ఓటు విలువ పై మురుగదాస్ – విజయ్ లు ఇచ్చిన సెల్యులాయిడ్ స్పీచ్ సర్కార్

Latest Telugu Movie News, Latest Telugu Movie Reviews, Sarkar Movie Public Talk, Sarkar Movie Review, Sarkar Movie Review And Rating, Sarkar Movie Story, Sarkar Review, Sarkar Telugu Movie Live Updates, Sarkar Telugu Movie Plus Points, Sarkar Telugu Movie Public Response, Sarkar Telugu Movie Review, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Sarkar Telugu Movie Review

నటీనటులు:
విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్,యోగి బాబు,
రాధా రవి,తులసి,లివింగ్ స్టన్.

సాంకేతిక వర్గం:
రచన దర్శకత్వం: మురుగదాస్
నిర్మాత: కళానిధి మారన్
రచన: బి. జయ మోహన్
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ .

మురుగదాస్-
కమర్షియల్ సినిమాలో సామాజిక అంశాలను ఆసక్తిదాయకంగా, లాజిక్ మిస్ అవకుండా మిళితం చేసి అద్భుత విజయాలను అందుకున్న గొప్ప దర్శకుడు. రజినీకాంత్- కమలహాసన్ తరువాత కోలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజిని సొంతం చేసుకుని టాప్ స్టార్ గా వెలుగుతున్న హీరో విజయ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కత్తి, తుపాకీ చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. ఈ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సన్ టీవీ నిర్మించిన భారీ చిత్రం “సర్కార్” స్కై టచ్చింగ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈరోజు(6/11/2018) విడుదల అయింది. ఎలా ఉందో చూద్దాం.

ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయటానికి పోలింగ్ బూత్ కి వెళితే మనకంటే ముందే మన ఓటు వేరెవరో ఏసేస్తేనో లేక మన ఓటు అసలు కనిపించకపోతేనో మనం సింపుల్ గా ఒక నవ్వు నవ్వేసి లేక ఒక నిట్టూర్పు విడిచేసి వస్తాం. కానీ రాజ్యాంగంలోని 49 సి సెక్షన్ ప్రకారం మన ఓటును వేరెవరో వేస్తేనో లేక ఓటు కనిపించకపోతేనో ఏకంగా ఎలక్షన్నే ఆపేయవచ్చు అనే ఒక గొప్ప పాయింట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా టేక్ ఆఫ్ అవుతుంది సర్కార్ సినిమా.

అమెరికాలోని జి ఎల్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో అయిన సుందర్ రామస్వామి( విజయ్) కేవలం తన ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ఇండియా వస్తాడు. ప్రపంచంలోని పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలను బలవంతంగా కొనుగోలు చేసి తన కంపెనీలో మెర్జ్ చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించే ఒక సాఫ్ట్ వేర్ జయింట్ గా సుందర్ ప్రేక్షకులకు పరిచయం అవుతాడు.
కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో తన మందీ మార్బలంతో ఇండియాలో అడుగు పెడతాడు సుందర్. ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఎలక్షన్ బూత్ కు వెళ్లి ఓటు వేయబోతే అప్పటికే తన ఓటును ఎవరో వేసేశారు. క్షణాల్లో ఈ వార్త సంచలన అవుతుంది. ఈ విషయాన్ని అతను తేలిగ్గా తీసుకుని తిరిగి అమెరికా వెళ్ళి పోతాడు అనుకుంటారు అందరూ. కానీ ఎలక్షన్ కమిషన్ ను కలిసి ఆ నియోజకవర్గంలో ఎన్నికనే నిలిపేస్తాడు. ఎన్నికల కమిషన్ కు , న్యాయమూర్తి కే తెలియని “సెక్షన్ 49 సి” గురించి అద్భుతంగా వాదించి ఎన్నికలు నిలిపి వేస్తాడు సుందర్. మరో వారం రోజుల్లో ఆ బూత్ లో ఎన్నికలు నిర్వహించి తన ఓటు హక్కును వినియోగించుకునేలా కోర్ట్ ఆర్డర్ పొందుతాడు.
ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన పరిణామాలు ఏమిటి?

ఎన్నిక నిలిపివేత అనేది ఏ పరిణామాలకు దారితీసింది.?

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన పుణ్య మూర్తి ఎలా రియాక్ట్ అయ్యాడు?
లండన్ లో ఉన్న అతని కుమార్తె కోమలవల్లి హటాత్తుగా ఇండియా కు ఎందుకు వచ్చింది?

ఏమి చేసింది ? చివరకు ఏం జరిగింది?

ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది “సర్కార్” ద్వితీయార్థం.

మురుగదాస్ దర్శకత్వం:

చాలా చిన్నదిగా అనుకుంటూ నిర్లక్ష్యం చేసే ఓటు హక్కు విలువ గురించి ఒక మంచి సినిమా తీయాలి , ఆ విషయంగా జనంలో మంచి అవేర్నెస్ రావాలి అనే లక్ష్యంతో మురుగదాస్ సర్కారు స్క్రిప్ట్ తయారుచేసుకుని ఉండవచ్చు. ఆ పర్టిక్యులర్ పాయింట్ హీరో విజయ్ కు బాగా నచ్చి ఉండవచ్చు. అయితే ఆ చిన్న పాయింట్ మీద ఆధారపడి రెండున్నర గంటల సినిమా తీయాలి అంటే సన్నివేశాలలో, సంభాషణల్లో ఎంత డెప్త్ ఉండాలి..? ఎంత సందర్భ శుద్ధి ఉండాలి? కానీ సర్కార్ లో లోపించింది అవే. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథాబలం లోపించటంతో సన్నివేశాలన్నీ కంగాళీగా, కలగూరగంపలా తయారయ్యాయి. సన్నివేశంలో లేని బలాన్ని బిల్డ్అప్ ద్వారా చొప్పించే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా సన్నివేశాలు కృతకంగా, అసహజంగా అనిపిస్తాయి. ఓటు విలువ గురించి, ఓటు హక్కు వినియోగం గురించి చాలా గొప్పగా చెబుతూ చాలా ఆసక్తిదాయకమైన చర్చతో ప్రారంభమైన సర్కార్ పోను పోను అసందర్భ, అసహజ సన్నివేశాల మయంగా మారిపోయింది. ఇందులో ప్రత్యర్థి వర్గమైన ముఖ్యమంత్రి సెటప్ చాలా పేలవంగా ఉంది. హీరో ను ఎదుర్కోవడం కోసం విదేశాల నుండి పెద్ద బిల్డప్ తో అతని కుమార్తె కోమలవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్) వచ్చిన తరువాత హీరోకు ఆమెకు మధ్య జరిగే మైండ్ గేమ్ లో ఏ మాత్రం నవ్యత, నాణ్యత కనిపించవు. సానుభూతి కోసం ముఖ్యమంత్రి అయిన కన్నతండ్రిని చనిపొమ్మని కోరడం అతను నిజంగానే చనిపోతూ “ఆ సుందర్ గాడిని మాత్రం వదలద్దు”
అని చెప్పటం అతికి పరాకాష్ట గా అనిపిస్తుంది. ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా అసహజంగా, అసంభవంగా అనిపిస్తాయి. రమణ,
గజినీ, కత్తి, తుపాకీ వంటి పవర్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్ చిత్రాలు అందించిన మురుగదాస్ నుండి నిన్న స్పైడర్, ఈరోజు సర్కార్ వంటి అసంబద్ధ చిత్రాలు రావటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్:
– – – – – – – – -: – – – – – – – – –
పెద్ద అందగాడు కాకపోయినప్పటికీ ఒక ప్రత్యేక తరహా యాక్టింగ్ స్టైల్ ఉన్న స్టార్ గా విజయ్ కు తమిళనాడులో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పాత్ర స్వభావ స్వరూపాలను అర్థం చేసుకుని మంచి హావభావాలు పలికించే అండర్ ప్లే ఆర్టిస్టుగా పేరున్న విజయ్ సర్కారులో చేసిన ఓవర్ ప్లే చూస్తే చిరాకు పుడుతుంది. ప్రతి
సీన్ ను ఇంట్రడక్షన్ సీన్ లాగానే ఓవర్ బిల్డప్ చేసి విజయ్ తో ఓవరాక్షన్ చేయించాడు దర్శకుడు మురుగదాస్.
ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్ లవర్ కు తక్కువ, హీరో పి.య్యే. కు ఎక్కువ అన్నట్లు గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది. ఇక ఫిమేల్ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కొంతమేర పర్వాలేదనిపిస్తుంది. మిగిలిన ఆర్టిస్టుల పరంగా ఎవరికి చెప్పుకోదగ్గ పాత్రలు లేవు… చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ లు కనిపించవు.

సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ఎంత గొప్ప టెక్నీషియన్స్ పనిచేసినప్పటికీ ఒక ఫూలిష్ స్క్రిప్ట్ ను నిలబెట్టలేరు అన్న వాస్తవం సర్కార్ విషయంలో మరోమారు రుజువైంది. ఇది ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన సినిమా అంటే ఏ మాత్రం నమ్మబుద్ది కాదు. పాటల్లో గాని, రీ-రికార్డింగ్ లో గాని ఏ ఆర్ రెహమాన్ మార్క్ ఎక్కడా కనిపించదు. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రామ లక్ష్మణ్ ఫైట్స్ ఇవి టెక్నికల్ గా ఈ సినిమాలో అభినందనీయమైన అంశాలు. సన్ టీవీ వారి నిర్మాణ ప్రమాణాలు అత్యంత భారీ స్థాయిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు.

మొత్తానికి చాలా కాలం తరువాత రిపీట్ అయిన మురుగదాస్- విజయ్ ల కాంబినేషన్ నుండి ప్రేక్షకులు ఆశించిన సినిమా ఇది కానే కాదు. ఇది ఒక కొత్త అమెచ్యూరిష్ డైరెక్టర్ చేసిన రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ అటెంప్ట్ లాగా అనిపిస్తుందే తప్ప మురుగదాస్ స్థాయి దర్శకుడు నుండి వచ్చిన సినిమాగా అనిపించకపోతే అది ప్రేక్షకుల తప్పు కాదు.

 

 

 

సర్కార్ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here