“మీ” వ్యక్తిగత విభేదాలతో “మా” పరువు పోతుంది

MAA Association Funds Allegations,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,MAA Association Controversy, Telugu Actors Srikanth Verses Naresh,MAA Association News,MAA Association Latest Updates,Telugu Movie Artist Asssociation,MAA Association Funds Distribution Allegations
MAA Association Funds Allegations

సినిమా ఇండస్ట్రీ అంటే 24 శాఖల సమాఖ్య .అన్ని శాఖలకు వారివారి అసోసియేషన్స్ ఉన్నాయి.అన్ని అసోసియేషన్స్ లోను సమస్యలు, విభేదాలు ఉంటాయి. పట్టుమని పాతికమంది సభ్యులు కూడా ఉండని అసోసియేషన్సే కొట్టుకు చస్తున్నాయి. అలాంటిది వందల సంఖ్యలో సభ్యులున్న “మా” లాంటి గ్లామరస్ అసోసియేషన్ లో విభేదాలు తలెత్తటం సహజం.అయితే ఎంత గొప్ప అసోసియేషన్ అయినా ఒకటికి నాలుగు సార్లు విభేదాలతో రోడ్డుకెక్కితే సంస్థ పరువు ,ప్రతిష్టలు రోడ్డు పాలవుతాయి. తమ మీద వేరే వాళ్ళు బురద చల్లితే పోయే పరువుకన్నా తమ మీద తామే బురద చల్లుకుని ఒళ్ళంతా పూసుకుంటుంటే పోయే పరువే ఎక్కువ. మొత్తానికి గత రెండు మూడేళ్ళుగా “మా” వ్యవహారాలు తరచు రచ్చకెక్కుతున్నాయి.

గతంలో ఒకసారి ఎన్నికల సందర్బంగా జరిగిన రసాభాసను మర్చిపోయి ప్రస్తుత కమిటీ ఏకగ్రీవం అయింది కదా అని అందరూ సంతోషించారు .కానీ ఆ సంతోషం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసి అధ్యక్ష కార్యదర్సులే ప్రత్యక్ష పోరారాటానికి దిగి ఒకరి మీద ఒకరు మీడియా సాక్షిగా బురద చల్లుకునే దాకా వెళ్ళటం దురదృష్టకరం. శ్రీరెడ్డి వివాదంతో జరిగిన పరువు నష్టాన్ని ప్రతి దాడితో కొంతవరకూ పూడ్చుకోగలిగినా ప్రస్తుత వివాదం ‘ఇంటిగుట్టు’ లాంటిది…ఇంట్లో వాడే పెట్టాడు కంట్లో పుల్ల అన్న సామెతను నిజం చేస్తున్నట్లుగా ఉన్నాయి గత రెండు రోజుల పరిణామాలు.

బయటి వివాదాలు, శ్రీరెడ్డి రచ్చ వంటివి ఎలా ఉన్నా గత సంవత్సర కాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో జరుగుతున్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాల పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కార్యవర్గం పగ్గాలు చేపట్టేనాటికి కోటిన్నర ఉన్న వెల్ఫేర్ ఫండ్ ఇప్పుడు 5 కోట్లకు చేరింది.వృద్ధాప్య పెన్షన్లు, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.కేరళ వరద బాధితుల సహాయార్ధం సముచితంగా స్పందించారు.ఇంకా సందర్భోచిత స్పందనతో ఎన్నో సత్కార్యాలు చేపట్టింది ‘మా’. మధ్యలో జరిగిన కొన్ని అవాంఛిత సంఘటనలు మినహా సంస్థ ప్రగతి విషయంలో ఎలాంటి ఆక్షేపణ లేని విధంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఈ అంతర్గత విభేదాలు ఎమిటి?

అమెరికాలో చేసిన ఫండ్ రైసింగ్ లో ముందుగా అనుకున్న కోటి రూపాయలు వచ్చాయి.ఒక వేళ అందులో ఏదైనా మిస్ యూజ్ జరిగిందనుకుంటే దాన్ని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే సంయమనం “మా” కు లేకుండా పోయిందా? ఈ మాత్రానికి ఎవరో ప్రభుత్వాధికారులతో నిజనిర్ధారణ కమిటీలు వేసుకొని రచ్చకెక్కలా? నలుగురు ఇండస్ట్రీ పెద్దలను కూర్చోబెట్టుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే విజ్ఞతను మరిచి ఇలా ఒకరిమీద ఒకరు పోటాపోటీగా ప్రెస్ మీట్స్ పెట్టి ఇంటిగుట్టును రచ్చకీడ్చుకునే ఉబలాటం దేనికోసం? ఏ ప్రయోజనాలనాశించి ఈ పరస్పర హననం?

“మా” అంటే ఆ కార్యవర్గ పదవుల్లో ఉన్న కొద్దిమంది సొంతం కాదు…దాదాపు 800 మంది సభ్యుల అస్తిత్వం. ఈ రోజున ఎక్కడైనా ఇంత స్వల్ప వివాదం జరిగిదంటే అది టీ వీ ఛానళ్లు,వెబ్సైట్లు, యూ ట్యూబ్ చాన్నాళ్ల లో చిలవలు పలవలై పతాక శీర్షికలకెక్కి పరువుప్రతిష్టలు బజారుపాలవుతున్న విషయం ఈ “మా” పెద్దలకు తెలియదా ? ఏమిటి మాటికి మాటికీ ఈ ప్రెస్ మీట్ల ప్రహసనం? నిన్న జరిగిన పోటాపోటీ ప్రెస్ మీట్స్ లో చేసుకున్న పరస్పరారోపణలను టీవీ లలో చూసి ఇళ్లలో ఆడవాళ్లు సైతం ‘మళ్లీ మొదలయింది ‘మా’రచ్చ అని నవ్వుకుంటున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here