కళారంగంలో అభినందన – బంధువర్గంలో అభిశంసన – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 13, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 13

(రీ క్యాప్)
( తొలి సెట్ వర్క్ పూర్తయి రెండవ షెడ్యూల్ కు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఒక అనుకోని అవాంతరం ఎదురయింది. ఇప్పుడేం చేయాలి)

అవును ఇప్పుడు ఏం చేయాలి!? ఇంతకీ ఏమిటా అవాంతరం.? రామబ్రహ్మం గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్లు ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు.. కాదు.. హెచ్చరించారు.చిత్ర నిర్మాణం ఆగిపోయే పరిస్థితి ఎదురయింది. ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు అని భావించిన మధుసూదన రావు, కాజా వెంకట్రామయ్య గార్లను సలహా అడిగారు.ఎల్.వి.ప్రసాద్ గారిని దర్శకుడిగా పెట్టి సినిమా పూర్తి చేయమని సలహా ఇచ్చారు. అంతకుముందు ఎల్.వి. ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన సారథి వారి “గృహప్రవేశం” చిత్రాన్ని వీరి చూసి ఉండటమే అందుకు కారణం.

ఎల్ వి ప్రసాద్ గారు పల్నాటి యుద్ధం దర్శకత్వ బాధ్యతను స్వీకరించి షూటింగ్ పూర్తి చేశారు.ఏదో పనిమీద మద్రాసు వచ్చి ఉన్న మధుసూదనరావును రషెస్ చూడటానికి పిలిచారు రామబ్రహ్మం గారు.అందులో బాలచంద్రుడు పాత్రకు ఎల్.వి. ప్రసాద్ గారు ఒక మేనరిజం పెట్టారు.” నువ్వు ఎప్పుడు ఇంతే నాన్న” ఇది ఆ మేనరిజం. ఇది రామబ్రహ్మం గారికి నచ్చలేదు. గుర్రుగా చూశారు మధుసూదనరావు వైపు – అదేదో ఆయనే పెట్టినట్టు.” బాలచంద్రుడి పాత్ర చాలా ధీరోదాత్తమైనది, వీరోచితమైనది. ఆ క్యారెక్టరైజేషన్ చాలా గొప్పగా ఉండాలి అని చెప్పింది నువ్వే కదా! మరి ఇదేమిటి? ఆఖరికి యుద్ధభూమిలో చనిపోతూ కూడా అదే కూత ” – విసుక్కున్నారు రామబ్రహ్మం గారు.ఎల్.వి.ప్రసాద్ ను సజెస్ట్ చేసింది నువ్వే కదా అన్నది ఆయన నిష్టూరం.
అవునండి- ఆయన కమర్షియల్ గా ఆలోచించి అలా చేసిఉంటారు.. పాత్ర ఔచిత్య౦ తో పాటు కొంత కమర్షియల్ అవుట్ లుక్ కూడా అవసరమే కదా! అంటూ కొంతవరకు నచ్చచెప్పారు మధుసూదన రావు.

మొత్తానికి చిత్ర నిర్మాణం పూర్తయింది. కానీ విడుదలకు ముందే రామబ్రహ్మం గారు కన్నుమూశారు.పల్నాటి యుద్ధం పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత మద్రాసు రాకపోకలతో మధుసూదన రావుకు పరిచయాలు బలపడ్డాయి. ఆయన సలహా సంప్రదింపులకు విలువ, గౌరవం పెరిగాయి. పరిచయస్తులైన నిర్మాతలు వారి చిత్రాలు రిలీజ్ అయిన వెంటనే మధుసూదన రావు పంపే రివ్యూ ల కోసం ఎదురు చూడటం పరిపాటి అయింది.

ఓ వైపు ఘంటసాల బలరామయ్య, భరణీ పిక్చర్స్ అధిపతి పి.ఎస్.రామకృష్ణారావు, శ్రీమతి భానుమతి రామకృష్ణ, వినోదా పిక్చర్స్ డి.ఎల్., వేదాంతం రాఘవయ్య వంటి ప్రముఖులతో పరిచయాలు, సాన్నిహిత్యాలను విస్తృతం చేసుకుంటూ మరొకవైపు నాగేశ్వరరావు పరిస్థితిని, భవిష్యత్తును సమీక్షించుకుంటూ ఇంకొకవైపు పరిషత్ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్రను నిర్వహిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండేవారు మధుసూదనరావు.కానీ ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది.ప్రతి ప్రయత్నానికి ఒక ఫలితం ఉంటుంది.ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది.మరి

మధుసూదన రావు లక్ష్యం ఏమిటి?

గమ్యాలు, లక్ష్యాలు, పరిధులు, పరిమితులు నిర్దేశించటం సాధ్యం కాని వృత్తులు ప్రవృత్తులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కళాకారుల వృత్తి ప్రవృత్తులు ప్రథమమైనవి.
కళకు కళా జీవులకు ఆరంభాలే కాని అంతాలు ఉండవు. అంతాలు అంచులు ఉంటే అది కళ కాదు. కళాజీవి అంటే ముఖానికి రంగు వేసుకునే వాడు ఒక్కడే కాదు. ఆ రంగులు అద్దిన వాడు మొదలు ఆ రంగు పొంగులను రంగస్థలానికి ఎక్కించి రసావిష్కరణ గావించే రసజ్ఞులు కూడా కళాజీవులే, కళాకోవిదులే, కళాస్రష్టలే.ఒక దశాబ్దం పాటు రంగస్థలానికి విశిష్టమైన సేవలందించిన మధుసూదన రావు కు కళారంగంలో ఎంతో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు లభించినా సమస్థాయిలో బంధువర్గంలో లభించలేదు.

ఒకసారి బంధువుల ఇంట్లో పెళ్లి కి వెళ్ళినప్పుడు “అల్లుడు గారు ఏం చేస్తున్నారు” అని ఎవరో అడిగితే ” “బిఎ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి నాటకాలు ఆడిస్తున్నార”ని అవహేళనగా సమాధానం ఇచ్చారట మధుసూదన రావు మామగారు.ఆ సమాధానంలో ఉన్న ఎద్దేవా, హేళన సూటిగా మధుసూదనరావు గుండెను తాకాయి.సమాజానిది ప్రాక్టికల్ అవుట్ లుక్ .మామగారి అవహేళనలో హెచ్చరిక ఏదో స్ఫురించింది.అప్పుడు ప్రారంభమైంది ఆలోచన.అప్పుడు ప్రారంభమైంది అంతర్మధనం.నాటకరంగ సేవ, తద్వారా తనకు లభించిన పేరు ప్రఖ్యాతులు తనలోని కళారాధనను సంతృప్తిపరచగలిగాయి గానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని సంతరించుకోవటానికి, ఒక నికరమైన వృత్తిని చేపట్టటానికి దోహదం చేయలేదు.

మామ గారి మాటల్లో ఉద్యోగం సద్యోగం లేదు అనే భావన కొట్టొచ్చినట్లుగా కనిపించింది. బంధువర్గంలోను, కుటుంబసభ్యుల్లో కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే మంచిదనే ఉద్దేశం వెల్లడైంది.
అయితే ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదు. ఒక పరిధిలో ఒక పరిమితమైన చట్రంలో పడి ఎదుగూ బొదుగూ లేని, ఎలాంటి సాహసాలు చేయలేని సగటు జీవితానికి తనను తాను కుదించుకోవటం మధుసూదన రావుకు ఏ మాత్రం ఇష్టం లేదు.అయితే ఏం చెయ్యాలి?అంతరంగంలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు జరిగాయి.

ఇన్నేళ్లపాటు తను అంకితమై , అర్పిత మై ఆరాధించిన ళారంగంలోనే తన భావి జీవిత గమనానికి బాటలు వేసుకుంటే …?నిర్మాతగా చిత్రరంగ ప్రవేశం చేస్తే..?అయితే ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. చాలాకాలంగా మనసులో అస్పష్టంగా మెదులుతున్నదే.ఆలోచనలు అస్తిత్వాన్ని సంతరించుకునే అవసరం ఇప్పుడొచ్చింది. అయితే అందుకు అవసరమైన అర్హతలు ఏమిటి?తనకున్న అనుభవం ఏమిటి?అవకాశాలు ఏమిటి?ఇన్నాళ్ల కళారంగ సేవ తనకు ఆమాత్రం అర్హతలను , అనుభవాన్ని ఇవ్వలేదా?

పదుగురు మెచ్చే సద్విమర్శనా శక్తి, సామాజిక దృక్పథం, ప్రగతిశీల, ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, కళాత్మక భావ సంపత్తిని సముపార్జించుకుంది ఈ రంగస్థల సేవా జీవితం నుండే కదా?
చిత్ర రంగ ప్రముఖులతో పరిచయాలు , సాన్నిహిత్యాలు, సత్సంబంధాలు ఏర్పడి తన మాటకు ఒక విలువ, గౌరవం పెరగటానికి మూలం ఈ నాటక రంగ సేవా జీవితమే కదా!

మధుసూదన రావు కు చిత్రపరిశ్రమలో ఏర్పడిన పరిచయాల ఫలితంగా తన సహజ సిద్ధమైన పరిశీలనాత్మక దృష్టివల్ల చిత్ర నిర్మాణం పట్ల సమగ్రమైన అవగాహన ఏర్పడింది. దానికి తోడు గూడవల్లి రామబ్రహ్మం గారి వంటి గొప్ప దర్శకుడి నుండి వచ్చిన పిలుపు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తూ రెచ్చ గొట్టనారంభించింది.

ఏ నాటకాల పిచ్చిలో పడి తిరుగుతున్నాడని దెప్పిపొడిచారో ఆ నాటకరంగం ద్వారా సంప్రాప్తించిన అనుభవాలు పరిచయాలే పెట్టుబడిగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.

అంతే!
మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు కార్యరూపం దాల్చటం మొదలుపెట్టాయి.
(సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 5న చదవండి)
-ప్రభు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here