‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమ్యారు రాహుల్ రవీంద్రన్. ఆ తరువాత ‘అలా ఎలా?’, ‘టైగర్’ వంటి హిట్ చిత్రాల్లో సందడి చేశారు. చెన్నైకు చెందిన ఈ యువ కథానాయకుడు.. సుశాంత్ హీరోగా నటించిన ‘చి ల సౌ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సిరుని సినీ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది. ఈ సినిమా విడుదల కాకముందే మరో అవకాశం రాహుల్‌ను వరించింది. ఈ విషయాన్ని రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
దర్శకుడిగా తన రెండో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోలో చేసేందుకు సంతకం చేశానని.. ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నానని.. ఈ సినిమా కోసం మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలు ఇంకా ఫైనలైజ్ కాలేదని.. ఇలాంటి వార్తని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నారు.
