సైట్స్ లో డౌన్లోడ్ చేసుకునే పద్ధతి లేదు. స్వయంగా వచ్చి అన్ని విషయాలు సంప్రదించి అప్లికేషన్ తీసుకుంటేనే అది ఒక జర్నీ బిగినింగ్ అనే ఫీల్ కలుగుతుంది.

* అడ్మిషన్ క్రైటీరియా ఏమిటి? 75000 కట్టగలిగిన ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ అయిపోవచ్చా ?

ఉత్తేజ్ : అడ్మిషన్ కు డబ్బు ఒక్కటే ప్రయారిటీ కాదు. దానికి ఒక మానిటరింగ్ ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ మీద అవగాహన ఉండాలి. ఆ విషయాన్ని అడ్మిషన్ టైమ్ లోనే ఫ్యాకల్టీ నిర్ణయిస్తుంది.

* రెండు నెలల యాక్టింగ్ కోర్సు తరువాత మీ స్టూడెంట్స్ కు సినిమాల్లో అవకాశాలు ఇప్పించే బాధ్యతను మీరు తీసుకుంటారా?

ఉత్తేజ్ : అలాంటి ప్రామిస్ లు మేమే కాదు ఎవరు చేసినా అది పచ్చి మోసమే. అలాంటి ఆశలు ఎవరూ ఎవరికీ కల్పించకూడదు. రెండు నెలల కోర్స్ టైంలో 15 రోజులకు ఒకసారి చొప్పున సినీ ప్రముఖుల సమక్షంలో డేమోన్స్ట్రేషన్స్ జరుగుతాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో మా స్టూడెంట్స్ ప్రొఫైల్స్ పెడతాం. కోర్స్ ముగింపు సమయంలో సినీ ప్రముఖుల సమక్షంలో కాన్వకేషన్ ఏర్పాటు చేసి సర్టిఫికెట్ తో పాటు వాళ్ళు నటించిన పదినిమిషాల యాక్టింగ్ డెమో ను పెన్ డ్రైవ్ లో గిఫ్ట్ చేస్తాం.

* మయూఖా యాక్టింగ్ స్కూల్ లొకేషన్, అడ్రస్, టైమింగ్స్, అకామిడేషన్ వివరాలు చెప్తారా?

 ఉత్తేజ్ అడ్రస్: మయూఖా టాకీస్,
హౌస్ నెంబర్:8-3- 423, నియర్ ఆర్బిఐ క్వార్టర్స్, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్.

ఫోన్ నెంబర్స్: ల్యాండ్ లైన్ 040 – 23743555 /
సెల్ నెంబర్: 9912185072 .

టైమింగ్స్: ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. ఆదివారం సెలవు. ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ పే చేయటం కోసం కేవలం 18 అడ్మిషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అప్లికేషన్లు ఇష్యూ చేస్తున్నాము. అప్లికేషన్లు తీసుకోవటానికి ఏప్రిల్ 15 ఆఖరి తేదీ. ఏప్రిల్ 19, 20 తేదీలలో అడ్మిషన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 24 నుండి క్లాసులు ప్రారంభం అవుతాయి. మా యాక్టింగ్ స్కూల్ ఎల్లారెడ్డి గూడ లో ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల చాలా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి అకామిడేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేదు.

* మీకు చిత్ర పరిశ్రమలో విశేష పరిచయాలు ఉన్న నేపథ్యంలో సినీ ప్రముఖుల నుండి ఎలాంటి సహకార, ప్రోత్సాహాలను ఆశిస్తున్నారు.

ఉత్తేజ్: చిత్రపరిశ్రమలోని ప్రముఖులు చాలామంది తమ అభినందన సందేశాలు పంపించారు. వారి సహకారం, ప్రోత్సాహం విషయంలో ఎలాంటి సందేహము లేదు. తమ రిక్వైర్మెంట్ ను బట్టి మా “మయూఖ యాక్టింగ్ స్కూల్” స్టూడెంట్స్ కు అవకాశాలు ఇస్తామని చాలామంది ప్రముఖులు హామీ ఇచ్చారు. ఇవి- సీనియర్ యాక్టర్ అండ్ రైటర్ ఉత్తేజ్ ప్రారంభిస్తున్న ” మయూఖా యాక్టింగ్ స్కూల్” వివరాలు విశేషాలు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =