రాయలసీమ హింసను కాదు అందాన్ని గ్లోరిఫై చేయడానికి ప్రయత్నించాం – త్రివిక్రమ్ శ్రీనివాస్

Aravindha Sametha Movie Latest News, Director Trivikram About Aravindha Sametha Movie, Latest Telugu Movies 2018, Star Director Trivikram Srinivas Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Trivikram Clarifies on Aravindha Sametha, Trivikram Clarifies on Aravindha Sametha Telugu Movie, Trivikram Interview on Aravindha Sametha Movie, Trivikram Talks About Aravindha Sametha Movie
Trivikram Clarifies on Aravindha Sametha

త్రివిక్రమ్ శ్రీనివాస్….. ఆ పేరుకు ముందు మాటల మాంత్రికుడు, క్లాస్ డైరెక్టర్, సెన్సిటివ్ డైరెక్టర్, సెన్సిబుల్ డైరెక్టర్ వంటి కాంప్లిమెంట్స్ రాస్తుంటుంది మీడియా. ఆ కాంప్లిమెంట్స్ కు అన్ని విధాల అర్హుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనటానికి దర్శకుడిగా అతని 16 సంవత్సరాల 10 సినిమాల కెరీర్ నిదర్శనంగా నిలుస్తుంది. రేపటికి అంటే అక్టోబర్ 10 -2018 తో దర్శకుడిగా 16 సంవత్సరాల సక్సెస్ ఫుల్ కెరీర్ పూర్తి చేసుకుంటున్నారు త్రివిక్రమ్.2002 అక్టోబరు 10న తను దర్శకత్వం వహించిన తొలి చిత్రం నువ్వే నువ్వే విడుదలైంది. ఇప్పుడు అక్టోబర్ 11న తన పదవ చిత్రం” అరవింద సమేత వీర రాఘవ” రిలీజ్ అవుతుంది. రేపటికి తన కెరీర్ ప్రారంభమై 16 సంవత్సరాలు పూర్తయింది అన్న విషయం తనకు గుర్తు లేకపోయినా మీడియా గుర్తు చేయడంతో ” నిజంగా మీరు చెప్పే దాకా ఈ విషయం నాకు గమనమే లేదు… ఇప్పుడు మనం కలిసింది అరవింద సమేత గురించి మాట్లాడుకోవటానికి” అంటూ ఆ సినిమా వివరాలను, విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

* అరవింద సమేత వీర రాఘవ లో ఫ్యాక్షనిజం, హింస వంటివి వద్దు.. తప్పు అంటూ సూక్తులు బోధించటం పెట్టుకోలేదు. కానీ ఈ జనరేషన్ వాటి గురించి మాట్లాడుకునే మంచి కంటెంట్ అందులో ఉంటుంది. ప్రేమ అయినా ద్వేషం అయినా మాటలతోనే ముగించుకోవచ్చు అనే అభిప్రాయానికి ఈ జనరేషన్ కనెక్ట్ అవుతుంది.

* సాధారణంగా మీ సినిమాల్లో ఉండే మాటల మెస్మరైజింగ్, సరదా, ఫన్ ఇందులో ఉంటాయా అన్న ప్రశ్నకు…. ఈ ఎలిమెంట్స్ ఈ మోతాదులో ఉండాలి.. ఆ ఎలిమెంట్స్ ఆ మోతాదులో ఉండాలి అనే కొలతలు భయాలు ముందుగా తీసేద్దాం. ఫ్యాక్షన్ సినిమా అనగానే కార్లు , బాంబులు వంటి రెగ్యులర్ నార్మ్స్ ఉండాలి అనుకోలేదు. ఇందులో రాయలసీమ హింస కంటే రాయలసీమ భాషను, యాసను, సొగసును పట్టుకోవటానికి ప్రయత్నించాం.

* ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి మీకు ఇంతకాలం ఎందుకు పట్టింది.. అన్న ప్రశ్నకు” మా కాంబినేషన్లో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నప్పటికీ ఇద్దరము బిజీ అవడంతో అది సాధ్యపడలేదు. తను నాన్నకు ప్రేమతో చేస్తున్నప్పుడు, నేను అ ఆ చేస్తున్నప్పుడు సీరియస్ గా అనుకున్నాం.

* చేయాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సబ్జెక్టు వెంటనే ఓకే అనుకున్నారా…

” నాకు రాత్రి పూట పడుకుని ఆలోచిస్తుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఇది భలే ఉందే అనుకుని ఆవేశపడిపోతాను. మరలా పొద్దున్నే అదే ఐడియా చెత్తగా అనిపిస్తుంది. ఇలా రెండు మూడుసార్లు ఇది బాగుంది అది బాగుంది అనుకుంటూ చివరకు ఈ సబ్జెక్ట్ మీద ల్యాండ్ అయ్యాం.

* ఇందులో సుప్రియా పాఠక్ ను తీసుకోటానికి కారణం ఏమిటి?

అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ కు సరైన ఆర్టిస్ట్ ఎవరు అని నేను ఆలోచిస్తుంటే సడన్ గా సుప్రియా పాఠక్ పేరును ఎన్టీఆర్ సజెస్ట్ చేశారు. అది చాలా మంచి సెలక్షన్ అనిపించింది. వెంటనే ఆమెను కాంటాక్ట్ చేస్తే “ నేను ఖాళీగానే ఉన్నాను… కాని నాకు నా డైలాగులు ముందుగానే పంపించాలి… అన్నారు. ఆమె చాలా స్ట్రిక్ట్.. పర్ఫెక్షనిస్ట్… వెంటనే ఆమెకు స్క్రిప్ట్ తో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను కూడా పంపించామ్.

* సక్సెస్ – ఫెయిల్యూర్స్ విషయంలో మీ ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది.?

సక్సెస్ వస్తే ఆనందంగా ఉంటుంది… ఫెయిల్యూర్ వస్తే కొంచెం బాధ ఉంటుంది… అంతే తప్ప రెండింటికీ తెగ ఫీల్ అయిపోవటం ఉండదు. అది స్థిత ప్రజ్ఞత అనను గానీ దేనిని అంత సీరియస్ గా తీసుకోను. సక్సెస్ వచ్చిందని మెడలో దండలు వేసుకుని తిరగలేం… ఫెయిల్యూర్ వచ్చిందని మెడలో డస్ట్ బిన్ వేసుకుని తిరగలేను. సక్సెస్ కు లక్ష కారణాలు ఉండవచ్చు… అలాగే ఫెయిల్యూర్కు లక్ష కారణాలు ఉండవచ్చు.

 

* మీ సినిమాల్లో హీరోయిన్స్ తో డబ్బింగ్ చెప్పించడం మీ నిర్ణయమా ?

అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎమోషనల్ సీన్ చేసినప్పుడు వాళ్లు ఎక్సైట్ అయి మేమే డబ్బింగ్ చెప్పుకుంటాం అంటారు… వాళ్లది స్పాట్ ఎమోషన్ కాకపోతే వాళ్లే ఫాలో చేస్తారు. ఇప్పుడు పూజా హెగ్డే లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కొంత రిస్క్ తీసుకోనైనా ఆమెతో డబ్బింగ్ చెప్పించాం. అలా కాకుండా షూటింగ్ అయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనమేం చేయలేం కదా.

మీలోని దర్శకుడు – రచయిత వీళ్ళిద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం.?

దీనికి సమాధానం చెప్పటం చాలా కష్టం. రాముడు భీముడు సినిమాలో లాగా నన్ను నేను రాముడుగా భీముడు గా విడదీసుకొని చూడలేను. మామూలుగా ఫంక్షన్స్ లో యాంకర్స్ నన్ను వేదిక మీదకు పిలిచేటప్పుడు మాటల మాంత్రికుడు అది ఇది అని స్టార్ట్ చేయగానే వాళ్లు చెప్పటం పూర్తికాకుండానే నేను డయాస్ మీదకు వెళ్తాను. కాబట్టి నాలో రచయిత డైరెక్టర్ వేరు వేరు కాదు…. రెండూ కలిస్తేనే నేను.

ఇప్పుడు వస్తున్న సినిమాలు, దర్శకుల మీద మీ అభిప్రాయం ఏమిటి?

నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు థియేటర్ కు వెళ్లి చూస్తాను. కొన్ని సినిమాలు చూసినప్పుడు నేను ఎందుకు ఇంత బాగా తీయలేక పోతున్నాను అని ఈర్ష్య పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు చూసి నేను ఫర్వాలేదు అనుకున్న సందర్భాలు ఉన్నాయి.

*మిమ్మల్ని అంతగా ఈర్ష్య పడేలా చేసిన సినిమాలు ఏమిటి?

చాలా ఉన్నాయి… అర్జున్ రెడ్డి, రంగస్థలం, పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలం, ఆర్ ఎక్స్ 100, గూడచారి ఈ సినిమాలు చూసి నేను ఈర్ష్య పడ్డాను. నిజంగా కొత్త దర్శకులు చాలా బాగా తీస్తున్నారు. ముఖ్యంగా గూడచారి చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక సింగల్ జోనర్లో డిలీటెడ్ రిసోర్సెస్ లో రెండు గంటల 20 నిమిషాల సినిమాను అంత టెంపోలో తీయటం నాకు చాలా నచ్చింది.

* దర్శకుడికి బడ్జెట్ మీద అవగాహన, కంట్రోలు ఉండాలి అనేదానిమీద మీ అభిప్రాయం ఏమిటి?

ఇంతవరకు నేను ఏ నిర్మాతకు బడ్జెట్ చెప్పలేదు. బడ్జెట్ గురించి దర్శకుడికి కొంత తెలిస్తే కొంత పట్టించుకుంటే చాలు… పూర్తిగా తెలియనవసరం లేదు. బాహుబలి బడ్జెట్ ఇంత అని పేపర్ మీద రాసి ఇస్తే మీరే నిర్మాత అయితే ఆ సినిమా చేస్తారా? కాబట్టి బడ్జెట్ గురించి దర్శకుడికి కొంత తెలిస్తే చాలు.

* సాధారణంగా మీ సినిమాకు 100 రోజులు పైనే పడుతుంది. కానీ అరవింద సమేత…70 రోజుల్లోనే పూర్తయింది అన్నారు… ఇదెలా సాధ్యమైంది?

ఎన్టీఆర్ వల్ల సాధ్యమైంది. తనే ఫాస్ట్ గా లాక్కెళ్లి పోయాడు. ఎన్టీఆర్ స్క్రిప్ట్ ను ఒకటికి పదిసార్లు వింటారు. అది ఆయన బ్రెయిన్ లోకి పూర్తిగా ఏక్కి ఉంటుంది… ఎక్కడ ఏ షాట్ పెట్టినా మొత్తం సీను చెప్పగలరు. స్క్రిప్టు మొత్తం అంతలా బుర్రలోకి వెళ్లిపోవటంతో తన నుండి output చాలా ఫాస్ట్ గా వస్తుంది. దానికి తోడు చెప్పిన టైం కు అరగంట ముందే వచ్చి సెట్లో కూర్చుంటారు… దానితో మేమందరం అలర్ట్ అవ్వవలసి వస్తుంది. సో.. ఈ సినిమా ఇంత త్వరగా అవ్వటానికి ముఖ్య కారణం అయ్యారు ఎన్టీఆర్.

* అరవింద సమేత వీర రాఘవ త్రీవిక్రమ్ స్టైల్ లో ఉంటుందా…? ఎన్టీఆర్ స్టైల్ లో ఉంటుందా?

* ఒక స్టార్ బలాన్ని, ఇమేజిని వాడుకుంటూనే సినిమా స్టార్ట్ చేస్తాం. ఇది కూడా అలాగే ఎన్టీఆర్ ఇమేజ్ పరంగా ఉంటూనే నా స్టైల్ కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద సినిమా కంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది.

* మహేష్ బాబు, అల్లుఅర్జున్ లతో మీ సినిమాలు త్వరలో ఉంటాయని వినిపిస్తుంది.!?
(నవ్వుతూ) ఇది అరవింద సమేత వీరరాఘవ ప్రెస్ మీట్ … ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలే మాట్లాడుకుందాం.

* హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మీరు తనకు చాలా సపోర్టివ్ గా నిలబడ్డారని ఎన్టీఆర్ ఫంక్షన్లో చెప్పారు…( ప్రశ్న పూర్తి కాకముందే…)

అదే ఆయన మంచితనం. నేను ఆయనకు సపోర్టుగా నిలబడటం కాదు… ఆయనే మాకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఆయనకు కలిగిన విషాదం మాటలతో తొలిగి పోయేది కాదు… మేము అసలు ఆయనను కదిలించ కూడదు … అనుకుంటే ఆయనే మమ్మల్ని కదిలించారు. రేపటినుండి షూటింగ్ పెట్టుకోండి అని ఆయన నుండి కబురు వస్తే మేమందరం షాక్ అయ్యాం. తాను తన విషాదాన్ని తనకే పరిమితం చేసుకున్నారు తప్ప ఎవరికి షేర్ చేయలేదు.

* మీరు పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇస్తుంటారని రాజకీయాల్లోకి వెళ్ళటం లో కూడా మీ సలహా పని చేసిందని అంటుంటారు… ఇది ఎంత వరకు నిజం?

(నవ్వుతూ) సలహా…. నేను… హ హ హ… పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలు ఏవైనా నాకు కూడా వార్తలే .. నాకే కాదు చిరంజీవి గారికి, వాళ్ల అమ్మగారికి కూడా అవి వార్తలే… ఎవరైనా పొద్దున్నే పేపర్లో చూసుకోవాల్సిందే.

* అదేంటి…? పవన్ కళ్యాణ్ మాట్లాడే స్పీచ్ లన్నీ మీరిచ్చే స్క్రిప్టులేనట కదా!

(పెద్దగా నవ్వుతూ)…. నా స్క్రిప్ట్ నేను రాసుకోవడానికే సంవత్సరం పట్టుద్ది… అలాంటిది ఆయన రోజూ మాట్లాడే స్పీచ్ లు నేను రాసి పంపిస్తానా? ఇంతకుమించి జోక్ ఏమీ ఉండదు.

* పోనీ మీరు ఏమైనా సలహాలు ఇస్తుంటారా?

ఎవరి సలహాల మేరకు ఎవరి జీవితాలు సాగవు… అయిన వాళ్లకు నేను సలహా ఇవ్వటం ఏమిటి? అసలు మా మధ్య రాజకీయాల ప్రస్తావనే రాదు. మాది మంచి స్నేహం… అంతవరకే . ఒకసారి పరిచయమైతే నాతో స్నేహం అలా కంటిన్యూ అవుద్ది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, సునీల్, చివరికి మా భీమవరం ఫ్రెండ్స్ అంతా అలా కంటిన్యూ అవుతున్నారు. అంతే తప్ప ఎవరికి సలహాలు ఇచ్చే పని నేను పెట్టుకోను. పవన్ కళ్యాణ్ ఒక ఐడియాలజీతో వెళుతున్నారు… అయినా నేను సలహా ఇచ్చే స్థితిలో ఆయన లేరు. ఆయనే కాదు ఎన్టీఆర్ కూడా…. అతి చిన్న వయసులోనే గొప్ప సక్సెస్లు చూసిన వాళ్ళు వాళ్ళు. కేవలం 18 ఏళ్ల వయసులో సింహాద్రి అనే పెద్ద హిట్ తో సూపర్ స్టార్ అవ్వటమే కాకుండా అంత చిన్న వయసులో ఆ సక్సెస్ ను చక్కగా డిజైన్ చేసుకున్నారు ఎన్టీఆర్. పొగడ్తలు, తప్పుడు సలహాలు, వ్యామోహాలు వంటి వేటికీ దొరక్కుండా ఒక గొప్ప కెరీర్ ను నిర్మించుకున్నారు. అలాంటి వాళ్లకు మనం సలహాలు ఇవ్వటం ఏమిటి? వాళ్ల నుండి సలహాలు తీసుకునే పరిస్థితి రాకుండా చూసుకుంటే చాలు…. అంటూ మీడియా ఇంటరాక్షన్ కు ముగింపు పలికారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here