ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిప్రేమకి 20 ఏళ్ళు

Power Star Pawan Kalyan Tholi Prema Movie Completes 20 Years,Latest Telugu Movies 2018,Telugu Filmnagar,Telugu New Movies,Tollywood Upcoming Movie News,Tholi Prema Telugu Movie Completes 20 Years,20 Years of Pawan Kalyan Tholi Prema Movie,Pawan Kalyan 20 years Journey in Tollywood,Pawan Kalyan Blockbuster Tholi prema Completes 20 Years
Power Star Pawan Kalyan Tholi Prema Movie Completes 20 Years

తెలుగు తెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి. అయితే కొన్ని ప్రేమ‌క‌థ‌లు మాత్ర‌మే మంచి అనుభూతిని ఇస్తాయి. అలాంటి మంచి అనుభూతిని అందించిన ప్రేమ‌క‌థా చిత్రాల‌లో 20 ఏళ్ళ క్రితం విడుద‌లైన ‘తొలిప్రేమ’ ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సినిమా ఇది. అంతేగాకుండా.. యువ‌త‌లో ప‌వ‌న్ ప‌ట్ల ఉన్న ఇప్ప‌టి క్రేజ్‌కు బీజం వేసిన చిత్రం కూడా ఇదే అని చెప్పాలి. ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఎ.క‌రుణాక‌ర‌న్ రూపొందించిన మొద‌టి సినిమా ఇది. క‌థ‌, క‌థ‌నం, న‌టీన‌టులు, మాట‌లు, పాట‌లు, నేప‌థ్య సంగీతం, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణ విలువ‌లు.. ఇలా అన్ని ర‌కాలుగా క్వాలిటీ ప్రోడ‌క్ట్‌గా నిలిచిన ఈ ప్రేమ క‌థ‌.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సును తాకి.. ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్ స్టోరీగా నిలిచిపోయింది. అస‌భ్య‌త‌కు తావు లేకుండా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ఈ ల‌వ‌బుల్‌ ఎంట‌ర్‌టైన‌ర్ గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. తాజ్ మ‌హ‌ల్ అంత అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం ‘తొలిప్రేమ’ అని చెప్పుకోవ‌చ్చు. 24 జూలై 1998న విడుద‌లైన ‘తొలిప్రేమ’ నేటితో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆ ‘తొలిప్రేమ’ తాలుకూ జ్ఞాప‌కాల ప్ర‌యాణంలోకి వెళితే..

క‌థాంశం

“ప్రతీ మనిషికి జీవితంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. జీవితంలో ఎదగడానికి ల‌క్ష్యం కూడా అంతే ముఖ్యం” అనే సింపుల్ లైన్‌తో ఈ సినిమాను రూపొందించారు ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్‌. కథలోకి వెళితే.. “చదువు కంటే క్రికెట్, ఫ్రెండ్స్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాడు బాలు(పవన్ కళ్యాణ్). ఇంట్లో చిన్నవాడు కావడంతో పెదనాన్న(నగేష్), తల్లి(సంగీత) గారాబం కూడా తోడవుతుంది. ఎలాగైనా నేషనల్స్‌లో ఆడాలన్నది బాలు గోల్. ఇదిలా ఉంటే.. ఒక రోజు అను(కీర్తి రెడ్డి)ని చూసి.. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు బాలు. ఆ త‌రువాత కూడా మ‌రికొన్ని సార్లు క‌నిపించిన‌ట్లే క‌నిపించి మిస్ అవుతుంటుంది అను. ఊటీలో ఓసారి అనుని ప్రాణాలకి తెగించి కాపాడతాడు బాలు. ఈ ఘ‌ట‌న త‌రువాత బాలు, అను మధ్య స్నేహం చిగురిస్తుంది. అను తనతో చనువుగా ఉండడం చూసి ఎలాగైనా తన ప్రేమ గురించి చెప్పాల‌నుకున్నా.. తమ మధ్య ఉన్న స్నేహం పాడ‌వ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో చెప్ప‌కుండా ఉండిపోతాడు. ఈలోగా.. క్రికెట్‌లో నేషనల్స్‌కి బాలు సెలెక్ట్ అవడం.. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ(కేంబ్రిడ్జ్‌)లో అనుకి అడ్మిషన్ రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అను వెంటనే అమెరికాకు పయనమవ్వాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అనుని డ్రాప్ చేయడానికి ఎయిర్ పోర్ట్‌కి వెళతాడు బాలు. ఎయిర్ పోర్ట్‌కి వెళ్ళే మధ్యలో బాలుతో గడిపిన రోజులు, అతని స్నేహం గుర్తు చేసుకుంటుంది అను. బాలుతో తనకున్నది కేవలం స్నేహం మాత్ర‌మే కాదని ప్రేమని తెలుసుకుంటుంది. ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్‌లో బాలుకి చెబుతుంది. కాని దీని వలన తమ గోల్స్ డిస్ట‌ర్బ్‌ కాకూడదని.. తమ గోల్స్ సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుందామని బాలు చెప్ప‌డంతో క‌థ సుఖాంతం అవుతుంది.

ముందు చెప్పుకున్నట్టు.. ఒక మంచి లైన్‌తో పాటు ప్రేమ, భ‌యం రెండూ కూడా ప‌క్క‌ప‌క్క‌నే ఉంటాయ‌నే స‌త్యాన్ని కూడా అంత‌ర్లీనంగా బాగా చూపించారు ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్. ప్రేమ తాలుకూ అనుభూతుల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు.. కుటుంబ బంధాల‌ను కూడా అంతే చ‌క్క‌గా దృశ్యీక‌రించారు. ముఖ్యంగా.. బాలు, అత‌ని చెల్లెలు (వాసుకి) మ‌ధ్య సాగే స‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్‌గా ఉంటాయి. అలాగే బాలుకి, అత‌ని పెద‌నాన్న‌(న‌గేష్‌) మ‌ధ్య సాగే స‌న్నివేశాలు కూడా. అదే విధంగా.. హీరోహీరోయిన్ల మ‌ధ్య సాగే ఎయిర్ పోర్ట్ సీన్ కూడా హార్ట్ బీట్‌ను పెంచేంత ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. ఇక ‘తొలిప్రేమ’సినిమా పేరు చెప్తే.. ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ కీర్తి రెడ్డి ఎంట్రీ సీన్. దీపావళి రోజున టపాసుల వెలుగులో తెల్ల‌ చుడిదార్‌లో కీర్తిని ఒక ఏంజెల్‌గా చూపించిన విధానాన్ని ఎవ‌రూ అంత సులువుగా మ‌రచిపోలేరు. గ‌త 20 ఏళ్ళ కాలంలో క‌థానాయిక ఎంట్రీని ఇంత బాగా మ‌రే ప్రేమ‌క‌థా చిత్రంలోనూ చూపించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పటికి హీరోయిన్ ఎంట్రన్స్ అంటే ఈ సినిమానే రిఫరెన్స్‌గా చెబుతారు. అలాగే.. లవ్ స్టోరీతో పాటు కామెడీ ట్రాక్‌ను కూడా ఎంతో అందంగా రూపొందించారు ద‌ర్శ‌కుడు. ఇక ఈ సినిమాలో మ‌రో ముఖ్య‌మైన అంశం పాట‌లు. సంగీత దర్శకుడు దేవా అందించిన బాణీలు (అన్ని సోలో సాంగ్స్) కుర్ర‌కారుని ఒక ఊపు ఊపేశాయి. ముఖ్యంగా.. ‘గ‌గ‌నానికి ఉద‌యం ఒక‌టే’ (తాజ్‌మ‌హ‌ల్ సెట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఆర్ట్‌: ఆనంద్ సాయి), ‘ఈ మ‌న‌సే..’, ‘ఏమి సోద‌రా’, ‘ఏమైందో ఏమో’.. ఈ పాట‌ల‌న్నీ సెన్సేష‌నే. ఇక నేప‌థ్య సంగీతం గురించి ఎంత మాట్లాడుకున్నా త‌క్కువే. ముఖ్యంగా క‌థానాయిక ఎంట్రీ సీన్‌తో మొద‌లుపెట్టి.. హీరోహీరోయిన్ల మ‌ధ్య సాగే ప్ర‌తి స‌న్నివేశంలోనూ బ్రాగ్రౌండ్ స్కోర్ హృద్యంగా సాగుతూ.. మ‌న‌సును మీటుతుంది.

ఇక యువ‌త‌రానికి ప్ర‌తినిధి లాంటి బాలు పాత్ర‌లో పవన్ క‌ళ్యాణ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అటు యూత్‌తో పాటు.. ఇటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు కూడా ద‌గ్గర‌య్యారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చెల్లెలు(వాసుకి) పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే భావోద్వేగ సన్నివేశంలో.. పవన్ నటన ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. సినిమా ఆద్యంతం ఒక మూగ ప్రేమికుడిగా ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ఎలాంటి అబ్బాయి అయినా ఇట్టే ప్రేమ‌లో ప‌డేలా డిజైన్ చేసుకున్న అను పాత్ర‌లో కీర్తి రెడ్డి అలా ఒదిగిపోయారు. అనుక్ష‌ణం లక్ష్యం కోసం ఆలోచించే ఈ పాత్ర‌లో కీర్తి అభిన‌యం గుర్తుండిపోతుంది. ఇక చెల్లెలు పాత్ర‌లో వాసుకి న‌ట‌న కూడా త‌క్కువేం కాదు. ప‌వ‌న్‌, వాసుకి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు.. నిజంగా అన్నాచెల్లెళ్ళ మ‌ధ్య జ‌రుగుతున్నంత స‌హ‌జంగా ఉంటాయి. న‌గేష్‌, ఆలీ.. ఇలా అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.  ఎస్.ఎస్.సి.ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

1998కిగానూ ‘ఉత్త‌మ చిత్రం’గా నంది అవార్డుని.. ‘ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న‌ ఈ సినిమాని హిందీలో ‘ముఝే కుచ్ కెహనా హై’ (తుషార్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్‌) పేరుతోనూ.. కన్నడంలో ‘ప్రీత్సు తప్పేనిల్ల’ (వి.ర‌విచంద్ర‌న్‌, ర‌చ‌న‌) పేరుతోనూ రీమేక్ చేశారు.

ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘తొలిప్రేమ’.. ప‌వ‌న్ కెరీర్‌లో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here