మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు మెప్పించారు.. విజేత రివ్యూ

Vijetha Review,Telugu Filmnagar,Telugu Movie News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Latest Telugu Movie Reviews,Vijetha Movie Review,Vijetha Telugu Movie Review,Vijetha Movie Review & Rating,Vijetha Movie Plus Points,Vijetha Movie Public Talk,Vijetha Telugu Movie Public Response,Vijetha Movie Story,Vijetha Telugu Movie Live Updates,Vijetha Telugu Movie Review And Rating
Vijetha Review

చిత్రం: విజేత

నటీనటులు: కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, నాజర్, రాజీవ్ కనకాల, జయప్రకాష్, పృథ్వీరాజ్‌, ‘సత్యం’ రాజేష్, శ్రీమన్నారాయణ, ప్రగతి, ఆదర్శ్ బాలకృష్ణ, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, హ‌ర్షిత‌, స్వ‌ప్నిక‌ తదితరులు

ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్

కళ: ఎస్.రామకృష్ణ, మోనిక

కూర్పు: కార్తీక శ్రీనివాస్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

నిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రం

నిర్మాతలు: రజనీ కొర్రపాటి

ర‌చ‌న – దర్శకత్వం: రాకేశ్ శశి

విడుదల తేది: 12 జూలై 2018

కొడుకు కార‌ణంగా త‌న చిర‌కాల స్వ‌ప్నాన్ని నెర‌వెర్చుకోలేక‌పోయిన ఓ తండ్రికి.. అస‌లు విష‌యం తెలిశాక ఆ క‌ల‌ను నెర‌వెర్చే ఓ కొడుకుకి మ‌ధ్య సాగే భావోద్వేగాల స‌మాహార‌మే `విజేత` చిత్రం. కొడుకుని విజేత‌గా మ‌లిచిన ప‌లు చిత్రాల‌కు భిన్నంగా.. తండ్రిని విజేత‌గా నిలిపిన ఓ కొడుకు క‌థ‌గా తెర‌కెక్కిన వైనం ఈ సినిమాలో చూడ‌వ‌చ్చు. మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌ను క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ `విజేత‌` సినిమా.. గురువారం తెర‌పైకి వ‌చ్చింది.  రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్` అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం

“మనసుకు నచ్చిన పని చేసుకుంటూ పోవడం అందరికి సాధ్యం కాదు.. లైఫ్‌లో కొంచెం కాంప్రమైజ్ అయి బతకాలి” అనుకునే ఓ మిడిల్ క్లాస్ తండ్రి కె.శ్రీనివాసరావు (మురళీ శర్మ). బెస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలన్నది త‌న‌ కల. అందులో భాగంగా.. ఓ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ కూడా అందుకుంటారు. అలాంటి శ్రీ‌నివాస‌రావుకు.. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా అవకాశం వస్తుంది. అయితే.. కుటుంబ పరిస్థితుల రీత్యా తన పాషన్‌ను, అవకాశాన్ని వ‌దులుకుని.. వేరే ప‌ని చేసుకుంటూ జీవితంలో రాజీ ప‌డాల్సి వ‌స్తుంది. తనలాగ తన కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్) కాకూడదని.. చిన్నప్పటి నుంచి రామ్ కిష్టమైన దేన్నీ కాదనకుండా.. తనకున్నంతలో అందిస్తూ ఉంటారు. అయితే.. రామ్ మాత్రం అందరిలా కాకుండా.. ఏదైనా డిఫరెంట్‌గా ఉండే పనిని తన ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో.. ఎదుటివారి చిన్న చిన్న కోరికలు తీర్చి స‌ర్‌ప్రైజెస్‌తో ఆనందాన్ని నింపే.. సర్‌ప్రైజ్ ప్లానర్‌గా తన ప్రొఫెషన్‌ను ఎంచుకుంటాడు. అందులో భాగంగా.. “లోకల్ బాయ్స్  – ది సర్‌ప్రైజ్‌ ప్లానర్స్” అనే పేరుతో ఓ కంపెనీ స్టార్ట్ చేస్తారు రామ్, అతని స్నేహితులు. “ఎదుటివారిలో ఆనందం చూడడమే” వీరి ముఖ్య ఉద్దేశ్యం. మరి తను ఎన్నుకున్న బాటలో.. రామ్ ఎంతవరకు విజయం సాధించాడు? అందరి పాషన్‌ను, కోరికలను, స‌మ‌స్య‌ల‌ను తీర్చి స‌ర్‌ప్రైజ్ ఇచ్చే రామ్.. తన తండ్రి పాషన్‌ను కూడా తీర్చి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడా? ఆ ఆనందాన్ని తన తండ్రిలో చూసాడా? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌

తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన‌ ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి బాగా తెర‌కెక్కించారు. ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ళ మ‌ధ్య సాగే స‌న్నివేశాల‌ను చాలా స‌హ‌జంగా చిత్రీక‌రించారు. పరిస్థితులకు తల వంచి పాషన్‌ను చంపుకుని కుటుంబం కోసం బతికే తండ్రి.. ఎదుటివారిలో ఆనందం చూడడం కోసం వారి చిన్న చిన్న కోరికలను సర్‌ప్రైజ్ పేరుతో తీర్చే కొడుకు.. వీరి మ‌ధ్య సాగే స‌న్నివేశాల‌ను ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా బాగా డీల్ చేశారు. ఫ‌న్‌, ఎమోష‌న్స్‌ను బ్యాలెన్స్ అయ్యేలా క‌థ‌నాన్ని న‌డిపించారు. ఫొటోగ్ర‌ఫీ గొప్ప‌త‌నాన్ని వ‌ర్ణించే స‌న్నివేశాల‌ను బాగా తీశారు. ముఖ్యంగా.. ఫోటోగ్రాఫర్స్ గురించి నాజర్ చెప్పే సన్నివేశం చాలా బాగుంది. తన కన్నా గొప్ప ఫోటోగ్రాఫర్లు చాలా మంది ఈ సొసైటీలో ఉన్నారు అని చెప్పే సీన్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అలాగే.. అక్కడ సందర్భోచితమైన డైలాగ్స్‌ను వాడుకున్నారు డైరెక్టర్. `నూటికి తొంబై శాతం మంది కుటుంబం కోసమో, చుట్టూ ఉన్న పరిస్థితుల కోసమో వారిలో ఉన్న ఉన్న పాషన్‌ను చంపుకుని వేరే ఉద్యోగంలో బతేకేస్తూ ఉన్నారు. కాని మిగిలిన పది శాతం మంది మాత్రమే ఈ అవరోధాలను అధిగమించి వారు అనుకున్నది సాధిస్తారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు` అని చెప్పే సన్నివేశంలో అందరికి అనుకున్నవన్నీ జరగవు. జాబు, పిల్లలు, ఫ్యామిలీ ఇంతకన్నా ఏం చేస్తాం. అయినా దేవుడిచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండాలి` అని ఓ సగటు మనిషి ఆలోచనను తెరపై చక్కగా చెప్పారు దర్శకుడు. ఇక ప్రగతికి  బుల్లెట్‌ డ్రైవ్ చేయాలని ఉండే ఆశను తీర్చే సన్నివేశాన్ని కూడా చాలా ఫన్నీగా, నేచురల్‌గా చూపిస్తూనే.. హీరో పాత్రకు టర్నింగ్ పాయింట్‌ను కూడా అంతర్లీనంగా తెరకెక్కించిన విధానం బాగుంది. ఓ వైపు ఫన్‌ను చూపిస్తూనే.. మరోవైపు ఎమోషనల్ సీన్స్‌ను కూడా బాగా డీల్ చేసారు రాకేశ్. ఫ‌న్ సీన్స్ అన్నీ నేచుర‌ల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా.. రాజేష్, పృథ్వీ మధ్య వచ్చే రింగ్ టోన్ తాలుకూ కామెడీ సీన్స్ బాగా పేలాయి. ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను ఉద్వేగ‌భ‌రితంగా తీర్చిదిద్దారు. ఓవ‌రాల్‌గా.. ద‌ర్శ‌కుడిగా కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ‌డంలో స‌క్సెస్ అయ్యారు రాకేశ్.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. `మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు` అనే ట్యాగ్‌లైన్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్‌కి ఇది తొలిచిత్రమే అయినా చ‌క్క‌గా న‌టించారు. ప్ర‌థ‌మార్థంలో బాధ్యతలు లేని యువ‌కుడిగా.. ద్వితీయార్ధంలో బాధ్యత తెలుసుకుని ప్రయోజకుడిగా మారే కుర్రాడిగా.. ఇలా రెండు పార్శ్వాలున్న పాత్రలో బాగా నటించారు. కొన్ని స‌న్నివేశాల్లో ఇబ్బంది ప‌డ్డ‌ట్టు అనిపించినా.. ఓవ‌రాల్‌గా  మెప్పించారు. ఇక‌.. హీరోని సపోర్ట్ చేసే ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్రలో మాళవికా నాయర్ కూడా బాగా నటించారు. ఈ సినిమాకి వెన్నెముక‌.. హీరో ఫాద‌ర్ పాత్ర‌. కేరింగ్‌ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా మురళీ శర్మ చాలా బాగా నటించారు. ఫ్యామిలీ కోసం తన పాషన్‌ను, కెరీర్‌ను వదులుకునే పాత్రలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న క‌ట్టిప‌డేస్తుంది. క‌థానాయిక త‌ల్లిగా ప్రగతి కూడా బాగా న‌టించారు. ముఖ్యంగా బుల్లెట్ నడిపే సన్నివేశంలో చాలా నేచురల్‌గా నటించారు. ఇక నాజర్, భరణి, ‘సత్యం’ రాజేష్, రాజీవ్ కనకాల వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతంలో పాట‌ల‌న్నీ సంద‌ర్భోచితంగా వ‌చ్చేవే. అయితే.. వాటిని తెర‌కెక్కించిన విధానం బాగుంది. “టామ్ ఎన్ జెర్రీ” అనే పాటలో “మనసనే నా మల్టీప్లెక్స్‌లో ప్రతీ బొమ్మ నీవే..” అంటూ వచ్చే లైన్స్ బాగున్నాయి. నేప‌థ్య సంగీతం ప‌లు స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేసింది. సెంథిల్ కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం ఈ సినిమాకి మేజ‌ర్ ఎస్సెట్‌. ముఖ్యంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ నేప‌థ్యంలో వ‌చ్చే సాంగ్‌లో ఫొటోగ్ర‌ఫీ త‌న స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. రామ‌కృష్ణ – మౌనిక ఆర్ట్ వ‌ర్క్ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ఇక డైలాగ్స్ విషయానికొస్తే.. “ఈ కుర్రాళ్ళు ఇంతే.. ఖాళీగా ఉన్నట్టు ఉంటారు, కాలితే ఎక్కడికో వెళతారు” అనే డైలాగ్ యూత్‌లో ఉండే ఫైర్‌ను చెబుతుంటే.. “ఫోటో చూస్తే.. మనతో మాట్లాడినట్టు ఉండాలి” అనే మాట ఓ ఫోటోగ్రాఫర్‌కు ఫోటోపై ఉండే మమకారాన్ని తెలియజేస్తుంది. “మనమిచ్చే సర్‌ప్రైజ్ వల్ల ఎదుటివాడిలో స్మైల్ తెచ్చినా సక్సెస్” డైలాగ్ అయితే మనిషిలో మానవత్వాన్ని గుర్తుచేస్తుంది, “ఇన్నేళ్ళు నాన్నతో ఉన్నాను గాని నాన్నకు దగ్గరగా లేను” లాంటి డైలాగ్ ఓ తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని స్పృశిస్తుంది. అలాగే ‘స్టేట‌స్ అంటే డ‌బ్బు కాదు వ్య‌క్తిత్వం’, ‘గెలవ‌డానికి వ‌య‌సు ముఖ్యం కాదు.. మ‌న‌సు ముఖ్యం’ అనే సంభాష‌ణ‌లు హృద్యంగా ఉన్నాయి.   నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

కాన్సెప్ట్‌

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌

బ్యాగ్రౌండ్ స్కోర్

కెమెరా పనితనం

ఫ‌న్ & ఎమోష‌న్స్‌

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

స్లో నేరేషన్

బాట‌మ్ లైన్‌: మ‌న‌సును క‌దిలించే ఓ ‘విజేత’ క‌థ‌

విజేత రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
3

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here