అప్పుడు ఆ కుర్రాడి పేరు అక్కినేని నాగేశ్వరరావు – ఇప్పుడు…!? – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 5, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna - First Daily Web Article Series - Part 5

(రీ – క్యాప్)
(పెండ్యాల నాగేశ్వరరావు మదిలో చప్పున చప్పున ఓ కుర్రాడు మెదిలాడు. ఆ కుర్రాడు గుడివాడలో బుద్ధిరాజు శ్రీరామమూర్తి గారు ఆడిస్తున్న విప్రనారాయణ నాటకంలో దేవదేవి పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడట. ‘మనం ఒక రోజు ఆ ప్రదర్శనకు వెళ్దాం’- ప్రపోజ్ చేశారు పెండ్యాల నాగేశ్వరరావు. ఆడ పాత్రను అంత అద్భుతంగా అభినయిస్తున్న ఆ కుర్రాడు ఎవరు? ఏమిటతని కథ ? )

(గత ఎపిసోడ్ తరువాయి భాగం)

ఎక్సెల్షియర్ క్లబ్ డ్రమెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి అచ్చయ్య, కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు, సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావులు “దేవదేవి”ని చూడటానికి బయలుదేరారు.

బుద్ధిరాజు శ్రీరామమూర్తి రిహార్సల్స్ చేయిస్తున్న చోటికి వెళ్ళారు. అప్పుడే ఏదో డైలాగు చెప్పి ఒకపక్కన కూర్చున్నాడు దేవదేవి కుర్రాడు. ఆ కుర్రాన్ని నిశితంగా పరిశీలించారు దుక్కిపాటి మధుసూదనరావు. అతనిలో ఏదో మెరుపు, ఇంకేదో అసమాన ప్రజ్ఞా గోచరించాయి. రిహార్సల్స్ పూర్తయ్యే దాకా అక్కడే కూర్చుని చూశారు.

ఆ మరుసటి రోజున ప్రదర్శనకు వెళ్లారు. దేవదేవి పాత్రకు ప్రేక్షకుల నుండి వస్తున్న ప్రతిస్పందనను ఒక కంట గమనిస్తున్నారు. అతని నటన అద్భుతం అనిపించింది. రిహార్సల్స్ చూసినప్పుడే అతన్ని తమ సమాజానికి తీసుకు వెళ్ళటానికి నిర్ణయించుకోవటంతో అతన్ని ఆకర్షించడం కోసం ముందుగానే కొని ఉంచిన ఒక వెండి కప్పును వేదిక మీద బహుకరించారు మధుసూదనరావు.

అంతమందిలో తనకొక్కడికే బహుమతి లభించటంతో ఆ కుర్రాడి కళ్ళలో ఆనందం మెరిసింది. అది ఇచ్చిన వారి పట్ల గౌరవం, కృతజ్ఞతా భావం కలిగాయి.

మరుసటి రోజున సంప్రదింపులకు వెళ్లారు. ఆ కుర్రాడి అన్నయ్య రామబ్రహ్మం గారి తో మాట్లాడారు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ తామే భరించి అన్ని ఖర్చులు పోను ఒక్కొక్క ప్రదర్శనకు ఎనిమిది రూపాయలు ఇస్తామన్నారు.
వెంటనే ఇద్దరూ అంగీకరించారు. అంగీకరింపచేసినది మాత్రం 8 రూపాయల పారితోషికం కాదు. పిలిచిన వ్యక్తులు బాధ్యతాయుతులైన వాళ్లు కావటమే ఆ అంగీకారానికి కారణం.

బయలుదేరేముందు రామబ్రహ్మం గారు మధుసూదనరావును పక్కకు పిలిచారు.
ఏదో అవ్యక్తమైన బాధతో ఆయన హృదయం బరువెక్కింది.
“చిన్న కుర్రాడు.. మీ చేతుల్లో పెడుతున్నాను.. ఇకనుండి మీరే వాడికి అన్నయ్య” –
ఆ కుర్రాడి బాధ్యతను స్వీకరిస్తున్నట్లుగా భరోసాగా, అభిమానంగా రామబ్రహ్మంగారి చెయ్యి నొక్కారు మధుసూదన రావు.

మధుసూదనరావు వెంట నడిచాడు ఆ కుర్రాడు….
ఒక అన్న వెంట తమ్ముడి లాగా,
ఒక గురువు వెంట శిష్యుడు లాగా,
ఒక విమర్శకుడి వెంట కళాకారుడి లాగా నడిచాడు ఆ కుర్రాడు.

ఆ నడక ఒక సుదీర్ఘ ప్రయాణం లాగా
ఆ నడక ఒక గొప్ప అనుబంధం లాగా
ఆ నడక ఒక పవిత్ర స్నేహం లాగా
ఆ నడక ఒక అద్భుత సంగమం లాగా
ఆ నడక ఒక నిరంతర, నిర్విరామ,నిరాఘాట నదీ ప్రవాహం లాగా సాగింది.

అప్పుడు ఆ కుర్రాడి పేరు
అక్కినేని నాగేశ్వరరావు…

ఇప్పుడు ఆ మహామహుడి పేరు
జగద్విదితం.

అందరూ ముదినేపల్లి చేరుకున్నారు.
ఎక్సెల్షియర్ సమాజానికి ఒక కొత్త హీరోయిన్ వచ్చింది.
నాటక సమాజానికి కొత్త కళ వచ్చింది. “ఆశాజ్యోతి” నాటకంలో “స్నేహలత” పాత్రకు జ్జీవం వచ్చింది.
కొత్త హీరోయిన్ను అందరూ ముద్దుగా చూసుకున్నారు.

సమాజం మొత్తానికి నటన విషయంలో కోడూరి అచ్చయ్య గారు సారథ్యం వహించి నటించి చూపేవారు.
డైలాగుల విషయంలో దైతా గోపాలం గారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ రోజుల్లో ప్రసిద్ధి పొందిన తుంగల చలపతిరావు సక్కుబాయి పాత్రను గొప్పగా పోషిస్తుండగా ఆయనకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిగా దైతా గోపాలం గారికి గొప్ప పేరు వచ్చింది. ఆ కారణంగానే నాగేశ్వరరావుకు ఆయనతో శిక్షణ ఇప్పించారు. ఇక మొత్తం నాటకం తీరుతెన్నులను నిగ్గుతేల్చి సమగ్ర విమర్శన చేసి సరైన మార్గాన్ని నిర్దేశించే బాధ్యత మధుసూదన రావుది.

సమాజం అన్ని విధాల తర్ఫీదు పొందిన పిదప కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టారు మధుసూదనరావు.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనకు ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉండేవి.
స్టేజి ముందు కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం ఆ తరువాత తెర వెనుక నుండి పరబ్రహ్మ- పరంజ్యోతి అంటూ బృందగీతం ఆలపించటం- ఇలాంటి తంతులన్నీ పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు నీరసం ముంచుకొచ్చేది. అది గమనించిన మధుసూదన రావు అధ్యక్షుడు కోడూరి అచ్చయ్య తదితర పెద్దలను సంప్రదించి పాత పద్ధతులను మార్పించారు.

‘పరబ్రహ్మ- పరంజ్యోతి’ కి బదులుగా సూరపనేని శోభన రావు అనే రచయిత తో ఒక చక్కని ప్రార్థనా గీతం రాయించి పెండ్యాల నాగేశ్వరరావుతో మంచి ట్యూన్ కట్టించారు.

” నాట్య కళారాధనము
శోభనము, పావనము!
ఆనందాబ్దికి అనుపమ హేతువు
కళా తేజము సువిరాజితము
సంఘ దుష్పధము కనులకు జూపి
సత్ పధమేదో చక్కగా తెలిపే
ఆదర్శంబుల నారాధించే
ఎక్సెల్షియర్ నాట్య మండలికి
నాట్య కళారాధనము
శోభనము పావనము”

ఇదీ ప్రార్థనా గీతం.

ఒకేసారి 7 వాయిద్యాలతో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరచిన మెలోడియస్ ట్యూన్ తో ఈ ప్రారంభ గీతం ఆకట్టుకోవడంతో ప్రదర్శనను తిలకించడానికి ప్రేక్షకులు మానసికంగా సంసిద్ధులయ్యేవారు. కొబ్బరి కాయలు, హారతులకు బదులుగా ప్రదర్శనకు ముందు ఒక దోసెడు పువ్వులను ప్రేక్షకుల పైకి వెదజల్లే వారు.
అలా పాత ఫార్మాలిటీస్ కు స్వస్తి చెప్పి సరికొత్త రీతిలో ప్రారంభమైన “ఆశాజ్యోతి” తొలి ప్రదర్శన హిట్టయింది. ఆశాలత పాత్రను అద్భుతంగా పోషించిన నాగేశ్వరరావు పై ప్రశంసల వర్షం కురిసింది. ప్రదర్శన చూసిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు నాగేశ్వరరావుకు “స్వీట్ నైటింగేల్” అని బిరుదు ఇచ్చారు.

అలా ఆశాజ్యోతి నాటకానికి విశేష ప్రాచుర్యం, ప్రజాదరణ లభించటంతో చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వవలసి వచ్చేది. అందుకోసం సమాజం ఆఫీసును ముదినేపల్లి నుండి గుడివాడకు తరలించారు. నాగేశ్వరరావు తన తల్లి గారిని గుడివాడకు తీసుకువచ్చారు.

” నేను చెప్పాలా.. మనవాడు తప్పకుండా పైకి వస్తాడని”.. అంటూ బ్రహ్మానంద పడిపోయారు రామబ్రహ్మం గారు.
అక్కినేని నాగేశ్వరరావుకు, అతని వల్ల ఎక్సెల్షియర్ సమాజానికి గొప్ప పేరు వచ్చింది.
ఈ పరిస్థితుల్లో సమాజానికి ఒక సమస్య వచ్చింది.

( సశేషం)

(ఈ సీరియల్ తరువాయి భాగాన్ని ఎల్లుండి అక్టోబర్ 20 న చదవండి)

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here