ద‌క్షిణాది మెచ్చిన సౌంద‌ర్యం.. సౌంద‌ర్య జ‌యంతి సంద‌ర్భంగా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

Remembering Veteran Actress Soundarya on her Birth Anniversary, Remembering Soundarya on her Birth Anniversary, Remembering the Blazing Talent called Soundarya on her Birth Anniversary, Veteran Actress Soundarya on her Birth Anniversary,Telugu Filmnagar,Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates
Remembering Veteran Actress Soundarya on her Birth Anniversary

‘మెరిసేటి జాబిలి నీవే.. కురిసేటి వెన్నెల నీవే’ అని పాడుకోవాలనిపించేంత సౌందర్యం ఆమె సొంతం. చూడడానికి పక్కింటి అమ్మాయిలా అనిపించే రూపం.. ఆమెని పదేళ్ల పాటు తెలుగు తెరపై తిరుగులేని తారగా నిలిపింది. స్క్రీన్ పై.. ఓ హీరోయిన్ యాక్ట్‌ చేస్తోంది అన్నట్లుగా కాకుండా.. మనకు తెలిసిన వ్యక్తినే ఎదురుగా చూస్తున్నాం అన్నట్లుగా ఆమె అభినయం ఉంటుంది. అంత సహజ నటన ప్రదర్శించిన ఆ నటీమణే సౌందర్య. 14 ఏళ్ళ‌ క్రితం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి.. ‘జ్ఞాపకాలే మైమరపు.. జ్ఞాపకాలే మేల్కొలుపు.. జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు..’ అంటూ ఓ
మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ సౌందర్యం. నేడు అభినేత్రి సౌంద‌ర్య‌ జయంతి. ఈ సందర్భంగా సౌంద‌ర్యకు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌తో.. ‘తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్‘ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం మీ కోసం..

వెండితెర సాక్షిగా..

కథానాయిక అంటే.. కథను నడిపించే నాయిక. కానీ ఈ స్థాయి నుంచి అందాల ప్రదర్శనకు ఉపయోగపడే బొమ్మ అనే రేంజ్‌కు తెలుగు సినిమా హీరోయిన్ దిగ‌జారిపోతున్న‌ సమయంలో .. నాయికగా ఎంట్రీ ఇచ్చారు సౌందర్య. యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తాను కానీ.. ఎక్స్ పోజింగ్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లు మాత్రం చేయను అంటూ ఆమె లిమిటేషన్స్ పెట్టడం.. అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈమె ఎన్నాళ్లిలా మడి కట్టుకుంటుందో చూద్దాం.. అని కొందరు అనుకున్నారు కానీ.. ఎన్నాళ్లైనా తనంతే అని వెండితెర సాక్షిగా చెప్పకనే చెప్పారు సౌందర్య.

ద‌టీజ్ సౌంద‌ర్య‌

తోటి తారలంతా అందాల ఆరబోతతోనే స్టార్ హీరోయిన్‌లుగా రాణించే ప్రయత్నం చేస్తుంటే.. కేవలం నటనతోనే నెగ్గుకురావడానికి సౌందర్యకి కొంత టైమే పట్టింది. ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సౌంద‌ర్య‌..
మొదట్లో ‘రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ వన్, మేడమ్’.. ఇలా గ్లామర్ టచ్ ఉన్న కామెడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనే మెరిశారు. అయితే.. సౌందర్య ప్రతిభకి పరీక్ష పెట్టిన చిత్రం మాత్రం ’అమ్మోరు‘. సూపర్ హిట్‌ అయిన ఆ సినిమా తరువాత సౌందర్యకు వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అనంతర కాలంలో ఎన్నెన్నో వైవిధ్య‌మైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. చిన్న హీరోలతోనో.. మీడియం హీరోలతోనో సినిమాలు చేసేటప్పుడు పెర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్ రోల్స్ దక్కించుకోవడం సులభమే.. కానీ అగ్ర హీరోల పక్కన నటించేటప్పుడు కూడా ఆ తరహా పాత్రలను ఒడిసిపట్టుకోవడం త‌న‌ తరంలో సౌందర్యకు మాత్ర‌మే చెల్లింది.

సౌంద‌ర్య‌లో మ‌రో కోణం

నటన అంటే కేవలం ఏడిపించే పాత్రలే అని సరిపెట్టుకోలేదు సౌందర్య. అందుకే.. అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నాలు కూడా చేశారు. కామెడీ టైమింగ్‌లోనూ ఆమె అదుర్స్ అనిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. కాకపోతే ఎక్కువ‌గా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం వ‌ల్ల‌.. ఆమెని ఆ కోణంలో ఎక్కువగా హైలెట్ చేయలేద‌ని చెప్పాలి. కెరీర్ మొదట్లో హాస్య చిత్రాల క‌థానాయ‌కుడు న‌ట‌కిరీటి రాజేంద్రప్రసాద్‌కు హిట్‌ పెయిర్‌గా నిలిచిన సౌందర్య.. అతనితో జోడీ కట్టిన మూడు సందర్భాల్లోనూ విజ‌యాలే సొంతం చేసుకున్నారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడమ్’ సినిమాల్లో హీరో స్థాయిలో కాకపోయినా.. తన పరిమితుల్లో మంచి కామెడీ టైమింగ్‌నే ప్రదర్శించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి పక్కన మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సౌందర్య.. అన్నింట్లోనూ చిరుకి ధీటుగా కామెడీని పండించే ప్రయత్నం చేశారు. ‘రిక్షావోడు, చూడాలని ఉంది, అన్నయ్య’.. ఈ సినిమాల్లో తన హాస్య నటనతో అలరించారు. ముఖ్యంగా ‘చూడాలని ఉంది’లో అమాయకురాలైన పద్మావతి పాత్రలో పండించిన హాస్యం
అద‌రహో. అలాగే సుమన్ హీరోగా నటించిన ‘ఓసి నా మరదలా’ సినిమాలో సౌందర్య ఫుల్ లెంగ్త్ కామెడీ
రోల్ చేశారు. ఈ సినిమాకి తన నటనే హైలెట్ అన్నంతగా మిగిలిన పాత్రలను డామినేట్‌ చేసి మరీ మెప్పించారు.

వారంద‌రికీ హిట్ పెయిర్‌నే..

జనరల్ గా ఏ హీరోయిన్ అయినా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే హిట్ జోడీగా రాణిస్తుంది. కానీ సౌందర్య.. ఒకరిద్దరి పక్కన మినహా.. దాదాపు ప్రముఖ హీరోలందరి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. సూప‌ర్ స్టార్‌ కృష్ణ నుంచి శ్రీకాంత్ వరకు అప్పటి చాలా మంది ప్రముఖ హీరోలతో ఆమె కలిసి నటించిన పలు చిత్రాలు హిట్ లిస్ట్‌లో చేరాయి. వారందరి హిట్ పెయిర్‌గా సౌంద‌ర్య‌ని నిలిపాయి.
*    సూపర్ స్టార్ కృష్ణకి ఓ టైంలో సౌందర్య హిట్ పెయిర్‌గా నిలిచారు. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘నెంబర్ వన్’, ‘అమ్మ దొంగా’ సినిమాలు సౌందర్యని సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా నిలపడంలో దోహ‌ద‌ప‌డ్డాయి. ఆ త‌రువాత‌.. ‘జగదేకవీరుడు’, ‘పుట్టింటి గౌరవం’, ‘మానవుడు దానవుడు’ వంటి సినిమాల్లోనూ వీరిద్దరు జోడీకట్టారు.
*   చిరంజీవితో మొదటి సారిగా నటించిన ‘రిక్షావోడు’ ఫ్లాప్ అయినా.. ఆ తరువాత నటించిన ’చూడాలని ఉంది‘, ’అన్నయ్య‘ సినిమాలు వీరిని హిట్ పెయిర్‌గా నిలిపాయి. జనరల్‌గా చిరంజీవి లాంటి స్టార్ హీరోల పక్కన ఏ హీరోయిన్ కైనా గ్లామర్ పాత్రలే ఎక్కువగా దక్కుతాయి. కానీ సౌందర్య తన మార్క్ మిస్ కాకుండా అంతటి స్టార్ పక్కనా పెర్ ఫార్మెన్స్ పాత్రలు చేయ‌డం గ‌మ‌నార్హం.
*   నాగార్జునతో `హలో బ్రదర్` కోసం మొదటిసారిగా జంట‌గా న‌టించిన సౌందర్య.. తరువాతి కాలంలో `రాముడొచ్చాడు, నిన్నే ప్రేమిస్తా, ఆజాద్, ఎదురులేని మనిషి, అధిపతి` చిత్రాల్లోనూ నటించారు. `ఆజాద్` సినిమాలో అయితే తన సొంత గొంతును వినిపించారు.
*  ఫ్లాప్ సినిమాతో పెయిర్‌గా తొలి అడుగులు వేసినా.. తరువాత కాలంలో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది వెంకటేష్, సౌందర్యల జంట. `సూపర్ పోలీస్` సినిమాలో మొదటి సారిగా వెంకటేష్‌తో నటించిన సౌందర్య.. 1996లో వచ్చిన ’ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు‘, ’పవిత్రబంధం‘ చిత్రాలతో డబుల్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఆ రెండు సినిమాల్లోనూ నటన పరంగా వైవిధ్యం చూపించారు. అంతేగాకుండా.. ’పవిత్రబంధం‘ సినిమాతో `ఉత్తమ నటి`గా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన ’పెళ్లి చేసుకుందాం‘ సినిమాతో వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టింది. ఇందులో రేప్‌కు గురైన యువతి పాత్రలో సౌందర్య నటన మహిళా ప్రేక్షకులనే కాదు మగవారిని కూడా కంటతడి పెట్టించేలా చేసింది. ఇక `రాజా` చిత్రంలోనూ ఈ జంట చూపరులకు కనుల పంటగా నిలిచింది. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకి ఆక్సిజన్‌లా నిలిచింది. ఆ తరువాత వచ్చిన `జయం మనదేరా, దేవీ పుత్రుడు`ల్లోనూ ఈ కాంబినేషన్ ఆకట్టుకుంది.
*  మోహన్ బాబు కథానాయకుడుగా నటించిన ’పెదరాయుడు‘ సినిమాలో ఓ నాయికగా నటించిన సౌందర్య.. ఆ తరువాత `శ్రీ రాములయ్య, రాయుడు, పోస్ట్ మేన్, కొండవీటి సింహాసనం` సినిమాల్లోనూ అతనికి జోడీగా కనిపించి అలరించారు.
*  రాజశేఖర్ పక్కన కూడా సౌందర్య మంచి పెయిర్‌గా నిలిచారు. వీరి జంట అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ’మా ఆయన బంగారం‘. ఆ సినిమా అనే కాకుండా ’వేటగాడు‘, ’రాజ సింహం‘, ’సూర్యుడు‘, ’రవన్న‘ వంటి సినిమాల్లోనూ వీరి కాంబినేషన్ అలరించింది.
* అందమైన కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న సుమన్ కాంబినేష‌న్‌లోనూ సౌందర్య రాణించారు. `బాలరాజు బంగారు పెళ్లాం, దొంగల్లుడు, ఓసి నా మరదలా` వంటి హిట్ సినిమాల్లో ఈ జంట ఆకట్టుకుంది.
* ’అల్లరి ప్రేమికుడు‘ అంటూ జగపతిబాబుతో జట్టుకట్టిన సౌందర్య.. అతని పక్కన తరువాతి కాలంలో ’భలే బుల్లోడు, చిలకపచ్చ కాపురం, ప్రియరాగాలు, దొంగాట, పెళ్లి పీటలు, సర్ధుకు పోదాం రండి, మూడు ముక్కలాట‘ సినిమాలు చేసి అల‌రించారు.
* శ్రీకాంత్ పక్కన కూడా సౌందర్య హిట్ జోడీ అనిపించుకున్నారు. `ప్రేమ ప్రయాణం, తారక
రాముడు, అనగనగా ఓ అమ్మాయి, నిన్నే ప్రేమిస్తా, కలిసి నడుద్దాం, నా మనసిస్తా..రా`.. సినిమాల్లో వీరి జంట అలరించింది.

నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌ల్లోనూ..
సాఫ్ట్ క్యారెక్టర్‌ల‌కు పెట్టింది పేరైన సౌందర్య.. నటనకు మరింత స్కోప్‌ ఉండే నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించారు. ఆ క్యారెక్టర్‌ల‌లోనూ తన మార్క్ చూపేందుకు ప్రయత్నించారు. సెన్సేషనల్ హిట్ అయిన ’పెదరాయుడు‘ సినిమాలో సౌందర్య నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో మెప్పించారు హెడ్ వెయిట్ ఉన్న గొప్పింటి అమ్మాయిగా.. పెదరాయుడుని నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడే సీన్‌లో ఆమె న‌ట‌న అందర్నీ ఆకట్టుకుంది. అలాగే ’నా మనసిస్తా..రా‘ లో మరో హీరోయిన్ రిచా ని బెదిరిస్తూ మాట్లాడే సీన్‌లోనూ ఆమె విల‌నిజం అలరిస్తుంది. అలాగే ’చంద్రముఖి‘ కన్నడ వెర్షన్ ’ఆప్తమిత్ర‘లోనూ ఆమె పాత్రలోకి నాగవల్లి ప్రవేశించినప్పుడు వచ్చే సీన్‌లో నటన గుర్తుండిపోతుంది.

ఇత‌ర భాష‌ల్లోనూ..
సౌందర్య.. తన నటనని తెలుగు సినిమాకే పరిమితం చేయలేదు. తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ప్రతిభను చాటుకున్నారు. తెలుగుతో పోలిస్తే.. మిగతా భాషల్లో చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా.. ఆయా చోట్ల త‌న‌దైన ముద్ర వేశారు. హిందీలో ఒకే ఒక సినిమా చేసినా.. అది బాలీవుడ్ మెగాస్టార్‌తోనే చేశారు సౌందర్య. తెలుగులో హిట్‌ అయిన `సూర్యవంశం` సినిమాని హిందీలో రీమేక్ చేస్తే.. అమితాబ్ బచ్చన్ పక్కన నాయికగా నటించారు సౌందర్య. మలయాళంలో అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్‌ ప‌క్కన ’కిలిచుండన్ మంపళన్‘ సినిమా చేశారు. ఇక కన్నడంలో సూపర్ స్టార్ అయిన విష్ణువర్థన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేశారు సౌందర్య. అదే ’ఆప్తమిత్ర‘. ఇక తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి నటించారు సౌందర్య. రజనీకాంత్‌తో నటించిన రెండు తమిళ సినిమాలు తెలుగులో ’అరుణాచలం, న‌ర‌సింహా‘గా డబ్ అయితే.. కమల్ హాసన్‌తో నటించిన సినిమా ’నవ్వండి లవ్వండి‘ గా అనువాదం అయింది. అలాగే మరో స్టార్ హీరో విజయ్ కాంత్‌తోనూ ’చొక్కా తంగం‘ సినిమా చేశారు సౌందర్య.

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో..
ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల సౌందర్య.. కథ మొత్తం తన చుట్టూ తిరిగే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లోనూ నటించారు. ’అమ్మోరు‘, ’అరుంధతి‘, ’9 నెలలు‘, ’అంత: పురం‘.. ఇలా కొన్ని మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఆమె నటించిన వందవ చిత్రం ’శ్వేతనాగు‘ కూడా హీరోయిన్
ఓరియెంటెడ్ సినిమానే.

ప్ర‌త్యేక గీతాల్లోనూ..
హీరోయిన్‌గా బిజీ ఉన్న టైంలో.. ప్రత్యేక గీతాల్లోనూ మెరిశారు సౌందర్య. అయితే.. స్పెషల్ సాంగ్ అంటే అందాల ఆరబోతతో కాదు.. హుందాగానూ కనిపించవచ్చని ఆమె నిరూపించారు. `మాయాబజార్` సినిమాలో ఏఎన్నార్ పక్కన కాసేపు తళుక్కుమన్న సౌందర్య.. `శుభలగ్నం`లో ఆలీ పక్కన ఆడిపాడారు.

నిర్మాత‌గానూ..
సౌందర్య కేవలం హీరోయిన్ గానే కాదు.. నిర్మాతగానూ ప్రశంసలు పొందారు. ఆమె కన్నడలో నిర్మించి నటించిన ’ద్వీప‘ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నిర్మాతగానూ త‌న‌దైన ముద్ర వేసిన‌ సౌందర్యకి ద‌ర్శ‌క‌త్వం చేయాల‌న్న‌ ఆలోచన ఉండేది. అయితే..   అనూహ్య ఘ‌ట‌న వ‌ల్ల అది మాత్రం తీరని కలగా మారింది.

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య.. 14 ఏళ్ళ‌ క్రితం తిరిగి రాని లోకాలకు వెళ్లినా.. ఆమె పోషించిన పాత్రలు మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here