మన సినిమాల్లో దేశభక్తి ని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హైలైట్ చేస్తూ సందర్భోచితంగా ప్రభోదాత్మకమైన పాటలను, సన్నివేశాలను పెట్టడం మొదటి నుండి పాటిస్తున్నారు మన దర్శకనిర్మాతలు .అయితే ఈ విషయంలో తొలి అభినందన దక్కవలసింది “అన్నపూర్ణ పిక్చర్స్ ” సంస్థకు. ఈ సంస్థ తాను తీసిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక దేశభక్తి గీతాన్నో,లేక ఏదయినా సందేశాత్మక గీతాన్నో కంపల్సరీ ఐటెంగా భావించేది. ఈ ఓరవడిని మిగిలిన సంస్థలు కూడా పాటించడంతో అప్పట్లో ప్రతి సినిమాలో ఇలాంటి సందేశాత్మక గీతాలు ఉండేవి.అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనేది ఎంత ముఖ్య మో అప్పుడు దేశభక్తి గీతం అంత ముఖ్యం .
ఈ నేపధ్యంలో రేపు 72 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మన సినిమాలలో కొన్ని పాపులర్ అయిన దేశభక్తి మరియు ప్రభోద గీతాలను జ్ఞాపకం చేసుకుందాం .
ఈ సందర్భంగా ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది ‘వెలుగునీడలు ‘ సినిమాలోని ‘పాడవోయి భారతీయుడా ‘ అనే పల్లవితో సాగే శ్రీశ్రీ గీతం. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో దుక్కిపాటి మధుసూదన రావు నిర్మించిన ఈ చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు.పెండ్యాల నాగేశ్వరరావు ఈ పాటకు స్వర రచన చేశారు.
ఈ వరుసలో తరువాత చెప్పుకోదగిన గీతం ‘భారత మాతకు జే జే లు – బంగారు భూమికి జే జే లు ‘.పీ .సీ.రెడ్డి దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్. టి. ఆర్. బడిపంతులుగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాటను ఆచార్య ఆత్రేయ రచించగా కే వీ మహదేవన్ సంగీతం సమకూర్చారు.
ఇక సూపర్ స్టార్ కృష్ణ అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన’అల్లూరి సీతారామరాజు‘చిత్రం లోని ‘తెలుగువీర లేవరా… దీక్షపూని సాగరా ‘అనే పాట వింటుంటే వళ్ళంతా రోమాంఛితమౌతుంది .మహాకవి శ్రీశ్రీ రచించిన ఈపాట దేశభక్తి గీతాలలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. వీ.రామచంద్రరావు దరకత్వంలో ఆదినారాయణ రావు సంగీత సారధ్యంలో ,త్రిపురనేని మహారధి అద్భుత రచనతో రూపొందిన ఈ చిత్రం ఓ చెరగని చరిత్ర .
ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సర్దార్ ‘పాపారాయుడు’ చిత్రంలోని ‘విప్లవ జ్యోతి అల్లూరి’ అనే బుర్రకథ, ‘బొబ్బిలిపులి’ చిత్రంలో ‘జననీ జన్మ భూమిచ్చా ‘ అన్న పాటలను ఎప్పటికీ మర్చిపోలేము.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దరకత్వంలో వచ్చిన ‘మోసగాడు’ చిత్రంలోని”ఎగరాలి ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి,” అనే పాట, మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని ‘పుణ్య భూమి నా దేశం నమోనమామి’ అనే పాట ,ఝుమ్మంది నాదం చిత్రంలోని ‘దేశం మనదే’ అన్న చంద్రబోస్ గీతం,కృష్ణవంశీ ‘ఖడ్గం’ చిత్రంలోని ‘మేమే ఇండియన్స్ ‘ , సురేష్ వర్మ-జూనియర్ యన్. టి. ఆర్. ల ‘సుబ్బు’ చిత్రంలోని’ ఐ లవ్ మై ఇండియా’ అనే పాట … ఇవన్నీ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని,దేశభక్తి ని రగిలించే పాటలు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే…. ఇవే కాకుండా ఇంకా చాలా చిత్రాలలో ఇలాంటి సందేశాత్మక, ప్రభోదాత్మక గీతాలను సగర్వంగా జాతికి సమర్పించింది తెలుగు చిత్ర పరిశ్రమ .
ఇక వీటన్నింటికీ తలమానికంగా నిలిచే గొప్ప సమైక్య గీతం ఒకటి ఉంది. అదే “తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది”. ఈ పాట రాసిన సి. నా.రె. వారు ఇప్పుడు లేరు…రాయించి నటించిన “నందమూరి నట సార్వభౌముడు ” లేరు… అసలు పైన పేర్కొన్న పాటల సృష్టికర్తలు చాలా మంది ఇప్పుడు లేరు. కానీ ‘పాట’ ఉంది…అది నింపిన స్ఫూర్తి ఉంది. 72 వ స్వాతంత్ర్య దినోత్సవ సంధర్బంగా ఆ పాటలలోని ‘ఆపాత మధురాలను ‘ గుర్తుచేస్తూ మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు పలుకుతుంది మీ “తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్.
