‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ భరద్వాజ్… వెండితెరపై కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర పోషించి నటిగా మరో మెట్టు ఎదిగింది. అంతేకాదు… అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే… స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘యాత్ర’లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు ‘సచ్చిందిరా గొర్రె’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’లో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోందట అనసూయ. గతేడాది మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘విన్నర్’ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘విన్నర్’ తర్వాత మళ్ళీ అనసూయ చేస్తున్న ప్రత్యేక గీతం ఇదే కావడం గమనార్హం.
ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్ లో ఫోక్ అండ్ ఫన్ సాంగ్‌గా సాగే ఈ పాటే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే… 2016లో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో కూడా అనసూయ మరదలు పాత్ర చేయడమే కాకుండా టైటిల్ సాంగ్‌లో నర్తించిన సంగతి తెలిసిందే. 2016 సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో… అప్పుడు నాగ్ సినిమా లాగే ఇప్పుడు వెంకీ మూవీ కూడా మంచి విజయం సాధించి అనసూయకు మరింత గుర్తింపు తీసుకు వస్తుందేమో చూడాలి.
