స‌త్య వెనుక ఉన్న వాస్త‌వం ఇది – రామ్ గోపాల్ వ‌ర్మ‌

Truth behind Satya, RGV opens up about the making of Satya, RGV Satya Movie Completes 20 years, Unknown Facts about Satya Movie, Interesting facts about Satya Film, #RGV shares truth behind the success of #Satya, Ram Gopal Varma on 20 years of Satya, #20yearsofSatya, Telugu FilmNagar, Telugu cinema news, Telugu Movies Updates
THE TRUTH BEHIND SATYA- RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలలో ‘సత్య’ ఒకటి. జె.డి.చక్రవర్తి, ఊర్మిళ, మనోజ్ బాజ్‌పాయ్ ముఖ్య తారాగణంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. జూలై 3, 1998న విడుదలైన ఈ చిత్రం రేపటితో (జూలై 3) 20 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ద్వారా.. వర్మ “ది ట్రూత్ బిహైండ్ సత్య” అంటూ ఈ సినిమాను తెరకెక్కించడానికి ఉపకరించిన విషయాలను ఒకసారి గుర్తుచేసుకున్నారు.

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “’సత్య’ సినిమాను రూపొందించి 20 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ఒక్కసారి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను మీతో పంచుకోవాలి. నేను 1994లో ‘రంగీలా’ షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వస్తున్న రోజులవి. ముంబైలో ధారావి లాంటి స్లమ్‌లో ఉన్న ఇళ్ళకి, రైల్వే ట్రాక్‌ల‌కి కేవలం మూడు అడుగుల దూరం కూడా ఉండదంటే.. చెప్పడానికే కాదు, వినడానికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ముంబై నగరం ఎటువంటిదంటే.. ఇటు ధనికులు అటు పేదవారు ఇద్దరూ పక్కపక్కనే బతకగల మహానగరం. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మొదటిసారిగా విన్నపేరు “అండర్ వరల్డ్”. ఈ పదం వినడానికి కొత్తగా ఉంది. సరిగ్గా అప్పుడే దావూద్ ఇబ్రహిమ్‌తో పాటు మరికొంతమంది గ్యాంగ్‌స్టర్స్ పేర్లు కూడా విన్నాను. ఎందుకంటే.. సరిగ్గా అప్పటికి ఏడాదికి ముందు (1993) ముంబైలో పేలుళ్లు జ‌రిగాయి. కాబట్టి ఎక్కడ విన్నా వీళ్ళ పేర్లే ఎక్కువగా వినపడుతూ ఉండేది. ఇటువంటి నేపథ్యంలో నాకు అండర్ వరల్డ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.

ఇదిలా ఉంటే.. ఓరోజు ఉదయం నేను ఒక నిర్మాత ఆఫీస్‌లో కూర్చుని ఉండగా.. అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. నిర్మాతను కలవడానికి వస్తానన్న వ్యక్తిని ఎవరో అదే రోజు ఉదయం చంపేశారని. విని షాక్ అయ్యా. నిర్మాత నాతో ఏదో చెప్తున్నారు. కాని నేను మాత్రం దీనిని ఒక సినిమాటిక్‌గా ఆలోచించడం మొదలుపెట్టాను. చనిపోయిన వ్యక్తికి తెలీదు తాను ఈరోజు చనిపోతానని.. కాని అతను నిద్ర లేచిన సమయానికే.. హంతకుడు కూడా నిద్రలేచి ఉంటాడా? లేదా ఆ హంతకుడు మరుసటి రోజు తనకు పని ఉందని, త్వరగా నిద్ర లేపమని వాళ్ళ అమ్మకు చెప్పి ఉంటాడా? హత్యకు ముందుగాని, తర్వాతగాని ఆ హంతకుడు బ్రేక్ ఫాస్ట్ చేసి ఉంటాడా? ఇలా నా బుర్ర నిండా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఇలా చంపబడే మనిషికి.. చంపే మనిషికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, ఈ హత్య జరిగే మధ్యలో వారిరువురు ఏం చేస్తున్నారు? ఇలాంటి ఆలోచనల్లోంచి పుట్టిందే ‘సత్య’ సినిమా. ఇలా ఆ సినిమాకి బీజం వేసిన ఈ హత్యా ఉదంతం నా బుర్రలోంచి వెళ్ళక ముందే ఆ మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్‌లో కొంతమంది న‌ల్ల ముసుగు వేసిన‌ బక్క పలచని గ్యాంగ్‌స్టర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోలను చూసాను. వాళ్ళ ఫిజిక్‌గాని, లుక్‌గాని గ్యాంగ్‌స్టర్‌గా అనిపించడం లేదు.. అప్పుడు నాకు అనిపించింది ఈ మహా నగరంలో గ్యాంగ్‌స్టర్ అన్నవాడు మన పక్కనే ఉండొచ్చు.. మనం ఉండే ఫ్లాట్‌లోనే ఉండొచ్చు.. లేదా మనతో పనిచేస్తున్న వాళ్లైనా అయి ఉండొచ్చని.
సరిగ్గా నేను ఇలా ఆలోచిస్తున్న టైంలోనే.. ఓషివారాలో నా స్నేహితుడొకడు నివ‌సిస్తున్న ఒక అపార్ట్ మెంట్‌కు వెళ్ళాను. నా స్నేహితుడు 14వ ఫ్లోర్‌లో ఉండేవాడు. అదే అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తులో ఓ అబ్బాయి కూడా ఉండేవాడు. నా స్నేహితుడు, ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడుకునేవారు. కాని ఒకరోజు ఏమైందో కాని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. అంతవరకు మాకెవరికి తెలీదు.. ఆ అబ్బాయికి కూడా ఓ నేరచరిత్ర ఉందని. ఈ ఉదంతాన్ని ఈ సినిమాలో జె.డి., ఊర్మిళ ట్రాక్ కోసం వాడుకున్నాను. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా.. ఊర్మిళ పాత్ర‌కి సత్య గురించి తెలీదు.

అలాగే.. ఓ రోజు బాలీవుడ్ నటి మందాకిని (దావూద్ గర్ల్ ఫ్రెండ్) దగ్గర సెక్రటరీగా పనిచేసి మానేసిన అజిత్ దివానీని క‌లిశాను. మాటల్లో పడి.. అత‌డు తన అనుభవాన్ని ఒకదానిని నాతో పంచుకున్నాడు. ఒక రోజు అతను ఒక గ్యాంగ్‌స్టర్ ఇంటికి వెళ్ళగా.. అక్కడ ఆ గ్యాంగ్‌స్టర్ తమ్ముణ్ణి పోలీసులు చంపేసి ఉండడం చూసిన.. ఆ గ్యాంగ్‌స్టర్ కోపంతో ఊగిపోతున్నాడు. తన మాటను పెడ చెవిన పెట్టినందుకే ఈ రోజు తన తమ్ముడికి ఈ గతి పట్టిందని అరవడం చూసాడు. అతను చెప్పిన ఈ ఉదంతాన్ని ‘సత్య’ సినిమాలో భీకు మాత్రే క్యారెక్టర్ కోసం వాడుకున్నాను. భీకు కూడా తన తమ్ముడు చందర్ చనిపోయినప్పుడు.. తమ్ముణ్ణి తిట్టే సీన్‌ను ఇలా తీసుకున్నదే.

ఇక ‘సత్య’ సినిమా కోసం లొకేషన్‌ల కోసమని బోరివలి బీర్ బార్‌కు వెళ్లాను. అక్కడ గ్యాంగ్‌స్టర్‌గా పనిచేసి మానేసిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన నడవడికతో, ఆటిట్యూడ్‌తో నా సహనానికి పరీక్ష పెట్టాడతను. అతనెవరన్న విషయం నాకు తెలుసన్న విషయం అతనికి తెలుసు. అందుకే నాతో కొంచెం డిఫరెంట్‌గా ఆటిట్యూడ్ చూపించడం మొదలుపెట్టాడు. కాని మనది కాని ఆటిట్యూడ్‌ను మనం ఎంతో సేపు చూపించలేమన్న విషయం నాకు తెలుసు కాబట్టి.. అతను ఎంతో సేపు అలా ఉండలేకపోయాడు. ఆ తర్వాత నాతో బాగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని ఈ ప్రవర్తనను చూసి ఈ సినిమాలో కల్లు మామ పాత్రను సృష్టించాను.

కాగా మరోరోజు బారా చాల్ వెళ్లాను. అక్కడ అరుణ్ గావలి గ్యాంగ్‌లో పనిచేసే వ్యక్తితో మాట్లాడాను. అత‌ను చాలా డేంజ‌ర‌స్ ప‌ర్స‌న్ అన్న‌ట్లుగా చాలామంది బిల్డ‌ప్పులు ఇచ్చారు గానీ.. నాకు మాత్రం క్యూట్ బాయ్ అనిపించేవాడు. త‌ను మాట్లాడే ప్ర‌తి వాక్యంలోనూ గావలి భాయి గురించే చెప్తూ ఉండేవాడు. నాకు గావలి భాయిపై ఆ వ్యక్తికున్న విధేయత అర్ధమైంది. ఈ సినిమాలో ఇటువంటి క్యారెక్టర్‌లో చందర్ కనిపిస్తాడు.

ఇలా ఈ సినిమాలో నేను సృష్టించిన ప్రతీ పాత్ర.. నిజ‌ జీవితంలో నేను కలిసిన పాత్రల తాలుకు రిఫరెన్స్‌లే. ఈ విధంగా పాత్రల స్వభావం పూర్తైన తర్వాత ఈ సినిమా ప్రారంభించాలనుకున్నా. సరిగ్గా అదే సమయంలో అనురాగ్ కశ్యప్ రైటర్‌గా నా దగ్గరకు వచ్చాడు. అతనితో పాటు సౌరభ్ శుక్ల కూడా రావడం జరిగింది. నా పాత్రల స్వభావం గురించి చెప్పాను. మా మధ్య విపరీతమైన స్టొరీ డిస్కషన్ జరిగింది. కాని ఏదీ ఫైనల్ కాకపోయే సరికి స్క్రిప్ట్ లేకుండానే మొదటి రోజును ప్రారంభించాం. ఇనిస్టింక్ట్‌గా వచ్చే సీన్స్ కొన్నైతే.. అనురాగ్ అందించిన కొన్ని సీన్స్‌తో పాటు స్పాట్‌లో అనురాగ్ ఇచ్చిన రియలిస్టిక్ డైలాగ్స్‌తో సినిమాను చేసాం.

తొలి సన్నివేశంలో సుశాంత్ వచ్చి సత్యని మామూలు ఇమ్మని అడగడం.. దానికి సత్య కత్తితో బెదిరించడంతో నేను కట్ చెప్పాలి. కాని నేను కట్ చెప్పడానికి ముందే సుశాంత్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నేను అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈలోగా వేరే నటుడు “పాని లావో పాని లావో” అని గట్టిగా అరవడం విన్నా.. ఇదంతా వాళ్ళకు వాళ్ళుగా స్పాట్‌లో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించిన సీన్స్. ఇవన్ని చాలా నేచురల్‌గా అనిపించాయి. దీని తర్వాత ఈ సినిమాలో నటీనటులకు ఒక దర్శకుడిగా ఏమీ చెప్పలేదు. వాళ్లకు ఒకటే చెప్పా.. డైలాగ్స్ మీకు ఎలా వస్తే అలా మాట్లాడండి. స్క్రిప్ట్‌ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఏమైనా తప్పులు వస్తే ఎడిటింగ్‌లో చూసుకుంటాన‌ని చెప్పా. దాంతో అందరూ చాలా నేచురల్‌గా పెర్ఫామ్ చేసారు. దీనికంతటికి కారణం సుశాంత్‌తో ఫస్ట్ సీన్. అక్క‌డ నేను కట్ చెప్పి ఉంటే.. ఈ సినిమా ఇంత నేచురల్‌గా వచ్చి ఉండేది కాదేమో. నేను ముందే చెప్పినట్టుగా.. నేను క్లియర్ స్క్రిప్ట్ ఏమీ అనుకోలేదు. ఆ స్టొరీ ఫ్లో బట్టి నేను ప్రతీ రోజూ, ప్రతీ సన్నివేశానికి నా మైండ్ సెట్‌ను మార్చుకుంటూ ఉండేవాణ్ణి. సత్య పాత్ర తప్ప మిగిలిన క్యారెక్టర్ విషయంలో చాలా క్లారిటీతో ఉండేవాణ్ణి.

ఇక ఈ సినిమాకి సందీప్ చౌతా అందించిన సంగీతం చాలా ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమాని ఓ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. విశాల్ భరద్వాజ్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించినా.. సందీప్ నేప‌థ్య సంగీత‌మే సినిమాలోని స్పిరిట్‌ని ప‌ట్టుకుంది.

ఏదేమైనా.. ఏ గొప్ప సినిమా అయినా గొప్ప సినిమా చేయాల‌నుకుంటే రాదు.. అది అలా జ‌రిగిపోతుందంతే. ఇలా చేస్తే ఇంత మంచి సినిమా వస్తుందనే ఫార్ములా ఉంటే.. ఈ 20 ఏళ్ళల్లో మళ్ళీ ఇలాంటి సినిమా ఎందుకు రాలేదు. సత్య ఒక మ్యాజిక్ ఫిల్మ్ అంతే. ఈ సినిమాలో ఏవైనా త‌ప్పులుంటే అవి నావే.. ఏమైనా క్రెడిట్స్ ఉంటే అవి ఇత‌రులవే” అని ‘సత్య’ అందించిన మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు ఈ సంచలన దర్శకుడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here