సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కెరీర్లో విజయాల శాతం ఎక్కువ. వాటిలో సింహభాగం రీమేక్‌లే ఉన్నాయి. అలాంటి రీమేక్ హిట్ చిత్రాల్లో ‘కొండపల్లి రాజా’ ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ నటన ఆయన అభిమానులనే కాకుండా సగటు ప్రేక్షకులను అలరించింది. స్నేహం ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్‌తో పాటు అప్పటి మరో అగ్ర కథానాయకుడు సుమన్ కూడా నటించడం వార్తల్లో నిలిచింది.
నగ్మా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, సుజాత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. జూలై 9, 1993న విడుదలైన ‘కొండపల్లి రాజా’ నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
