`అప్ టు ద మార్క్` అనిపించుకున్న చిరంజీవి అల్లుడు

1978 సెప్టెంబ‌ర్ 22.. `ప్రాణం ఖ‌రీదు` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ ఉర‌ఫ్ చిరంజీవి విజ‌య ప్ర‌స్థానం గురించి అంద‌రికి తెలిసిందే. ఈ 40 ఏళ్ళ‌ ప్ర‌స్థానంలో ఆయ‌న సాధించిన విజ‌యాల గురించి, నెల‌కొల్పిన రికార్డుల గురించి, చేరుకున్న శిఖ‌రాగ్రాల గురించి ఏం చెప్పినా అది చ‌ర్వితచ‌ర‌ణమే అవుతుంది. పున‌రావృత దోషం అంట‌కుండా చిరంజీవి శిఖ‌రాగ్ర ప్ర‌స్థానం గురించి చెప్ప‌డం ఎవ‌రికి సాధ్యం కాదు. ఒకే ఒక్క‌డుగా వ‌చ్చిన చిరంజీవి.. ఒక మ‌హా వృక్షంగా ఎదిగితే.. ఆ వృక్షం నీడ‌లో త‌మ ఉనికికి ఊపిరి పోసుకుని.. ఎదుగుతున్న మెగా హీరోల సంఖ్య ఈ రోజుతో తొమ్మిదికి చేరింది. చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించిన `విజేత` ఈ రోజు (12-07-2018)న విడుద‌లవ‌డంతో.. 9కి చేరిన మెగా హీరోల సంఖ్య మున్ముందు ఇంకా పెరిగే అవ‌కాశ‌ముంది. చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు శిరీష్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌.. తాజాగా క‌ళ్యాణ్ దేవ్‌.. వీరే మెగా కాంపౌండ్ న‌వ ర‌త్నాలు.

ఇక మెగా కాంపౌండ్ నైన్త్ హీరోగా ఈ రోజు ప‌రిచ‌య‌మైన క‌ళ్యాణ్ దేవ్ ఎలా ఉన్నాడు? ఎలా చేశాడు? అని వాక‌బు చేస్తే.. బాగున్నాడు, బాగా చేశాడు అనే సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం ఫిల్మ్ ఇండ‌స్ట్రీ, మీడియా, ట్రేడ్ వ‌ర్గాల నుండి వినిపించింది. ఆహా ఓహో అనే పొగ‌డ్త‌లు.. ఇర‌గ‌దీశాడు చించేశాడు దంచేశాడు అనే వీరంగాలు ఏవీ వినిపించ‌లేదు. సింపుల్‌గా.. `A boy at our next door` అనిపించేలా `upto the character` అన్న‌ట్లుగా ఉన్నాడు అనే రిపోర్ట్ వ‌చ్చింది. నిజానికి.. అంత‌టి మెగాస్టార్ అల్లుడి తొలి సినిమా అంటే అదిరిపోయే సెట్టింగులు, సెట‌ప్పులు, ప్యాడింగ్‌లతో పెద్ద హడావిడి, హంగామా ఉంటుంద‌ని వెళ్ళే వాళ్ళ‌కు అందుకు పూర్తి భిన్న‌మైన సినిమా క‌నిపిస్తుంది. 30 ఏళ్ళ క్రితం చిరంజీవి న‌టించిన చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రం `విజేత` అనే టైటిల్‌ను వాడుకోవ‌డం త‌ప్ప.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పేరును గానీ, ఇమేజ్‌నుగానీ వాడుకోక‌పోవ‌డం మాత్రం అభినంద‌నీయం. క‌థ‌ను క‌థ‌గా, పాత్ర‌ను పాత్ర‌గా ట్రీట్ చేయ‌డం ద్వారా `రామ్` అనే పాత్ర మాత్ర‌మే క‌నిపించింది త‌ప్ప `చిరంజీవి అల్లుడు` అనే మెగా వెయిట్ క‌ళ్యాణ్ దేవ్ మీద‌ ప‌డ‌లేదు.

క్యారెక్ట‌రైజేష‌న్‌లోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ, ప్ర‌జంటేష‌న్‌లోగానీ.. `నేను మెగాస్టార్ చిరంజీవి అల్లుడిని` అనే యాటిట్యూడ్‌ క‌నిపించ‌క‌పోవ‌డ‌మే `విజేత` సినిమాను విజేత‌గా నిలిపింది. ఈ బ్యాలెన్స్‌డ్ యాటిట్యూడ్ ఈ సినిమాకే కాదు.. మున్ముందు క‌ళ్యాణ్ దేవ్ చేయ‌బోయే సినిమాల‌కు కూడా గ‌ట్టి పునాదిగా నిలుస్తుంది. తీయ‌ద‌లుచుకుంటే.. చేయ‌ద‌లుచుకుంటే త‌న అల్లుడితో వంద కోట్ల సినిమా చేయ‌గ‌ల సొమ్ము, ద‌మ్ము ఉన్న‌ప్ప‌టికీ.. ఈ సింపుల్‌, స్ట్రాట‌జిక‌ల్ ప్ర‌జంటేష‌న్ ద్వారా క‌ళ్యాణ్ దేవ్‌కు ఒక లాంగ్ కెరీర్‌ను క‌ల్పించ‌డ‌మే చిరంజీవి ఉద్దేశంగా క‌నిపించింది. క‌ళ్యాణ్ దేవ్ కూడా అలాంటి ఆడంబ‌ర ప్ర‌ద‌ర్శ‌న కోసం ఆరాట‌ప‌డ‌కుండా క‌థ‌ను, పాత్ర‌ను ఆక‌ళింపు చేసుకోవ‌డం అభినంద‌నీయం. మొత్తానికి మెగా హీరోల జాబితాలోకి కొత్త‌గా వ‌చ్చి చేరిన క‌ళ్యాణ్ దేవ్‌కు `విజేత` మంచి స్టెప్పింగ్ స్టోన్‌గా నిలుస్తుంది. ఏవో ఒక‌టి రెండు సినిమాలు త‌ప్ప మెగా హీరోల డెబ్యూల‌న్నీ హిట్‌ నుండి సూప‌ర్ హిట్ రేంజ్ సినిమాలే కావ‌డం విశేషం. ఆ స‌క్సెస్ రేట్‌ను, రేంజ్‌ను నిల‌బెట్టే స్థాయిలో న‌టించి అల‌రించిన క‌ళ్యాణ్ దేవ్‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాభినంద‌న‌లు చెబుతోంది `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్‌`.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here