బోల్డ్ & డార్క్ షేడ్స్ ఉన్న‌ ల‌వ్ స్టోరీ.. RX 100 రివ్యూ

Latest Telugu Film News, Latest Telugu Movie Reviews, RX 100 Movie Plus Points, RX 100 Movie Public Talk, RX 100 Movie Review, RX 100 Movie Review & Rating, RX 100 Movie Story, RX 100 Review, RX 100 Telugu Movie Live Updates, RX 100 Telugu Movie Public Response, RX 100 Telugu Movie Review, RX 100 Telugu Movie Review And Rating, Telugu Filmnagar, Telugu movie News 2018, Tollywood Cinema Updates
RX 100 రివ్యూ

చిత్రం: RX100

నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేష్, ‘సింధూర పువ్వు’ రాంకీ తదితరులు

ఛాయాగ్రహణం: రామ్

కళ: రఘు కులకర్ణి

కూర్పు: ప్రవీణ్.కె.ఎల్‌

నేపథ్య సంగీతం: స్మరన్

సంగీతం: చైతన్ భరద్వాజ్

నిర్మాణ సంస్థ: కార్తికేయ క్రియేటివ్ వర్క్స్

నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి

విడుదల తేది: 12 జూలై 2018

నిడివి: 153 నిమిషాలు

తెలుగులో ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌చ్చాయి. అయితే.. డార్క్ షేడ్స్ ఉన్న ల‌వ్ స్టోరీస్ వేళ్ళ మీద లెక్క‌పెట్టుకునే స్థాయిలోనే వ‌చ్చాయ‌నే చెప్పాలి. అలాంటి చిత్రాల‌లో ‘RX 100′ ఒక‌టి. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మయ్యారు. గురువారం తెర‌పైకి వ‌చ్చిన ఈ సినిమాపై ‘తెలుగు ఫిల్మ్‌న‌గ‌ర్‌. కామ్’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

కథాంశం

శివ (కార్తికేయ) చిన్నపుడే త‌న త‌ల్లిదండ్రులు చనిపోతారు. అత‌న్ని డాడీ (రాంకీ) పెంచి పెద్ద చేస్తాడు. పెద్ద‌య్యాక.. సినిమా థియేట‌ర్ న‌డుపుతుంటాడు శివ‌. అదే ఊర్లో.. విశ్వనాథం (రావు రమేష్)కి మంచి ప‌లుకుబ‌డి ఉంటుంది. అత‌నితో సన్నిహితంగా ఉండే డాడీ.. ఎన్నికల్లో వెంప కాశి (ప్రత్యర్థి)పై విశ్వనాథం గెలిస్తే .. అత‌ని విజ‌యాన్ని త‌న విజ‌యంగా భావించి త‌న మనుషుల‌తో సంబ‌రం చేసుకుంటున్నా. . అది విశ్వనాథంకి నచ్చదు. ఇదిలా ఉంటే.. ఒకసారి విశ్వనాథంపై దాడి జరుగుతుంది. ఆ దాడి నుంచి విశ్వనాథంను శివ, డాడీ కాపాడుతారు. అయితే కొన్ని ఘ‌ట‌న‌ల త‌రువాత‌.. ఇసుక క్వారీ విషయంలో విశ్వనాథం.. కాశికి సాయపడుతున్నాడని తెలిసి.. డాడీ ఈ విషయంలో విశ్వనాథంతో గొడవ పడతాడు. అదే సమయంలో.. విశ్వ‌నాథం కూతురు ఇందు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) శివకి ప్రపోజ్ చేస్తుంది. ఒకవైపు పెద్ద‌ల‌ గొడవలు.. మరోవైపు ప్రేమ.. ఇంత‌కీ శివ ప్రేమ వ్య‌వ‌హారం ఏమైంది? ఇందు నిజంగానే శివను ప్రేమించిందా? నాన్నకి ప్రేమ విషయం చెబుతానన్న ఇందు ఏమైంది? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌
ప్రేమ ముసుగులో ఓ యువ‌కుడ్ని శారీర‌కంగా వాడుకుని మోసం చేసిన ఓ అమ్మాయి.. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియ‌క త‌న తుది శ్వాస వ‌ర‌కు నిజాయితీగా ప్రేమించిన ఓ అబ్బాయి.. ఇలా ఓ రెండు విభిన్న మ‌న‌స్తత్వాల‌తో అల్లుకున్న ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. నిజంగా ప్రేమించిన వాడి మాన‌సిక ప‌రిస్థితి, ఎడ‌బాటులోని వేద‌న‌ల‌ను ఎంతో స‌హ‌జంగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల క‌థ‌ల‌ను తెర‌పై ఎన్నో చూశాం.. కానీ అబ్బాయిల‌ను ప్రాణం కంటే మిన్న‌గా ప్రేమిస్తున్న‌ట్లుగా న‌మ్మించి వాడుకునే అమ్మాయిల క‌థ‌ల‌ను తెలుగు తెర‌పై త‌క్కువ‌గా చూసి ఉంటాం. అలాంటి అరుదైన క‌థ‌ల్లో ఇదొక‌టి. ఇందులో.. త‌ప్పు చేయాల‌నుకునే ఓ ఆడ‌ది ప్ర‌తి అవ‌కాశాన్ని త‌న‌కు అనుగుణంగా ఎలా మలుచుకోగ‌లుగుతుందో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు ద‌ర్శ‌కుడు. అయితే.. దీన్ని ఇంత రా గా, బోల్డ్‌గా తెర‌కెక్కించిన వైనం.. మెజార్టీ ఆఫ్ ఆడియ‌న్స్‌కు మింగుడు ప‌డ‌క‌పోవ‌చ్చు. ఫ‌స్టాఫ్‌లో ముద్దు స‌న్నివేశాల‌ను ఎంత ఘాటుగా చూపించారో.. సెకండాఫ్‌లో సహ‌జ‌త్వం పేరుతో గొడ‌వ‌ల‌ను అంతే హింసాత్మ‌కంగా చూపించారు. అయితే.. రియ‌లిస్టిక్ సినిమాల‌ను.. ముఖ్యంగా ఈ త‌ర‌హాలో రూపొందే త‌మిళ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథను గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతాల్లో.. ప‌ల్లె అందాల‌ను ఒడిసిప‌ట్టుకుంటూ తెర‌కెక్కించిన విధానానికి.. విన‌సొంపైన పాట‌లు, సాహిత్యం తోడ‌వ‌డం క‌లిసొచ్చిన‌ట్ల‌య్యింది. హీరోయిన్ నిజ స్వ‌రూపం తెలిశాక.. ఆమెతో నిజ‌మైన ప్రేమ గురించి రావుర‌మేష్ మాట్లాడే స‌న్నివేశం, శివని చంప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు చోటుచేసుకున్న స‌న్నివేశం చాలా స‌హ‌జంగా ఉన్నాయి. ఇవే గాకుండా మ‌రి కొన్ని స‌న్నివేశాలు వాస్తవిక‌త‌కు ద‌ర్ప‌ణం ప‌ట్టాయి. అలాగే.. రాంకీ, కార్తికేయ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్‌గా అనిపిస్తాయి. ఓవ‌రాల్‌గా.. ద‌ర్శ‌కుడిగా అజ‌య్ త‌న‌దైన ముద్ర వేశారు. అలాగే.. శివ (1981-2014) అనే ఓ యువ‌కుడి వ్య‌క్తిత్వం, అత‌ని జీవితంలో చోటుచేసుకున్న య‌దార్ధ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన విధానం.. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల మెప్పు త‌ప్ప‌క పొందుతుంది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. క‌థానాయ‌కుడు కార్తికేయకి మంచి పర్సనాలిటీ ఉంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో లుక్స్ ప‌రంగా, న‌ట‌న ప‌రంగా చ‌క్క‌ని వేరియేష‌న్స్ చూపించారు. కొన్ని యాంగిల్స్‌లో సాయికుమార్ త‌న‌యుడు ఆదిలా క‌నిపించారు. ఓవ‌రాల్‌గా.. న‌టుడిగా త‌న‌కి మంచి భవిష్యత్తు ఉంద‌నే చెప్పాలి. ఇక‌.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ విషయానికి వ‌స్తే పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా స‌హ‌జంగా న‌టించారు. గ్రే షేడ్స్ ఉన్న ఈ పాత్ర‌లో పాయ‌ల్ చాలా బోల్డ్‌గా క‌నిపించారు. ముద్దు స‌న్నివేశాల్లో ఎంత రెచ్చిపోయారో.. న‌ట‌న‌కు స్కోప్ స‌న్నివేశాల్లో అంత‌గా మెప్పించారు. డాడీ పాత్ర‌లో రాంకీ న‌ట‌న సినిమాని ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. హీరోని వెనుకేసుకొచ్చే సన్నివేశాల్లోనూ.. క‌థానాయిక నిజ స్వ‌రూపం తెలిశాక‌.. అది హీరోకి తెలిస్తే ఏమ‌వుతాడోన‌ని త‌న‌లో త‌ను మ‌ధ‌న‌ప‌డే స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న గుర్తుండిపోతుంది. అలాగే.. రాంకీ పాత్ర కోసం “సరోజ కూతురుని” అని ఓ అమ్మాయి అనగానే ‘సింధూర పువ్వు’ పాటను బి.జి.ఎం.గా వాడుకునే సన్నివేశం బాగుంది. ఆ సినిమాను గుర్తు చేయడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ ఫాద‌ర్ పాత్ర‌లో రావు ర‌మేష్ ఎప్ప‌ట్లానే మెప్పించారు. త‌ప్పు చేసిన కూతురిని వెనుకొచ్చే స‌గ‌టు తండ్రిగా ఆయ‌న న‌ట‌న స‌హ‌జంగా ఉంది. అలాగే.. లక్ష్మణ‌ క్యారెక్టర్‌… పరిస్థితికి తగ్గట్టుగా చెప్పే పద్యాలు బాగున్నాయి. అత‌ని నట‌న కూడా బాగుంది. న‌ల్లి పాత్ర‌లో న‌టించిన యాక్ట‌ర్‌, వెంప కాశి పాత్ర చేసిన న‌టుడు.. త‌మ పాత్ర‌ల‌కి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతంలో పాట‌ల‌న్నీ బాగున్నాయి. “పిల్ల రా” విన‌డానికి ఎంత బాగుందో.. పాటలోని విజువల్స్ కూడా అంతే బాగున్నాయి. ఈ పాటలో “కోటి స్వప్నాల రూపం” లైన్ మనసుకు హత్తుకునేలా ఉంది. అలాగే.. “కొడవల నిండా కుంకుమ పూలే”, “ఎవరే ఎవరే” “ అదిరే హృదయం..” వంటి పాటలు విజువల్స్ పరంగానూ, సాహిత్యం పరంగానూ బాగున్నాయి. ఇక‌.. స్మ‌ర‌న్ నేప‌థ్య సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళింది. రామ్ ఛాయాగ్ర‌హ‌ణం ఉన్న‌తంగా ఉంది. గోదావ‌రి అందాల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించింది. “ఆవేశంలో  ఉన్న‌ పిల్లి మీద చేయి వేసినా పులిలా తిరగబడుద్ది”, “శత్రువుని గెలవాలంటే ఎన్నో అవకాశాలు వస్తాయి. అదే శ‌త్రువుని చంపడానికి అవ‌కాశాలు తక్కువ వస్తాయి”, “ప్రేమించే రోజు అందరికి వస్తుంది.. ప్రేమలో అన్నీ మైమరచిపోవడం కొందరికే జరుగుతుంది”, “మరచిపోవడానికి నా ప్రేమ చావు పుట్టుకల్లాంటిది కాదు.. సముద్రంలో అలలాంటిది”, “శివా రొమాన్స్ అంటే పెయిన్ ఉండాలి” లాంటి డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

న‌టీన‌టులు, పెర్‌ఫార్మెన్స్‌
పాటలు
నేపథ్య సంగీతం
ద‌ర్శ‌క‌త్వం
కెమెరా పనితనం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
టూ మ‌చ్ బోల్డ్ నెస్‌, వ‌యోలెన్స్‌
ఐటెం సాంగ్‌
స్లో నేరేష‌న్‌

బాట‌మ్ లైన్‌.. RX 100.. ఓ బోల్డ్ అటెంప్ట్‌

RX 100 రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here