నాటక కళా పరిషత్తుకు నవజీవనం – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 12, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 12

(రీ క్యాప్)
( ఉత్తర ప్రత్యుత్తరాలలోనే ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు రామబ్రహ్మం గారు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఇందుపల్లి లో తన మామగారు చనిపోతే కర్మకాండకు వచ్చారాయన. వెళ్లి కలిశారు మధుసూదనరావు)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

మరలా అదే సమాధానం.
” సన్మానం చేసేవారిని చేయించుకునే వారిని బట్టి ఇది మనకు మనం చేసుకుంటున్న సన్మానం అంటారు” అన్నది ఆయన సందేహం.

” మీరు మాకు మిత్రులనో , సన్నిహితులనో ఈ సన్మానం చేయటం లేదు. అయినా ఇది మీకు చేస్తున్న సన్మానం కాదు. మాలపిల్ల, రైతు బిడ్డ వంటి అభ్యుదయ చిత్రాల దర్శకుడికి చేస్తున్న సన్మానం.. దయచేసి కాదనకండి” అని చెప్పి కన్విన్స్ చేయడంలో కృతకృత్యులయ్యారు మధుసూదన రావు.

గుడివాడ పరిషత్తు మహాసభలు దిగ్విజయంగా, దేదీప్యమానంగా జరిగాయి. సన్మానితులుగా , బహుమతి ప్రధాతలుగా రామబ్రహ్మం , భానుమతి గార్ల రాకతో పరిషత్ సభలకు గొప్ప పేరు వచ్చింది.

ఆఖరు రోజున జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మార్ అప్పారావు గారు గూడవల్లి రామబ్రహ్మం గారిని 500 రూపాయల డొనేషన్ కట్టి పరిషత్ పోషకులుగా చేరవలసిందిగా కోరారు.

దానికాయన పోషకుడు డేం ఖర్మ… రాజ పోషకుడుగానే చేరతానని ప్రకటించి వెంటనే 1,116 లు కట్టారాయన. ఇది చూసి స్పందించిన భానుమతి గారు రోలింగ్ షీల్డ్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పరిషత్తు పోటీ నాటకాల్లో బెస్ట్ హీరోయిన్ కు ఒక వెండి కప్పును కూడా బహూకరిస్తానని ప్రకటించారు.ఈ విధంగా 1945 మహాసభలతో ప్రారంభమైంది సినీ నాటక రంగాల సాన్నిహిత్యం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవటం. ఆ తరువాత సంవత్సరం నుండి అక్కినేని నాగేశ్వరరావు బెస్ట్ మేల్ ఆర్టిస్ట్ కు, రేలంగి వెంకట్రామయ్య బెస్ట్ కమెడియన్ కు , సావిత్రి బెస్ట్ లేడీ ఆర్టిస్ట్ కు బహుమతులను అందజేయడం ఆనవాయితీ అయింది.

ఆ విధంగా1945 గుడివాడ పరిషత్తు మహాసభల్లో పాల్గొని సన్మానితులై , రాజ పోషకులై మద్రాస్ కు తిరుగు ప్రయాణం అయ్యారు రామబ్రహ్మం గారు.

అప్పటికాయన “పల్నాటి యుద్ధం” నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు. చిత్రంలో నటీనటులకు వాడవలసిన కాస్ట్యూమ్స్ మొత్తం జవహర్ ఖాదీ బాండార్లోనే కొనుగోలు చేశారు.

పాత్రలకు, వాటి ప్రాముఖ్యతలకు, సహజత్వానికి తగినట్లుగా ముతక ఖద్దరు, కోరా ఖద్దరులతో పాటు అన్ని రకాల ఖద్దరు వస్త్రాలు కొనుగోలు చేసి జవహర్ ఖాదీ భాండారును ఖాళీ చేశారాయన. వెళ్తూ వెళ్తూ పల్నాటి యుద్ధానికి చెందిన ఎలాంటి రిఫరెన్స్ బుక్స్ దొరికినా వెంటనే పంపించవలసినదిగా మధుసూదన రావును కోరారు.

పల్నాటి యుద్ధంలో నాగేశ్వరరావు బాలచంద్రుడు పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్పారాయన. మాంచాల పాత్రకు కొత్త నటి కోసం ప్రయత్నిస్తున్నానని మంచి అందమైన అమ్మాయి దొరకకపోతే భానుమతి గారిని మాంచాలగా తీసుకుంటానని చెప్పారు.కొన్నాళ్ళ తరువాత మధుసూదన రావు నెల రోజుల పాటు మద్రాసులో మకాం వేయవలసి వచ్చింది. తన సమీప బంధువు ఒకాయనకు క్యాన్సర్ వ్యాధి వస్తే ట్రీట్మెంట్ ఇప్పించటం కోసం మద్రాసు వెళ్లారు మధుసూదన రావు.
అప్పటికి పల్నాటి యుద్ధం కథా చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాటిల్లో మధుసూదనరావు సలహాలకు, సూచనలకు విలువ పెరిగింది.

ఆ చిత్రానికి సంభాషణల రచయిత సముద్రాల రాఘవాచార్యులు గారు.
ఒకనాటి చర్చల్లో యుద్ధభూమికి వెళుతున్నప్పుడు మాంచాల వీడ్కోలు చెప్పే సన్నివేశం పై చర్చ జరుగుతుంది.
ఒరిజినల్ ప్రింటెడ్ బుక్ లో ఈ సందర్భంలో ఒక ద్విపద వుంది.

” మానవ నైజంబు మానలేనైతినే మన్నించవే నన్ను మగువ మాంచాల” అంటూ సాగింది ఆ ద్విపద.
తరవాత వాక్యాలలో కొత్తగా పెళ్లి చేసుకుని నిన్ను విడిచి యుద్ధభూమికి వెళ్ళలేకపోతున్నాను. మానవ నైజానికి బానిస అవుతున్నాను… నన్ను మన్నించవే మాంచాల అనే అర్థం వచ్చేలా ఉంది ఆ ద్విపద.

ఇది మధుసూదనరావుకు నచ్చలేదు. ఒకవైపు రణభేరి కర్ణపేయంగా వినిపిస్తుంటే బాలచంద్రుడు అంతటి మహావీరుడు ఇలా బేలగా మాట్లాడటం ఆ పాత్ర నైజానికి దెబ్బ. కాబట్టి దాన్ని మార్చితే మంచిదని సూచించారు మధుసూదన రావు.
ఈ సూచన రామబ్రహ్మం గారికి బాగా నచ్చింది.

అయితే“అది మనం రాసింది కాదు… ఒరిజినల్ లోనే ఉంది కదా” అన్నారు సముద్రాల వారు.
ఒరిజినల్ లో ఉన్నంత మాత్రాన పాత్ర ఔచిత్యం దెబ్బ తినకూడదు కదా అన్నది మధుసూదనరావు వాదన.
‘అయితే ఎలా రాద్దాం అంటావు’- అన్నారు సముద్రాల వారు.

కొదమ సింహంలా కదనరంగానికి ఉరుకుతూ వీర పత్రి అభినందనలు అందుకునే సందర్భంలో శౌర్యం, ధైర్యం ఉట్టిపడేలా రాస్తే బాగుంటుందని సూచించారు మధుసూదన రావు. సముద్రాల వారికి కూడా నచ్చింది ఈ సూచన. సందర్భోచితంగా ఒరిజినల్ ద్విపదను మార్చి రాశారాయన. సవరించిన ద్విపద ఇలా సాగుతుంది.

” సురకోటి కొనియాడ
అరులు వెన్కాడ
బాలనాయక శౌర్య
పటిమ చూపింతు
నాగమ్మ తల గొట్టి
నలగాము బట్టి
నీ మాట రణసీమ
నిక్కమ్ము సేతు
దీవించి పంపవే
దేవి మాంచాల”

ఇలా బాలచంద్రుడు శౌర్యపరాక్రమాలు అక్షర లక్షల్లో ఆవిష్కరించినట్లుగా వచ్చింది ఆ ద్విపద. రామబ్రహ్మంగారు మెచ్చుకోలుగా చూశారు. సముద్రాల వారు సంతుష్టులయ్యారు. ఒరిజినల్ ద్విపదకు కట్టిన ట్యూన్ ను కూడా ఈ మార్పుకు అనుగుణంగా మార్చారు సంగీత దర్శకుడు గాలిపెంచల నరసింహారావు .

ఇదే కాదు ఇంకా అనేక సందర్భాలలో మధుసూధనరావు సూచనల్లోని ఆంతర్యం, అంతరార్థం, ముందుచూపు, విమర్శనా దృష్టి రామబ్రహ్మం గారికి విపరీతంగా నచ్చేవి.

ఆయన్ను చేరదీసి తన దగ్గర అసోసియేట్ గా పెట్టుకుంటే బాగుంటుందనే తలపు ఆయన మనసులో మెదిలింది.
తన మనసులోని అభిప్రాయాన్ని మధుసూదనరావు మేనమామ అయిన పోలవరపు నాగేశ్వరరావు గారి దగ్గర వెలిబుచ్చారాయన.

” నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. మధుసూదన రావు లాంటి చురుకైన వ్యక్తి నాకు అవసరం. అతనికి చక్కగా ట్రైనింగ్ ఇస్తాను. నా దగ్గర చేరటానికి ఒప్పించమని కోరారు రామ బ్రహ్మంగారు.

” ఆయనకు నీ పట్ల అభిమానం ఉంది. నీవంటే గురి, నమ్మకం ఉన్నాయి. నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన దగ్గర అసోసియేట్ గా చేర రాదా..” యధాలాపంగా కదిలించి చూశాడు మేనమామ.

” వద్దులే.. ఆయన అసలే ముక్కోపి.. దూరంగా ఉంటేనే అభిమానాలు, గౌరవాలు నిలబడతాయి”- ఇది మధుసూదనరావు సమాధానం.

కొద్దిరోజులకు పల్నాటి యుద్ధం షూటింగ్ ప్రారంభమైంది.నాగేశ్వరరావు బాలచంద్రుడుగా, ఎస్.వరలక్ష్మి మాంచాలగా, గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడుగా, కన్నాంబ నాయకురాలు నాగమ్మగా ఎంపికయ్యారు. నలగామరాజు, అలరాజు వేషాలకు గుడివాడ స్టేజి నటులు శ్రీవత్స వెంకటేశ్వరరావును, కోనేరు కుటుంబరావును మధుసూదనరావు సూచన మేరకు తీసుకున్నారు రామబ్రహ్మం గారు.

తొలుత మాంచాల సెట్ వర్క్ పూర్తయింది. నాగేశ్వరరావు బాలచంద్రుడుగా చాలా బాగా నటించాడు. తన పాటలు తానే పాడుకున్నాడు.

తొలి సెట్ వర్క్ పూర్తయి రెండవ షెడ్యూల్ కు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఒక అనుకోని అవాంతరం ఎదురయింది.

ఇప్పుడేం చేయాలి…!?
(సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 3వ తేదీన చదవండి)
– ప్రభు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here