మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ బయోపిక్కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. స్వరవాణి కీరవాణి సంగీతమందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జూలై 5) ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్.బి.కె.ఫిల్మ్స్.. ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. అంతేగాకుండా.. 1949లో ఇదే తేదిన ఎన్టీఆర్ తన తొలి చిత్రం ‘మనదేశం’ కోసం తొలిసారిగా షూటింగ్లో పాల్గొన్నారని.. ఆ స్పెషల్ మూమెంట్‌కు సంబంధించిన సీన్‌తోనే ఈ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామని అందులో పేర్కొన్నారు.
కాగా.. ఈ సినిమాని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న.. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
