పద్దెనిమిదవ పడిలోకి ప్రవేశించిన దర్శకధీరుడి అప్రతిహత విజయ ప్రస్థానం

SS Rajamouli Enters 18th Year in Glorious Film Career,latest telugu movies news, Telugu Film News 2018,Telugu Filmnagar, Tollywood Movie Updates,Key Secrets of S.S Rajamouli,Glorious Career of Director SS Rajamouli,SS Rajamouli Career Success,Tollywood Director SS Rajamouli,SS Rajamouli Achievements,18 Year of SS Rajamouli Film Career
SS Rajamouli Enters 18th Year in Glorious Film Career

ఇండియన్ సినిమా అంటే ఉత్తరాది వారు తీసే హిందీ సినిమాలే అనుకునే “రెస్ట్ ఆఫ్ ద వరల్డ్” కు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే కాదు…ఇక్కడ సౌత్ ఇండియా అనేది ఒకటి ఉందనీ… ఇక్కడ నాలుగు ప్రధాన భాషలలో సినిమాలు నిర్మితమౌతాయనీ .. వాటిలో “తెలుగు సినిమా” అనేదానికి ఒక గొప్ప అస్తిత్వం ఉందనీ నిరూపించారు మన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.ఆయన దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి” ఇండియన్ సినిమా ముఖచిత్రం అంటే హిందీ సినిమా మాత్రమే కాదు అని నిరూపించింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా కు ప్రాతినిధ్య చిత్రంగా బహుళ ప్రచారం పొందిన చిత్రం మన బాహుబలి. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రలో కనీవినీ ఎరుగని కలెక్షన్ల సునామిని సృష్టించిన బాహుబలి సృష్టికర్త ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు గా కెరీర్ ప్రారంభించి ఈరోజుకు 17 ఏళ్లు పూర్తయ్యాయి.

2001 సెప్టెంబర్ 27న రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం “ స్టూడెంట్ నెంబర్ 1” విడుదలైంది. అంటే కచ్చితంగా ఈ రోజుకు ఆయన ప్రస్థానం 18వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో రాజమౌళి విజయ విహార ప్రస్థాన విశేషాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఏ దర్శకుడైనా తన ప్రారంభ చిత్రం నుండి వరుసగా పదికి పైగా ఘన విజయాలను సాధించిన సందర్భాలు చాలా అరుదు. దాదాపుగా లేవనే చెప్పాలి. అలాంటి ఘనత మన తెలుగులో ముగ్గురు దర్శకులకు దక్కటం మనందరం గర్వించాల్సిన విజయ విశేషం .

శతాధిక చిత్ర దర్శక శిఖరం దాసరి నారాయణరావు, ప్రముఖ దర్శకులు బి.గోపాల్, ఈతరం దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ అరుదైన ఘనతను సాధించారు.

మూడు వరుస విజయాలను సాధిస్తే హ్యాట్రిక్ అంటారు.. మరి వరుసగా మూడు హ్యాట్రిక్ విజయాలకు చేరువవుతున్న రాజమౌళి విజయ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం.17 ఏళ్ల ప్రయాణంలో రాజమౌళి సంఖ్యాపరంగా కేవలం 11 చిత్రాలు మాత్రమే ఇచ్చినప్పటికీ అవి సాధించిన ఘన విజయాలు బాక్సాఫీస్ చరిత్ర లో సువర్ణ అక్షర లిఖితమయ్యాయి.

వరుసగా స్టూడెంట్ నెంబర్ 1, .,సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్- ఇవి రాజమౌళి నుండి వచ్చిన 11 అద్భుత విజయాలు. ఇన్ని వరుస విజయాలతో శిఖరాగ్ర దర్శకుడిగా ఎదిగినప్పటికీ వ్యక్తిగా నిరాడంబర, పారదర్శక వ్యక్తిత్వాన్ని అలవరచుకున్న రాజమౌళి లోని సంస్కార సంపద వెలకట్టలేనిది. ఆయనతో పాటు ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరిలో సినిమా పట్ల ఎనలేని ఆసక్తి, అధ్యయనం, అంకిత భావం, శ్రమ, పట్టుదల , సంఘటిత శ్రమ జీవన సౌందర్యం కనిపిస్తాయి.

స్వాతంత్ర్యానంతర చరిత్రలో తెలుగు జాతి ఉనికికి గుర్తింపు వచ్చి తెలుగు వారి ప్రస్తావనతో, ప్రశంసలతో, అభినందనలతో జాతీయ, అంతర్జాతీయ వేదికలు మారుమ్రోగిన సందర్భాలు నాలుగు ఉన్నాయి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారాన్ని కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సందర్భంలో తొలిసారి తెలుగువాడి వాడి వేడి జాతీయంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఆ తరువాత బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు భారత ప్రధాని పదవిని అలంకరించిన తరుణంలో తెలుగు జాతి యావత్తు పులకించి పోయింది… తెలుగు జాతి బావుటా మరోమారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడింది..

ఇవి రెండూ రాజకీయ రంగానికి చెందిన విజయ విశేషాలు కాగా…. సినిమా పరంగా తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తమైన సందర్భాలు రెండున్నాయి…ఒకటి కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో “శంకరాభరణం” సినిమా విడుదలైనప్పుడు అది సాధించిన ఘన విజయ విశేషాలతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.

ఆ తరువాత తెలుగు సినిమా జాతీయస్థాయిలో ప్రభావాన్ని చూపిన సందర్భం దాదాపు లేదనే చెప్పాలి. ఇన్నేళ్ల తరువాత తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును , గౌరవాన్ని , ప్రతిష్టను తెచ్చిన ఘనత మన దర్శక ధీరుడు రాజమౌళికి దక్కింది.

అయితే బాహుబలి ద్వారా రాజమౌళి తెలుగు సినిమాకు తెచ్చిన గౌరవ ప్రతిష్టలను మరి ఏ ఇతర సందర్భం తోను ,విజయంతోనూ పోల్చటానికి వీలు లేదు. ఎందుకంటే బాహుబలి విజయం ఒక సాధారణ కమర్షియల్ సినిమాకు వచ్చే రెగ్యులర్ సక్సస్ లాంటిది కాదు. ఈ రోజున జాతీయస్థాయిలో ఏ భాషలో ఏ సినిమా విజయాన్ని తీసుకున్నా”non Baahubali” అంటున్నారే తప్ప బాహుబలి విజయంతో పోల్చదగిన సినిమా ఇప్పట్లో వస్తుందన్న ఆశ, అంచనా ఎవరికీ లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ” బాహుబలి” అని ఇండియన్ డైరెక్టర్ అంటే “రాజమౌళి” అనే స్ప్రుహ అంతర్జాతీయ సినిమా వేదికలపై వినిపిస్తుంది… కనిపిస్తుంది.

ఇంతటి ఘన కీర్తిని, ప్రతిష్టను తెలుగు సినిమాకు తెచ్చిపెట్టిన ఎస్ ఎస్ రాజమౌళి సినీ ప్రస్థానం పదిహేడు వసంతాలను పూర్తిచేసుకుని పద్దెనిమిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంచలన దర్శకధీరుడు రాజమౌళికి హృదయపూర్వక శుభాభినందనలు పలుకుతోంది “దితెలుగుఫిలింనగర్.కామ్“.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here