నాన్‌-రెగ్యుల‌ర్ అండ్‌ నాన్ ఫార్ములా అటెంప్ట్ `ఆట‌గ‌ద‌రా శివ`

క‌మ‌ర్షియ‌ల్ కాంపిటీష‌న్‌లో నిల‌బ‌డాలంటే ద‌ర్శ‌కులు ఫార్ములా సినిమాల‌నే న‌మ్ముకోవాల్సి ఉంటుంది. కొంత‌మంది ద‌ర్శ‌కులు మాత్రం తాము న‌మ్ముకున్న పంథాలోనే ప‌య‌నిస్తూ `వాల్యూ బేస్‌డ్ ఫిలిమ్స్‌` చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. స్టార్స్‌, బిజినెస్‌, క‌లెక్ష‌న్స్‌, రికార్డులు వంటి బాక్సాఫీస్ ప‌రిభాష‌, వాతావ‌ర‌ణం వాళ్ళ‌కు అస్స‌లు ప‌ట్ట‌దు.. గిట్ట‌దు. మ‌న‌సు మూలల్లో నిద్రాణంగా ఉండే మాన‌వ‌త్వాన్ని త‌ట్టి లేపే సంభాష‌ణ‌ల‌తో, స‌న్నివేశాల‌తో సాగే ఒక `హాఫ్ బీట్ ఫిలిమ్‌` చూసి చాలా కాలమైంది అని ఎదురుచూసే ప్రేక్ష‌కుల‌కు అలాంటి అనుభూతిని మ‌రోసారి అందించారు ద‌ర్శ‌కుడు చంద్ర సిద్ధార్థ. `ఆ న‌లుగురు`, `మ‌ధు మాసం`, `అంద‌రి బంధువ‌యా` వంటి సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్స్‌తో మాన‌వ సంబంధాల విలువ‌ను, ప్రాధాన్య‌త‌ను హృద్యంగా ఆవిష్క‌రించిన చంద్ర సిద్ధార్థ.. ఈ సారి `ఆట‌గ‌ద‌రా శివ‌`తో మ‌రోమారు ప్రేక్ష‌కుల గుండెత‌లుపులు త‌ట్టే ప్ర‌యత్నం చేశారు. `నో కాస్టింగ్.. నో కాస్ట్.. ` అంటే భారీ తారాగ‌ణం, భారీ బ‌డ్జెట్ అనే కాన్సెప్ట్‌కు భిన్నంగా క‌థా ప‌రంగా, మేకింగ్ ప‌రంగా కూడా ఒక వినూత్న ప్ర‌యోగంగా చేసిన ఈ సినిమా.. క‌న్న‌డంలో సూప‌ర్ హిట్ అయిన `రామా రామా రే` సినిమాకి రీమేక్‌. శుక్ర‌వారం (జూలై 20) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రివ్యూ షో గురువారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమాపై `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్` అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

తాను ఒక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి త‌లుస్తుంద‌న్న‌ది సార్వ‌జ‌నీన‌మైన స‌త్యం. ఆ స‌త్యంలోని త‌త్వాన్ని త‌న `ఆట‌గ‌ద‌రా శివ` క‌వితా సంపుటిలో మ‌రింత అర్థ‌వంతంగా ఆవిష్క‌రించారు ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి. ఒక‌వైపు శివుడ్ని, శివ‌త‌త్వాన్ని ప్ర‌శంసిస్తూనే.. మ‌రోవైపు నిందాస్తుతితో శివుడ్ని నిల‌దీసి, నిష్టూర‌మాడిన `ఆట‌గ‌ద‌రా శివ‌`లోని ఆత్మ‌ను, ఆ టైటిల్‌ను త‌న క‌థ‌కు, అందులోని పాత్ర‌ల భావోద్వేగాల‌కు చ‌క్క‌గా అన్వ‌యించుకున్నారు చంద్ర సిద్దార్థ‌.

ఇక క‌థ విషయానికి వ‌స్తే..ఇదొక నాన్‌-రెగ్యుల‌ర్ అండ్‌ నాన్ ఫార్ములా క‌థాంశంగా చెప్పుకోవ‌చ్చు. ఉరిశిక్ష ప‌డి జైలు నుంచి త‌ప్పించుకున్న ఖైదీ బాబ్జీ (ఉద‌య్‌)కి.. ఆ ఉరిశిక్ష‌ను అమ‌లు చేసే త‌లారి జంగ‌య్య (దొడ్డ‌న్న‌)కు మ‌ధ్య సాగే ఒక ఎమోష‌నల్ జ‌ర్నీయే ఈ క‌థ‌. ఎవ‌రికి తాను ఉరివేయాలో ఆ ఖైదీయే జైలు నుంచి త‌ప్పించుకుని.. త‌న జీపులో త‌న‌తోనే ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన అనుబంధం ఏ ప‌రిణామాల‌కు దారి తీసింది.. వారికి మ‌ధ్య‌లో ఎదురైన వ్య‌క్తులు, అనుభ‌వాలు ఏమిటి? ఇదీ.. సింపుల్‌గా `ఆట‌గ‌ద‌రా శివ` కాన్సెప్ట్‌. పారిపోయి వ‌చ్చిన ప్రేమ‌జంట‌, మిల‌ట‌రీ నుండి భార్య ప్ర‌స‌వం కోసం స్వ‌గ్రామానికి వ‌స్తున్న ఓ సైనికుడు, ప్ర‌స‌వ వేద‌న‌తో బాధ‌ప‌డే నిండు గ‌ర్భిణి, ఆమెకు స‌ప‌ర్య‌లు చేసే స‌హృద‌యురాలైన అత్త‌, ప్రేమ జంట‌ను త‌రుముకొచ్చే రౌడీ ముఠాలు, పారిపోయిన ఖైదీ కోసం వేటాడే పోలీసులు.. ఇలా సినిమా మొత్తం రోడ్డు మీద ప్ర‌యాణంలోనే సాగిపోతుంది. జైలులో ఖైదీగా ఉన్న‌ బాబ్జీతో ప్రారంభ‌మ‌య్యే పాత్ర‌ల ప‌రిచ‌య క్ర‌మంలో దొడ్డ‌న్న‌, ప్రేమ‌జంట (హైప‌ర్ ఆది, కొత్తమ్మాయి).. ఇలా ఒక్కొక్క‌రు ప్ర‌వేశిస్తూ నిష్క్ర‌మిస్తూ.. చివ‌ర‌కు బాబ్జీతో ముగుస్తుంది క‌థ‌. కేవ‌లం రెండు రోజుల హైవే ప్ర‌యాణంలో తార‌స‌ప‌డిన వ్య‌క్తుల అనుభ‌వాలు, అనుబంధాలు, భావోద్వేగాల చిత్రీక‌ర‌ణే ఈ `ఆట‌గ‌ద‌రా శివ‌`.

తెర‌మీద పాత్ర‌లు, పాత్ర‌ధారులు ఎన్నైనా, ఎవ‌రైనా.. ఇలాంటి విభిన్న క‌థాంశాల అస‌లు సూత్ర‌ధారిగా సినిమా మొత్తం క‌నిపించేది ద‌ర్శ‌కుడు మాత్ర‌మే. భావోద్వేగాల‌ను, పాత్ర‌ల సంఘ‌ర్ష‌ణ‌ను మ‌న‌సుకు హ‌త్తుకునేలా చిత్రీక‌రించ‌డంలో చంద్ర సిద్ధార్థ సిద్ధ‌హ‌స్తుడ‌న్న విష‌యం తెలిసిందే. సీరియ‌స్ కంటెంట్‌లో `హైప‌ర్` ఆది, చ‌మ్మ‌క్ చంద్ర.. వంటి జ‌బ‌ర్ద‌స్త్ బ్యాచ్‌తో ఎంట‌ర్‌టైన్ చేయ‌డం కొంత రిలీఫ్‌గా అనిపిస్తుంది. అయితే.. చంద్ర సిద్ధార్థ గ‌త సినిమాల‌లో ఫ‌స్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వ‌ర‌కు టేకింగ్‌లోగానీ, ఎమోష‌న్స్‌లోగానీ ఎలాంటి డ్రాపింగ్ క‌నిపించదు. కానీ.. ఇందులో ఛేజింగ్ చేసే రౌడీ ముఠాల సెలెక్ష‌న్‌లో, వాళ్ళ హావభావాల‌లో, మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో కొంత `హాట్చ్-ప్యాచ్`, అమెచ్యూరిటీ క‌నిపించాయి. ఆ చిన్న లోపం మిన‌హా `ఆట‌గ‌ద‌రా శివ‌`ను ఓ నైతిక‌, తాత్విక ఆలోచ‌నా స‌ర‌ళితో కూడిన ఫీల్ గుడ్ మూవీగా అభినందించ‌డంలో ఎలాంటి ఆక్షేప‌ణ లేదు. `చ‌ట్టానికి, న్యాయానికి అంద‌నివి, అర్థం కానివి అనుబంధాలు, అనుభ‌వాలు` అనే మెసేజ్ కార్డ్‌తో సినిమాకు గొప్ప ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు చంద్ర సిద్ధార్థ‌. రాక్‌లైన్ వెంక‌టేష్ లాంటి ఒక టాప్ ర్యాంక్ ప్రొడ్యూస‌ర్ నిర్మాణ ప‌రంగా ఇలాంటి చిన్న ప్ర‌యోగం చేయ‌డం అభినంద‌నీయం. చంద్ర సిద్ధార్థ సినిమాల విజ‌యానికి క‌లెక్ష‌న్లు, క‌మ‌ర్షియ‌ల్ వ‌ర్క‌వుట్స్ ఎప్పుడూ పారామీట‌ర్స్ కాదు. హార్థిక విజ‌యమే ఆయ‌న స‌క్సెస్‌కు కొల‌మానం కాబ‌ట్టి అందుకు ఏ మాత్రం ఢోకా లేని విల‌క్ష‌ణ‌, వైవిధ్య చిత్రంగా `ఆట‌గ‌ద‌రా శివ` అభినంద‌నలు అందుకుంటుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here