ఒక్కక్షణం సినిమా తరువాత అల్లు శిరీష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కక్షణం సినిమా తరువాత వచ్చిన 1971 సినిమా వచ్చినా అది ఆశించినంత విజయం దక్కకపోవడంతో ఈ సారి సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళంలో హిట్ కొట్టిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చెబుతూ… ‘సినిమాలో నేను కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో నటిస్తుండొచ్చు… కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్లో వినోదాన్ని పంచడం పక్కా’అంటూ పోస్ట్ చేశాడు.
కాగా అల్లు శిరీష్ సరసన ఈ సినిమాలో ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. మరి మలయాళంలో హిట్టయిన ఈ సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొడతాడో లేదో చూద్దాం.