క్లాస్ మాస్ ల యాక్షన్ క్లాసిక్ అరవింద సమేత వీర రాఘవ

Aravindha Sametha Movie Plus Points, Aravindha Sametha Movie Public Talk, Aravindha Sametha Movie Review, Aravindha Sametha Movie Story, Aravindha Sametha Review, Aravindha Sametha Telugu Movie Live Updates, Aravindha Sametha Telugu Movie Public Response, Aravindha Sametha Telugu Movie Review, Aravindha Sametha Telugu Movie Review & Rating, Latest Telugu Movie Review, Latest Telugu Movies News, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Aravindha Sametha Movie Review

ఫ్యాక్షనిజం నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి… విజయవంతమయ్యాయి. ఆ సినిమాలన్నీ ఫ్యాక్షనిజం తాలూకు దుష్పరిణామాలను కళ్లకు కట్టాయి. హింస – ప్రతి హింసల పరిణామాల నేపథ్యంలో చితికిపోయిన జీవితాల యదార్ధ,వ్యధార్ధ గాథలను గత చిత్రాలు కూడా గొప్పగా ఆవిష్కరించాయి. ఇలా ఎన్నోసార్లు చూపబడిన, చెప్పబడిన ఫ్యాక్షనిజం నేపథ్యంలో మరో భారీ ఏక్షన్ సినిమా వస్తుంది అంటే ఇక ఆ జోనర్లో చెప్పటానికి, చూపటానికి ఏం మిగిలింది అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. ఇలాంటి మీమాంస దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హీరో ఎన్టీఆర్ కు వచ్చి ఉంటే “అరవింద సమేత వీర రాఘవ” అనే సినిమా ఉండేది కాదు. ఎన్ని సార్లు చెప్పబడినప్పటికీ అనావిష్కృత కోణం ఒకటి మిగిలే ఉంటుంది కాబట్టి ఆ అన్-టచ్డ్ యాంగిల్ ను స్పృశించే ప్రయత్నమే ఈ “అరవింద సమేత వీర రాఘవ”.

కత్తులకు కత్తులు- హింసకు హింస, రక్తానికి రక్తం అనే ఆటవిక , హింసాత్మక విధానాలకు స్వస్తి చెప్పి మాటల ద్వారా, మాట్లాడుకోవటం ద్వారా హింసకు చరమగీతం పాడాలి అన్న లక్ష్యంతో ముందుకు నడిచే వీర రాఘవ రెడ్డి,అందుకు ప్రేరణగా నిలిచిన అరవిందల కథ ఇది. ఈ కథను తనదైన పదవిన్యాసంతో, దర్శకత్వ చాతుర్యంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత ఆహ్లాదంగా, అర్థవంతంగా తెరకెక్కించారో చూద్దాం.

కథ:

నారపరెడ్డి( నాగబాబు)- బసిరెడ్డి( జగపతిబాబు) రెండు ఊర్లు- ఇద్దరు ప్రత్యర్థులు- రెండు ముఠాలు- తరతరాల పగలు ప్రతీకారాలు. పేకాట లో 5 రూపాయల కోసం పెరిగిన మాట మాట ఇరు గ్రామాల మధ్య చిచ్చు గా మారుతుంది. వాళ్లని వీళ్లు వీళ్ళను వాళ్లు నరుక్కుంటూ సంవత్సరాలు గడిచిపోతాయి. చదువు ముగించుకుని సొంత ఊరుకు తిరిగి వస్తున్న కొడుకు వీర రాఘవ రెడ్డి( ఎన్టీఆర్)ని రిసీవ్ చేసుకుని ఊర్లోకి వస్తున్న నారపరెడ్డి మీద ఎటాక్ చేస్తాడు బసిరెడ్డి. ఆ ఎటాక్ లో కళ్ళముందే కన్నతండ్రిని పోగొట్టుకుంటాడు వీర రాఘవ రెడ్డి. రాక్షసుల్లా దూసుకొస్తున్న మూకల మీదకి లంఘించి నరికి పడేస్తాడు.

ఆ దారుణ మారణకాండలో రెండు పక్షాలకు చెందిన మనుషులు అత్యంత దారుణంగా చంపబడతారు. ఆ హింసాకాండను చూసి వీర రాఘవ రెడ్డి చలించిపోతాడు. తన తల్లి, పిన్ని, నాన్నమ్మ ఇంకా ఊర్లోని ఆడవాళ్లు చాలామంది విధవలుగా మారటానికి కారణమైన హింస- ప్రతి హింసలకు ముగింపు పలకటం కోసం వీర రాఘవ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏమిటి? దాని పర్యవసానాలు ఏమిటి? ఆ మహత్తర లక్ష్యాన్ని అతను ఎలా సాధించాడు-
ఇదే మిగిలిన కథ.

దర్శకత్వం:

నేరం , హింస, ప్రతి హింస, దౌర్జన్యం, దోపిడి, రౌడీజo… ఇలాంటి నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నింటికీ ముగింపు నెగిటివ్ గానే ఉంటుంది. కానీ శక్తివంతమైన “ఒక్కమాట” ఆ ముగింపును పాజిటివ్ గా మార్చగలుగుతుంది అనే గొప్ప పాజిటివ్ థింకింగ్ ను ఫ్యాక్షనిజం మీద అప్లై చేసి గొప్ప మోరల్ సక్సెస్ సాధించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకవైపు ఎన్టీఆర్ అనే ఒక పవర్ ఫుల్ మాస్ ఐడాల్ నుండి ఆశించే యాక్షన్ పార్ట్ ను, మరోవైపు తనలాంటి సెన్సిబిల్ రైటర్- డైరెక్టర్ నుండి ఆశించే వెర్బల్ మెస్మరిజంను చక్కగా మిళితం చేసి ఒక మంచి యాక్షన్ క్లాసిక్ ను అందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
గతంలో వచ్చిన యాక్షన్ చిత్రాలకు ఈ అరవింద సమేత వీర రాఘవ కు ఉన్న గొప్ప వ్యత్యాసం ఏంటంటే… అవి రాయలసీమ నేపథ్యంలో తీసినవే అయినప్పటికీ ఫ్యాక్షనిజాన్ని సినిమాకు వాడుకున్నారు తప్ప రాయలసీమ నేటివిటీని, అక్కడి భాషలోని యాసలోని సొగసును సహజ సౌందర్యాన్ని ఎవరు టచ్ చేయలేదు. కానీ ఇందులో ఎన్టీఆర్ పోషించిన వీర రాఘవ రెడ్డి పాత్ర మొదలుకొని అన్ని పాత్రలు రాయలసీమ యాసలోనే మాట్లాడుతూ మట్టివాసనను, అక్కడి జీవన విధానాన్ని చాలా సహజంగా ఆవిష్కరించారు. ఇలా తీసుకున్న కథాంశం తాలూకు ఒరిజినాలిటీని ఆవిష్కరించాలి అన్న ప్రయత్నంలో గొప్ప హానెస్టీ కనిపిస్తుంది. ఇది ఏదో ఒక కథ అనుకొని,అల్లుకొని చేసిన ప్రయత్నం కాదు… ఫ్యాక్షనిజం మూలాల మీద అక్కడి జీవన విధానం మీద ఒక సాధికారిక అవగాహనతో చేసిన ప్రయత్నం. ఆ కోణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప విజయాన్ని సాధించారని అభినందించవచ్చు.

పర్ఫార్మెన్స్:

ఇక పర్ఫార్మెన్స్ ల విషయానికి వస్తే – వీర రాఘవ రెడ్డి పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం, ఆహా, ఓహో అని కొత్తగా కితాబులివ్వడం అసహజంగా ఉంటుంది. ఎన్టీఆర్ ఒక పాత్రను గొప్పగా పోషించటం ఎవరికి వార్త కాదు… అందులో కొత్త విశేషమే లేదు.ఈ “వీర రాఘవరెడ్డి” పాత్రను కూడా ఎన్టీఆర్ అవలీలగా చేసినప్పటికీ పాత్ర తాలూకు సోల్ ను,డెప్త్ ను ఆకలింపు చేసుకున్న విధానం సింప్లీ మార్వలెస్. చాలెంజింగ్ పాత్రలు ఎదురైన ప్రతిసారి ఎన్టీఆర్ విజేతగా నిలబడటం లో విశేషమేమీ లేదు… అయితే కళ్ళముందే తండ్రి దారుణ హత్యకు గురవడంతో కేరెక్టర్లో ఏర్పడిన సీరియస్ నెస్ ను చివరిదాకా అదే టెంపోతో మెయింటెన్ చేయడం అభినందనీయం.

ఇక నటన పరంగా ఎన్టీఆర్ తర్వాత బసిరెడ్డి పాత్రను పోషించిన జగపతిబాబును ప్రత్యేకంగా అభినందించాలి. ఆ పాత్రలోని మూర్ఖత్వాన్ని, మొరటుతనాన్ని గొప్పగా అభినయించారు జగతిబాబు. ఎన్టీఆర్ తండ్రిగా నటించిన నాగబాబు పాత్ర చాలా పరిమితమైంది.

ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే, హీరో నాన్నమ్మ గా సుప్రియా పాఠక్, ఇతర పాత్రల్లో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ చంద్ర, నరేష్, రావు రమేష్, ఈశ్వరీ రావు, సితార, ఈషా రెబ్బ పాత్రోచితంగా నటించారు.

ఇక టెక్నికల్ గా పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం, తమన్ సంగీతం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధా కృష్ణ మేకింగ్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి.

మొత్తం మీద ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ల అరవింద సమేత వీర రాఘవ మధ్యమధ్యలో కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ ల తొలి కాంబినేషన్లో వచ్చిన మంచి యాక్షన్ క్లాసిక్ గా అభినందించవచ్చు.

 

అరవింద సమేత మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here