ద‌ర్శ‌కుల స‌మ‌క్షంలో.. ఘ‌నంగా జ‌రిగిన‌ గోపీచంద్‌ ‘పంతం’ ప్రీ రిలీజ్ వేడుక‌

Pantham Pre Release Function Details, Pantham Pre Release Event Highlights, Gopichand Pantham Pre Release Event Highlights, Gopichand Latest News, Pantham Movie, Gopichand Fecilitate his Directors, Telugu cinema news 2018, Telugu Movies Updates, Telugu FilmNagar
Pantham Pre Release Function Details

యాక్ష‌న్ హీరో గోపీచంద్ నటించిన 25వ‌ చిత్రం ‘పంతం’. ఫర్ ఎ కాజ్ అనేది ట్యాగ్‌లైన్‌. మెహ‌రీన్ క‌థానాయిక‌. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బేన‌ర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ద్వారా కె.చక్రవర్తి (చ‌క్రి) దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. గోపీసుందర్ సంగీత సార‌థ్యంలో మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇటీవ‌ల‌ విడుద‌లైన‌ పాటల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమా ఈ నెల 5న విడుద‌లవుతున్న సంద‌ర్భంగా శ‌నివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది చిత్ర బృందం. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో జ‌రిగిన ఈ వేడుకకు గోపీచంద్ గ‌త చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ముత్యాల సుబ్బ‌య్య‌, బి.గోపాల్‌, పూరీ జగ‌న్నాథ్‌, ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి, శ్రీ‌వాస్‌, బి.వి.ర‌మ‌ణ‌, సంప‌త్ నంది, ప‌రుచూరి ముర‌ళి, బి.వి.ఎస్‌.ర‌వి, `జ‌యం` రాజా, `శౌర్యం` శివ‌, అమ్మ రాజశేఖ‌ర్‌, రాధాకృష్ణ కుమార్‌ హాజ‌ర‌యై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. అలాగే చిత్ర యూనిట్ స‌భ్యులు క‌థానాయ‌కుడు గోపీచంద్‌, నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌, ద‌ర్శ‌కుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి), న‌టులు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, పృథ్వీ, శ్రీ‌నివాస‌రెడ్డి, గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల‌, మాట‌ల ర‌చ‌యిత ర‌మేష్ రెడ్డి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, కెమెరామేన్ ప్ర‌సాద్ మూరెళ్ళ‌తో పాటు మ్యాంగో గ్రూప్ అధినేత రామ్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ముత్యాల సుబ్బ‌య్య మాట్లాడుతూ “మా గురువు టి.కృష్ణ త‌న‌యుడు గోపీచంద్‌.. ర‌ష్యాలో చ‌దివిన త‌ను టి.కృష్ణ మెమోరియ‌ల్ ఫిల్మ్స్ యం.నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి వ‌చ్చి.. నాతో ఆర్టిస్ట్ అవుదామ‌నుకుంటున్నాన‌ని చెప్పాడు. అప్ప‌టికే యం.నాగేశ్వ‌ర‌రావుతో స‌గ‌టు మ‌నిషి, అమ్మాయి కాపురం చేశాను. గోపీచంద్‌.. అందంగా ఉన్నాడు, మంచి వాయిస్ కూడా ఉంది. అందుకే మ‌న బేన‌ర్‌లోనే గోపీచంద్ హీరోగా ప‌రిచ‌యం చేద్దామ‌నుకుని.. తొలివ‌ల‌పు చేశాను. సూప‌ర్ హిట్ కాక‌పోయినా బాగానే ఆడింది. గోపీచంద్ 25వ చిత్రం బాగా ఆడాల‌ని.. ఇలానే గోపీ 100 సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

బి.వి.ర‌మ‌ణ మాట్లాడుతూ “తొలివ‌ల‌పు నుంచి గోపీచంద్‌తో ప‌రిచ‌యం ఉంది. `జ‌యం` టైమ్‌లో మా ప‌రిచ‌యం మ‌రింత పెరిగింది. `ఒంట‌రి`కి ముందు ఒక క‌థ చెప్పాను. మీరు క్యారెక్ట‌ర్‌ను బాగా డీల్ చేశార‌న్నారు. అప్ప‌టికే వేరే క‌థ అనుకున్నాం.. అంటూ `ఒంట‌రి` క‌థ‌ గురించి చెప్పారు. ఆ క‌థ‌తోనే సినిమా చేశాం. గోపీచంద్ వాళ్ళ ఫాద‌ర్ టి.కృష్ణగారు ఎన్నో విప్ల‌వాత్మ‌క సినిమాలు చేశారు. అవ‌న్నీ సూప‌ర్ హిట్సే. గోపీచంద్ సోసైటీకు సంబంధించిన ఓ కాజ్‌తో సినిమా చేస్తే బాగుంటుంద‌నుకునేవాడిని. అది ఈ సినిమాతో తీరింద‌నుకుంటున్నాను“అన్నారు.

బి.గోపాల్ మాట్లాడుతూ “25 సినిమాలు చేయ‌డ‌మంటే అఛీవ్‌మెంట్‌. గోపీచంద్ మా టి.కృష్ణ‌గారి అబ్బాయి. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసిన గోపీచంద్ ఆల్ రౌండ‌ర్‌. త‌ను కామెడీ, ఎమోష‌న్స్ బాగా చేస్తాడు. ఈ `పంతం` త‌న కెరీర్‌లోనే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను.

ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ “నా కెరీర్ బిగినింగ్ `మ‌న‌సుతో` అనే అట్ట‌ర్‌ఫ్లాప్‌తో స్టార్ట్ అయింది. అయితే గోపీచంద్‌తో చేసిన `య‌జ్ఞం` త‌రువాత నాకు మంచి పేరు వ‌చ్చింది. త‌న‌లోని న‌టుడిని ప‌రిపూర్ణంగా ఉప‌యోగించుకోగ‌ల ద‌మ్ము `పంతం` క‌థ‌లో ఉంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

పృథ్వీ మాట్లాడుతూ.. “గోపీచంద్‌ది క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం. ప్ర‌య‌త్న‌లోపం లేకుండా త‌న ప‌ని తాను చేసుకుంటారు. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇందులో నేను వాడ‌కం వాలేశ్వ‌రం అనే పాత్ర‌లో న‌టించాను. ప‌ర్‌ఫెక్ష‌న్ కోసం త‌పించే ద‌ర్శ‌కుడు చ‌క్రి. ఈ సినిమా గోపీచంద్‌కి అద్భుత విజ‌యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

భాస్క‌ర భ‌ట్ల మాట్లాడుతూ “ గోపీచంద్ 25వ సినిమాలో అన్ని పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అంద‌రికి న‌చ్చే అన్ని పాట‌లు రాయ‌డం హ్యాపీగా ఉంది“ అన్నారు.

ర‌మేష్ రెడ్డి మాట్లాడుతూ “ ఎక్క‌డో విదేశాల‌నుంచి వ‌చ్చి మంచి సోష‌ల్ కాజ్ కోసం కుటుంబాన్ని కూడా వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డే పాత్రలో గోపీచంద్ న‌టించిన సినిమా ఇది. ఎమోష‌న్ కింగ్ ఆయ‌న‌. ప్ర‌తి సీన్ అద్భుతంగా చేశారు“ అన్నారు.

`జ‌యం` రాజా మాట్లాడుతూ.. “టి.కృష్ణగారి `రేప‌టి పౌరులు` చిత్రాన్ని త‌మిళంలో నాన్న ఎడిట‌ర్ మోహ‌న్ డ‌బ్ చేశారు. అది చూసి నేను ఎంతో మోటివేట్ అయ్యాను. అందువ‌ల్లే `త‌ని ఒరువ‌న్` (`ధృవ‌` ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) లాంటి సినిమా చేయ‌గ‌లిగాను. త‌మిళంలో `జ‌యం` చేసిన‌ప్పుడు గోపీ వ‌చ్చాడు. ఒక్క షాట్ కూడా నేను చెప్ప‌లేదు. అంత మంచి యాక్ట‌ర్ త‌ను. త‌మిళంలో మ‌ళ్ళీ త‌న‌తో సినిమా చేయాలి. లేదంటే తెలుగులో అయినా నేరుగా త‌న‌తో ఓ సినిమా చేయాలి. గోపీచంద్‌ అన్ని సినిమాల్లో 25వ చిత్రం పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

శివ మాట్లాడుతూ “త‌ల్లిదండ్రులకు ఎంత రుణ‌ప‌డి ఉంటామో.. అంత రుణ‌ప‌డి ఉంటాను గోపీచంద్‌గారికి. ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం `శౌర్యం` త‌న‌తోనే చేశాను. ఈ సినిమా త‌న‌కు మంచి పేరు తీసుకువ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

అమ్మ రాజశేఖ‌ర్ మాట్లాడుతూ “ద‌ర్శ‌కుడు కావాల‌న్న నా చిన్న‌ప్ప‌టి ల‌క్ష్యాన్ని గోపీచంద్ గారి కార‌ణంగానే నెర‌వేర్చుకున్నాను. ఆయ‌న‌తో నేను తీసిన `ర‌ణం` మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

శ్రీ‌వాస్ మాట్లాడుతూ “నేను ఎన్ని సినిమాలు చేసినా నాకు మొద‌టి సినిమా ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్‌కు రుణ‌ప‌డి ఉంటాను. మా ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన `ల‌క్ష్యం`, `లౌక్యం` హిట్ అయ్యాయి. భ‌విష్య‌త్‌లోనూ గోపీచంద్ మంచి హిట్స్ కొట్టాల‌ని కోరుకుంటున్నాను. జూలై 5 `ల‌క్ష్యం` విడుద‌లైన రోజు. అదే రోజు వ‌స్తున్న ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఆడాల‌ని కోరుకుంటాను. గోపీచంద్‌.. ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ అయినా వారికి విలువ ఇచ్చి.. చెప్పింది చేస్తారు. ఈ `పంతం` నా `ల‌క్ష్యం`, `లౌక్యం` కంటే పెద్ద హిట్ కావాలి. కొత్త ద‌ర్శ‌కుల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ఇవ్వాలి“ అన్నారు.

సంప‌త్ నంది మాట్లాడుతూ “ఏమైంది ఈ వేళ‌`, `బెంగాల్ టైగ‌ర్` సినిమాల‌ను ఇదే సంస్థ‌లో చేశాను. స్క్రీన్‌పై కంటే రియ‌ల్ లైఫ్‌లోనే గోపీచంద్‌ అంటే ఎక్కువ ఇష్టం. ఇంకా ఆయ‌న మ‌రో 75 సినిమాలు చేయాలి. వాటిలో కనీసం మ‌రో 4,5 చిత్రాలు నేను చేయాల‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

పూరీ జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ “గోపీచంద్‌తో `గోలీమార్` చేశా. ఆ టైంలో చాలా ఎంజాయ్‌ చేశా. త‌న‌తో ప‌నిచేయ‌డం మంచి అనుభూతి. మ‌లేసియాలో రోజు షాపింగ్‌కు వెళ్ళేవాళ్ళం. క‌ష్టం తెలిసిన మ‌నిషి గోపీచంద్‌. ఆయ‌న ఎప్పుడు అంటే అప్పుడు త‌న‌తో సినిమా చేయ‌డానికి నేను రెడీ. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌ మాట్లాడుతూ “ఇది నాకు ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం. ల‌వ‌బుల్ కో ఆప‌రేటివ్ హీరో గోపీచంద్‌. ఆయ‌న‌తో సినిమా చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నా. చ‌క్రి ఫ‌స్ట్ టైం డైరెక్ట‌ర్ అయినా.. ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న డైరెక్ట‌ర్‌లా ఈ సినిమా చేశారు. ర‌మేష్ రెడ్డి మంచి మాట‌లు అందించారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల స‌హ‌కారంతో అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల చేయ‌బోతున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) మాట్లాడుతూ “గోపీచంద్ న‌న్ను న‌మ్మి ఈ ఆఫ‌ర్ ఇచ్చారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాన‌ని అనుకుంటున్నా“ అన్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ “నాతో 25 సినిమాలు చేసిన ద‌ర్శ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అస‌లు హీరోలు ఈ ద‌ర్శ‌కులే. వాళ్ళు రాసిన క‌థ‌ల‌తోనే మేం తెర‌పై క‌నిపిస్తాం. నేను మీ క‌థ‌కు స‌రిపోతాన‌ని నాకు అవ‌కాశ‌మిచ్చిన అంద‌రికీ థ్యాంక్స్‌. మీరు అనుకున్న క‌థ‌ను నేను రీచ్ అయ్యాన‌ని అనుకుంటున్నాను. 25 సినిమాలు చేశానంటే.. చాలా ఆనందంగా ఉంది. అయితే నా ఫ‌స్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన‌ నాగేశ్వ‌ర‌రావు, ద‌ర్శ‌కుడు ముత్యాల సుబ్బ‌య్య‌గార్ల స‌హ‌కారం లేక‌పోతే ఇవాళ నేను లేను. 25 మూవీస్ జ‌ర్నీతో ఈ పోజిష‌న్‌కు తీసుకువ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌సాద్‌, ర‌మేష్ రెడ్డి మంచి క‌థ నా నుంచి పోకూడ‌ద‌ని.. నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చినందుకు థ్యాంక్స్. చ‌క్రి ఫ‌స్ట్‌ రోజు నుంచి అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. డైలాగ్స్ బాగా వ‌చ్చాయంటే అందుకు కార‌ణం.. ర‌మేష్ రెడ్డి, శ్రీ‌కాంత్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డం వ‌ల్లే. ప్ర‌సాద్ మూరెళ్ళ ఫొటోగ్ర‌ఫీ చాలా బాగుంది. గోపీసుంద‌ర్ మంచి సంగీతంతో పాటు, మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చేశారు. మెహ‌రీన్ ఇందులో మంచి పాత్ర‌ చేసింది. గ‌త సినిమాల‌కంటే ఇందులో ఇంకా అందంగా ఉంటుంది. భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం బాగా కుదిరింది. నిర్మాత‌ జెన్యూన్ ప్రొడ్యూస‌ర్.. త‌న‌ లెక్క ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. త‌నకు ఈ సినిమాతో మంచి హిట్ ప‌డుతుంది. `లౌక్యం` త‌రువాత పృథ్వీకు, నాకు మంచి ట్రాక్ ప‌డింది. సినిమాను బాగా ఆద‌రిస్తార‌ని, మంచి హిట్ చేస్తార‌ని న‌మ్ముతాను“ అన్నారు.

గోపీచంద్ 25వ చిత్రం సంద‌ర్భంగా ఈ వేడుక‌లో కేక్ క‌టింగ్ జ‌రిగింది. ఈ కేక్‌లో 25 సినిమాల టైటిల్స్ వ‌చ్చేలా డిజైన్ చేయ‌డం విశేషం. అలాగే త‌న ద‌ర్శ‌కుల‌తో సెల్పీ దిగి ఆహుతుల‌ను ఆక‌ట్టుకున్నారు గోపీచంద్‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here