ఫోన్‌తో బెస్ట్ ఇన్సిడెంట్‌, స‌క్సెస్ మంత్ర గురించి చెప్పిన‌ ఎన్టీఆర్‌

NTR about Best Incident With Phone and Success Mantra, Jr NTR Press Meet about Celekt Mobiles, NTR Jr at Celekt Mobile Store Launch, Jr NTR Speech at Celekt Mobiles Brand Launch, Tarak About His Phone Usage, Telugu FilmNagar, Tollywood Celebs Latest News, Young Tiger NTR Latest Interview, Tollywood Latest Updates, Celekt Mobile Brand Launch Event
NTR about Best Incident With Phone and Success Mantra

యంగ్ టైగర్ ఎన్టీఆర్ `సెలెక్ట్` మొబైల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఒప్పందం కుదిరిన‌ విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిచయం చేస్తూ.. శుక్ర‌వారం నిర్వహించిన పాత్రికేయుల స‌మావేశంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సెలెక్ట్ మొబైల్స్ యాజమాన్యం విధేయత, ఎదగాలనుకునే తత్వం, బ్రాండ్ ఎంపిక చేసే పద్ధతిలో నూతనత్వం ఈ మూడు తనను ఈ ప్రోడక్ట్‌కు అంబాసిడర్‌గా ఉండేందుకు ప్రేరేపించాయని తెలిపారు. అంతేకాకుండా.. ఏదో మొబైల్ షాప్‌కి వెళ్లి మొబైల్ కొనుకున్నాం అన్నట్టు గాకుండా.. వినియోగదారుడికి ఆ ప్రోడక్ట్‌పై అవగాహన కల్పించే పద్ధతి కూడా త‌న‌కు బాగా నచ్చిందని చెప్పారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా ప్రతినిథులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం తెలిపారు. తాను ఇంట‌ర్‌లో ఉండగా తొలి ఫోన్‌ను వాడానని.. జ‌గ‌దీష్ మార్కెట్‌లో అది కూడా సెకండ్ హ్యాండ్ అల్క‌టెల్‌ అని చెప్పారు. అలాగే.. ఎన్నో ఫోన్స్‌ను పోగొట్టుకున్నానని, మరెన్నో పాడైపోయాయని కూడా చెబుతూనే.. డిజిటల్ డీటోక్ష‌న్ తీసుకుందామ‌ని ఉంది అని అన్నారు. అంటే.. కాల్స్ చేయడం తప్ప ఫోన్‌లో మరే ఇతర యాప్స్‌ను వాడకుండా మూడు నెలల పాటు ఉండాలని నిర్ణయించుకున్నానని.. అది ఎప్పటికీ అమలు అవుతుందో చూడాలని అన్నారు. అలాగే తాను గేమ్ ప్రీక్‌న‌ని.. అందుకే మొబైల్‌లో గేమ్స్ యాప్ ఉండాల‌నుకుంటాను అని తెలిపారు.

`ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా?` అనే ప్రశ్నకు స‌మాధానంగా..‘ప్రపంచం మారిపోయింది. ఏమీ లేకున్నా స‌రే.. సరదాగా ఫోన్ వైపు చూస్తున్నాం..నేను కూడా అందుకు మిన‌హాయింపు కాదు. అయితే.. నేను అసలు ఫొటోలే దిగను. నాకు పోజ్ ఇవ్వడం అంటే ఎందుకో నచ్చదు. అదంటే నాకు వణుకు వస్తుంది. నా భార్య ప్ర‌ణ‌తి కూడా నా ఫొటోలు తీస్తానని అంటుంది. కానీ, నాకేమో పోజులివ్వడం చేత‌కాదు..’ అని చెప్పుకొచ్చారు.

‘మొబైల్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు?’ అని ప్ర‌శ్న‌కు బదులుగా.. తార‌క్‌ ఆసక్తికర‌మైన‌ సమాధానమిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా అలా లేనని, ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యమని, ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఎవరితోనైనా మాట్లాడటానికైనా ఫోన్ ఉండాల్సిందేనని, చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫోన్ లేకుండా ఉన్నానని తెలిపారు.

అలాగే.. ఫోన్‌తో మరచిపోలేని బెస్ట్ ఇన్సిడెంట్‌ గురించి మాట్లాడుతూ, “రభస సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్‌లో ఉండగా నా భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నా.. అప్పటికే ఆమె నెలలు నిండిన గర్భవతి. ఏ నిమిషంలోనైనా డెలివరీ అయ్యే అవకాశం ఉండడం.. దాంతో నేను వచ్చేవరకు డెలివరీ అవకూడదని చెప్పాను. అయితే.. నేను షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు రాగానే.. మా వైఫ్ హాస్పిటల్‌కి వెళ్తున్నానని చెప్పడం.. నేను కంగారు పడి ఏమైందని అడిగితే.. చెకప్ కోసం వెళ్తున్నానని చెప్పింది. నేను ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుతున్న సమయంలో.. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఉన్న ఫళంగా రమ్మని డాక్టర్ చెప్పగానే కొంచెం కంగారు స్టార్ట్ అయింది. అయితే.. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళగానే మా పెద్ద అబ్బాయి (అభయ్ రామ్) పుట్టడం జరిగింది. అదే గనక ఏ దుబాయ్‌లో స్ట్ర‌క్ అయిపోయి ఫ్లైట్ లేట్ అయి ఉంటే.. తన కాన్పుకి నేను దగ్గరే ఉండాలనే నా కోరిక నెరవేరేది కాదు. ఫోన్ ఉండడం వలన ప్రతీ నిమిషం ఏమి జరుగుతుందో తెలుస్తుంద”ని తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను అందరితో షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్.

అలాగే.. బ్రాండ్ గురించి మాట్లాడుతూ.. బ‌ట్ట‌లు, చెప్పులు ఏదైనా స‌రే.. మనకి కంఫర్ట్‌ను ఇచ్చేదే బ్రాండ్.. అని నమ్ముతానని వెల్లడించారు. `యంగ్ టైగర్ లాగే ఇంత ఎనర్జీగా ఉండడానికి రహస్యం ఏంట`ని అడగ్గా.. “మీరు ఈ మాట అంటే చాలా ఆనందంగా ఉంది. ఒక‌రికి వ‌చ్చే సిట్యుయేష‌న్ మ‌రొక‌రికి రాక‌పోవ‌చ్చు. ఏదేమైనా.. పాజిటివ్‌నెస్ ఒక్కటే సక్సెస్ మంత్రం అని చెప్పారు. మంచిపై చెడు గెలవడానికి ఒక్క క్షణం చాలు. అదే మంచి చెడుపై గెలవాలంటే.. చాలా కాలం పడుతుంది. దానికి సహనం, ఓర్పు కావాలి. నా జీవితంలో జరిగిన సంఘటనలనే తీసుకుంటే.. నా ఈ పాజిటివ్‌నెస్‌కి మా అమ్మ ఒక కారణం కాగా.. ఇప్పుడు నా భార్య, నా పిల్లలు, నా ఫ్రెండ్స్‌తో పాటు మీడియా శ్రేయోభిలాషులు కూడా ఉన్నారని తెలిపారు.

ఇక తన కుమారుడు అభయ్‌కి మొబైల్‌ను కొనిచ్చే విషయం గురించి అడిగితే.. ఇప్పటికైతే ఆలోచన లేదు. మొబైల్‌ను వాడే వయసు, ఆ అవసరం జీవితంలో తప్పకుండా వస్తుంది. దాన్ని ఇప్పటినుంచి ఎందుకు అలవాటు చేయాలి అని సమాధానం ఇచ్చారు.

సెలెక్ట్ కంపెనీ డైరెక్టర్ మురళీ మాట్లాడుతూ.. తార‌క్‌తో అసోసియేష‌న్‌తో మ‌రింత ముందుకు వెళుతామ‌ని అనుకుంటున్నాము. మున్ముందు మ‌రిన్ని శాఖ‌ల‌తో విస్త‌రించేందుకు ప్రణాళిక చేసుకున్నామ‌ని తెలిపారు. అలాగే సెలెక్ట్ మొబైల్స్‌లో తొలి మొబైల్‌ను ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు అభయ్ కోసం కొనాలని స‌ర‌దాగా విన్నవించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here