నేను యాక్టర్ ను… నాకు విలన్ అని టాగ్ తగిలించకండి.. ప్లీజ్!- జగపతిబాబు

Jagapathi Babu Interview, Jagapathi Babu Says I’m an Actor Not a Villain,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Jagapathi Babu Movies Latest Updates,Actor Jagapathi Babu Latest Interview News,Actor Jagapathi Babu Says I’m an Actor,Jagapathi Babu Next Movie Details
Jagapathi Babu Says I’m an Actor Not a Villain

హీరోగా రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు క్యారెక్టర్ యాక్టర్ గా టర్న్ తీసుకున్న తరువాత మరింత ఉద్ధృతంగా తన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మన హీరోలకు సరితూగగల విలన్స్ కావాలి అంటే పొరుగు రాష్ట్రాల నుండి భాష రాని యాక్టర్లను తెచ్చుకుని ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా మన జగపతిబాబు ఒక విలక్షణ, విశిష్ట నటుడిగా ఎదగటం మనందరం స్వాగతించవలసిన విశేషం. లెజెండ్ చిత్రం నుండి ప్రతినాయక పాత్రలకు వెల్కమ్ చెబుతున్న జగపతిబాబు 2018లో రంగస్థలం, గూఢచారి, అరవింద సమేత వీర రాఘవ చిత్రాలలో ప్రతినాయక పాత్రలను అద్భుతంగా పోషించి నటుడిగా తన రేంజిని విశేషంగా పెంచుకున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన అరవింద సమేత వీర రాఘవ లో జగపతిబాబు పోషించిన బసిరెడ్డి పాత్ర జగపతి బాబుకు గొప్పపేరు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పాత్ర గురించి, ఆ సినిమాలో నటించడం గురించి తన అనుభవాలను షేర్ చేసుకోవడం కోసం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు జగపతి బాబు. ఆ విశేషాలు….

ఇదొక గొప్ప పాత్ర.. గొప్ప అనుభవం:

అరవింద సమేత వీర రాఘవ లో నేను చేసిన బసిరెడ్డి పాత్రకు మంచి పేరు వస్తుందని అనుకున్నాను గాని అన్ని వర్గాల నుండి ఇంత మంచి అప్లాజ్ వస్తుందని ఊహించలేదు. ఆ క్రెడిట్ ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో ఎన్టీఆర్ లకు దక్కుతుంది. అలాగే ఇందులో నటించిన నటీనటులు అందరం ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ నటించారు. సాధారణంగా చాలా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుందో మనకు తెలియదు… చెప్పరు.. నేను కూడా నా పాత్ర వరకు చేసేసి పక్కకు వస్తాను. కనీసం మానిటర్ లోకి తొంగి కూడా చూడను. కానీ అరవింద సమేత లో అందరం ఒకరి పాత్ర గురించి ఒకరు డిస్కస్ చేసుకుంటూ ఒక అండర్స్టాండింగ్ తో చేసాం. అందుకే పెద్దా చిన్నా తేడా లేకుండా ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. షేరింగ్ విషయంలో ఇది ఓపెన్ ఫిలిం కాబట్టే రిజల్ట్ కూడా అంత బాగా వచ్చింది.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే తన పాత్ర గురించి తను ఎంత శ్రద్ధ తీసుకున్నాడో నా పాత్ర గురించి కూడా అంత శ్రద్ధ తీసుకున్నాడు. బసిరెడ్డి పాత్ర లేకపోతే ఈ సినిమా లేదు.. అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్ద హీరో విలన్ క్యారెక్టర్ ను అంత హైలెట్ చేసి మాట్లాడటం చాల గొప్ప విషయం. నాకు నా అభిమాని ఒకరు చెప్పారు.. “సినిమాలో ఇతర క్యారెక్టర్స్ డామినేటింగ్ గా అనిపిస్తే చాలా మంది హీరోలు కట్ చేయటానికి ప్రయత్నిస్తారు… కానీ ఎన్టీఆర్ గారు మీ కేరెక్టర్ ను ఇంత గొప్పగా హైలెట్ చేయడం మా ఫాన్స్ అందరికీ బాగా నచ్చింది”… అని చెప్పాడు… అది 100% నిజం. బసిరెడ్డి పాత్ర ను కెమెరా ముందు చేసినప్పటి కంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా కష్టపడ్డాం. “కూత లేత గా ఉంది.. నారపరెడ్డి కొడుకా..” అన్న డైలాగ్ వరకే మామూలు గొంతుతో చెబుతాను. తరువాత గొంతులోకి కత్తి పోటు దిగిన తర్వాత పాత్ర వాయిస్ మారిపోతుంది. జీర గొంతుతో డబ్బింగ్ చెప్పాలి. చాలా కష్టపడవలసి వచ్చింది. అయితే ఆ విషయంలో డబ్బింగ్ ఇంజనీర్ పప్పు, రాయలసీమ డిక్షన్ కోచ్ పెంచల దాస్ గారు, కో- డైరెక్టర్ ఆనంద్ లకు నేను స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను.

జనరల్ గా నాకు పోష్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం:

“ఒకప్పుడు ఫ్యామిలీ హీరో క్యారెక్టర్స్ చేసిన మీరు ఇప్పుడు విలన్ గా ఇంత మోటుదేలటం ఎలా అనిపిస్తుంది”- అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ” ముందు ఆ “విలన్” అన్న టాగ్ తీసేయండి ప్లీజ్. నేను యాక్టర్ ను .. కేవలం విలన్ పాత్రలే కాదు పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను కదా! జనరల్ గా నాకూ నా బాడీ లాంగ్వేజ్ కి నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, గూఢచారి లాంటి పోష్ క్యారెక్టర్స్ బాగుంటాయి. అయితే రంగస్థలంలో ప్రెసిడెంటు, అరవింద సమేత లో… బసిరెడ్డి వంటి పాత్రలు కూడా క్లిక్ అవ్వటం హ్యాపీ గా ఉంది. ఇంతకంటే నేను బాగా చేయగలనని అనుకోవటం లేదు. ఇంత చేశాక వాట్ నెక్స్ట్ అనుకుంటే అంత డెప్త్ ఉన్న పాత్రలు రావాలి కదా. ఒక సత్తా ఉన్న పాత్ర దొరికినప్పుడే నటుడి లో సత్తా ఎంత అనేది బయటపడుతుంది. ఈ సంవత్సరం రంగస్థలం, గూడచారి, అరవింద సమేత చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ మోస్ట్ క్రూయల్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి అర్జెంటుగా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలి అనిపిస్తుంది.

మన హీరోలకు దీటైన విలన్స్ కావాలంటే బాలీవుడ్ కో, మన పొరుగు రాష్ట్రాలకో వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు విలన్ గా బాగా క్లిక్ అయ్యారు. ఆ పరాయి విలన్స్ కు మిమ్మల్ని మంచి ఆల్టర్నేటివ్ గా అనుకోవచ్చా..? అన్న ప్రశ్నకు (నవ్వుతూ..)

మీరు అనుకోండి… నేను అనుకోకూడదు. ఇక్కడ ఎవరికి ఎవరు ఆల్టర్నేటివ్ కాదు. నేను హీరోగా చేసినప్పుడు I was a small fish in a big pot…now I am a big fish in a small pot . నిజానికి సోనూసూద్, ప్రకాష్ రాజ్, నానా పటేకర్ లాంటి యాక్టర్లకు ఆల్టర్నేటివ్ ఉందని చెప్పగలమా? కాబట్టి నాకు వచ్చిన పాత్రలకు నేను ఎంతవరకు న్యాయం చేశాను అని ఆలోచించుకోవాలి తప్ప ఎవరికో ఆల్టర్నేటివ్ ను అనుకోకూడదు. అయితే యాక్టింగ్ అనేది ఎంత చేసినా, ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఒకసారి నేను రామ్ గోపాల్ వర్మ ను నేను యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి ?.. బాలీవుడ్ వెళ్లాలా ? ఎవరైనా మంచి కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అని అడిగాను.. అప్పుడు వర్మ ఇచ్చిన సజెషన్ నాకు బాగా నచ్చింది. “ఎక్కడికీ వెళ్లదు, ఎవరిని అడగొద్దు… సినిమాలు విపరీతంగా చూడు”.. అని సలహా ఇచ్చారు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలన్నీ వరుస పెట్టి చూస్తుంటాను. ప్రకాష్ రాజ్ గారు ఉన్న సినిమాలను ఆయన క్యారెక్టర్ ఉన్నంత వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూస్తుంటాను. ఇంకా యాక్టింగ్ నేర్చుకోవాలి అని చెప్పటంలో modesty ఏమీ లేదు.. నేను modesty కోసం మాట్లాడనని మీకు తెలుసు. యాక్టింగ్ అనేది నా దృష్టిలో ever learning process… అందుకే అలా చెప్పాను .

హీరో పాత్రల నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అవుతున్నప్పుడు మీరు పడిన మానసిక సంఘర్షణ గురించి చెప్పండి అని అడగ్గా

చాలా మధన పడ్డాను… లెజెండ్ సినిమా ఒప్పుకొని చేస్తున్నప్పుడు రాత్రి రెండు మూడు దాకా నిద్ర పట్టక ఏమిటి..? ఎందుకు ఇలా మారిపోయాను అని బోరున ఏడ్చిన రోజులున్నాయి.. కానీ పొద్దున్నే లేచి షూటింగ్ కు వెళ్లాలి.. నా ఫ్రెండ్స్ కొందరు నోరు మూసుకుని నీ క్యారెక్టర్ నువు చేసి రా అని చెప్పేవారు. విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అని తెలిసినప్పుడు చిరంజీవి గారు “గుడ్ అండ్ ఇంటలిజెంట్ డిసిషన్”… అన్నారు. ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అలా అన్నారు తప్ప అందులో ఇంటలిజెంట్ డిసెషన్ ఏముంది? వేరే ఆల్టర్నేటివ్ లేక తీసుకున్న నిర్ణయం అది. అందుకే చాలా బాధ పడేవాడిని. కానీ ఇప్పుడు సెటిల్ అయ్యాను… హ్యాపీగా ఉన్నాను… ఇక ఇప్పుడు కూడా హ్యాపీ కాదు అంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పట్టుకుని బాదేస్తారు. నిజంగా హ్యాపీగా ఉన్నాను.

హీరోగా ఎక్కువ సంపాదించారా ?.. విలన్ గా ఎక్కువ సంపాదిస్తున్నారా ? అన్న ప్రశ్నకు

హీరోగా బాగా సంపాదించాను… బాగా ఖర్చు పెట్టాను… విలన్ గా బాగా సంపాదిస్తున్నాను… ఖర్చు పెడుతున్నాను… దాచుకుంటున్నాను కూడా …

ఇక చివరిగా అరవింద సమేత వీర రాఘవ గురించి చెప్పాలి అంటే… ఈ సినిమాలో చేయటం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇచ్చిన కోఆపరేషన్ ఎప్పటికీ మరువలేను. ఇందులో నేను పోషించిన బసిరెడ్డి పాత్ర కు అంత మంచి పేరు రావటానికి ఎన్టీఆర్ ఒక ముఖ్య కారణం. మన పాత్రలకంటే మన సినిమా పెద్దది- గొప్పది. సినిమా ముందు ఎవరిమైనా చిన్న వాళ్ళమే..
అంటాడు ఎన్టీఆర్. అంత ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ సినిమాకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి నాకు చాలా ముచ్చటేసింది. మొత్తం మీద అరవింద సమేత వీర రాఘవ ఇంత ఘన విజయాన్ని సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది” – అంటూ మీడియా ఇంటరాక్షన్ కు ముగింపు పలికారు సినిమా సినిమాకు యాక్టర్ గా రాటు తేలుతున్న జగపతిబాబు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here