స‌మ్మోహ‌నం సినిమాల చుట్టూ తిరిగే క‌థ అయినా సినిమాటిక్‌గా ఉండ‌దు – సుధీర్ బాబు

Sudheer Babu Interview About Sammohanam Movie,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Sudheer Babu Exclusive Interview About Sammohanam Movie,Sammohanam Movie Movie Latest News,Actor Sudheer Babu Talks about Sammohanam Movie,Sammohanam is so Realistic Says Sudheer Babu,స‌మ్మోహ‌నం సినిమాల చుట్టూ తిరిగే క‌థ అయినా సినిమాటిక్‌గా ఉండ‌దు – సుధీర్ బాబు
Sudheer Babu Interview About Sammohanam Movie

గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన ‘ఏమాయ చేసావె’ చిత్రంతో న‌టుడిగా తొలి అడుగులు వేశారు సుధీర్ బాబు. ఆ సినిమాలో స‌మంత అన్నగా న‌టించిన‌ సుధీర్‌.. రెండేళ్ళ గ్యాప్ త‌రువాత ‘ఎస్ .ఎం.ఎస్’ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ‘ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌’తో హీరోగా తొలి సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. సినిమా సినిమాకి న‌టుడిగా ఎదుగుతున్న సుధీర్.. అతిథి పాత్ర‌ల‌తో స‌హా 11 చిత్రాల‌తో సంద‌డి చేశారు. ఆయ‌న 12వ చిత్రం ‘స‌మ్మోహ‌నం’ ఈ శుక్ర‌వారం తెర‌పైకి రానుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు సుధీర్‌. ఆ విశేషాలు మీ కోసం..

ఇంద్ర‌గంటితో కాంబినేష‌న్ ఎలా సెట్ అయ్యింది?
మోహనకృష్ణ ఇంద్రగంటి గారు చాలా కాలంగా తెలుసు. నా మొదటి సినిమా ‘ఎస్.ఎం.ఎస్’ ఒక వారంలో రిలీజ్ కాబోతుంద‌న‌గా.. ఆయన నన్ను కలిసి ఒక కథ చెప్పారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌యారు చేసుకున్న క‌థ ఇది. ఇంద్ర‌గంటి డైరెక్ట్ చేయాల్సింది. అయితే.. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. కొన్ని మార్పుల‌తో చేర్పుల‌తో ఆ సినిమా ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’గా వ‌చ్చింది. మ‌ళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నాకు ఓ కథను నేరేట్ చేశారు. అదే ‘స‌మ్మోహ‌నం’. విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకి ఓకే చెప్పాను. ఇంద్ర‌గంటి రూపొందించిన పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఇంత‌కు ముందు ఆయ‌న రూపొందించిన చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది.

‘సమ్మోహనం’లో మీ పాత్ర‌ ఎలా వుంటుంది ?
ఇందులో నా పాత్ర పేరు విజ‌య్‌. చిన్నపిల్లల పుస్తకాలకు బొమ్మలు వేస్తుంటాను. కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలన్నది నా ఆశ. అలాంటి కుర్రాడికి ఓ సినిమా హీరోయిన్‌ పరిచయం అవుతుంది. ఆ ప‌రిచ‌యం ఎలాంటి ప‌రిస్ధితులకు దారి తీసింది? అనేదే మిగిలిన క‌థ‌. వాస్త‌వ కోణంలో సాగే చిత్ర‌మిది. ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ప్ర‌తినిధిలా నా పాత్ర ఉంటుంది. స‌హ‌జంగా.. సినిమా వాళ్ళ‌పై స‌గటు ప్రేక్ష‌కుడికి ఉండే అభిప్రాయాలను ప్ర‌తిబింబిస్తూ నా పాత్ర అభిప్రాయాలు ఉంటాయి. సినిమాని, సాహిత్యాన్ని అభిమానించే నాన్న‌(న‌రేష్‌)తోనూ.. క‌థానాయిక తోనూ ఆరోగ్య‌క‌ర‌మైన సంభాష‌ణ‌లే ఉంటాయి త‌ప్ప సినిమా వాళ్ళ‌ను త‌క్కువ చేసి మాట్లాడే సీన్స్ ఉండ‌వు. అలాగే ఎవ‌ర్నో వేలెత్తి చూపించిన‌ట్లు సినిమా ఉండ‌దు. కాకపోతే తారలకు కూడా ఓ ప్రైవేట్ లైఫ్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాం. ఇవ‌న్నీ కూడా ఆలోచింప‌జేసేలా ఉంటాయి.

సినిమా చుట్టూ తిరిగే ఈ చిత్రంలో సినిమా వాళ్ళెవ‌రైనా న‌టించారా?
ద‌ర్శ‌కుల పాత్ర‌ల్లో హ‌రీష్ శంక‌ర్‌, త‌రుణ్ భాస్క‌ర్ , అవ‌స‌రాల శ్రీ‌నివాస్ క‌నిపిస్తారు. అయితే.. హీరోలెవ‌రూ ఉండ‌రు.

యాక్ష‌న్ ఫిల్మ్స్‌కు సూట్‌ అయ్యే బాడీ లాంగ్వేజ్ మీది. ఇలాంటి సున్నిత‌మైన స‌బ్జెక్ట్ చేయ‌డం ఎలా అనిపించింది?
మంచి నటుడ్ని అవ్వాలనే సినిమా పరిశ్రమకొచ్చాను. కొత్త తరహా పాత్రలు చేస్తుంటేనే.. విభిన్నమైన కోణాలు బయటకు వస్తాయి. అలా చేయాలంటే కొత్త కథల్ని ఎంచుకోవాలి. ప్రతిసారీ కండలు చూపించి నెట్టుకొద్దామనుకుంటే కుదరదు. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. కొత్తదనం ఉంటేనే ఒప్పుకొంటున్నా. ఇక ముందు కూడా ఇలాగే వెళ్ళే ప్ర‌య‌త్నం చేస్తాను.

అదితిరావ్ హైద‌రీతో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
అదితి చాలా మంచి న‌టి. ఇప్ప‌టికే  బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకున్నారు. తెలుగులో త‌న‌కిది మొద‌టి సినిమా అయినా.. స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం గొప్ప విష‌యం. పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్స్‌లో.. మా ఇద్ద‌రి జోడీ బాగుందంటూ ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. తెర‌పై కూడా మా జంట మెప్పిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

నిర్మాత గురించి చెప్పండి?
శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ చూడ్డానికి తెల్ల‌గా ఉంటారు. అంతే స్వ‌చ్ఛంగా ఉంటారు. భ‌విష్య‌త్‌లోనూ ఆయ‌నతో సినిమాలు చేయాల‌నుంది.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మ‌హేష్.. ఇలా ఆడియో ఫంక్ష‌న్స్‌కు రావ‌డం త‌ప్ప ఎలాంటి స‌పోర్ట్ ఇవ్వ‌లేద‌న్నారు..?
నేను సినిమాల్లోకి వచ్చిందే నా శాటిస్‌ఫ్యాక్ష‌న్‌ కోసం. మా నాన్న బిజినెస్‌లో ఉదయం 10 గంట‌ల నుంచి 5 గంటల వరకు సంతకాలు పెట్టుకుంటే సరిపోతుంది. కాస్త ఆత్మ సంతృప్తి కోసమే సినిమా ఫీల్డ్‌లోకి వచ్చాను. ఇక్కడ కూడా వీళ్లను, వాళ్లను అడగడం, వాళ్ల పేర్లు వాడుకోవడం నాకిష్టం లేదు. ఇంకెందుకు ఈ జీవితం. మనమీద బయటవాళ్లకు గౌరవం కూడా ఉండదు. సినిమాల్లో సపోర్ట్ అడిగితే, మరోసారి కట్నం అడిగినట్టే. స్వ‌త‌హాగా స్వతంత్ర భావాలున్న వ్య‌క్తిత్వం నాది. అందుకే నాకు నేనుగా ముందుకెళుతున్నాను.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చాలా ఎమోషనల్‌ అయ్యారు ?
ఇప్పటి వరకు  ఒక‌టి రెండు సినిమాల అనుభవం ఉన్న కొత్త దర్శకులతోనే సినిమాలు చేశాను. ఎక్స్‌పీరియ‌న్స్‌ ఉన్న‌ దర్శకుడితో పనిచేయడం ఇదే తొలిసారి. నా ప్రతిభను నమ్మి మోహనకృష్ణ అవకాశమివ్వడం, నేనే తన బెస్ట్‌ హీరోనని త‌ను చెప్పడంతో కొంత ఎమోషనల్‌ అయ్యాను. దీనిని ఒక అచీవ్‌లా ఫీలయ్యాను.

సొంత‌గా నిర్మాణ సంస్థ స్థాపించ‌డానికి కార‌ణం ఏదైనా ఉందా ?
సినిమా మీద ఆస‌క్తితో చాలా మంది ప‌రిశ్ర‌మ‌కి వ‌స్తుంటారు. కేవ‌లం నటులు దర్శకులనే కాకుండా కొరియోగ్రాఫర్స్‌, ఫైట్‌మాస్టర్స్‌.. ఇలా చాలా మంది ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహం లేక తిరిగి వెళ్లిపోయినవారున్నారు. అలాంటి కొత్తవారిని గుర్తించి అవకాశాలివ్వాలనే ఆలోచనతో సొంత‌ నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ఈ సంస్థలో మొద‌టి ప్రయత్నంగా ఆర్‌.ఎస్‌. నాయుడు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాను. దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తాను.

పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఎప్పుడు?

సెప్టెంబర్‌ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం పుల్లెల గోపీచంద్ ద‌గ్గ‌ర కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్నాను. అలాగే వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం కోసం.. కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్న‌మెంట్స్‌లో పాల్గొన‌బోతున్నాను. స్వ‌త‌హాగా బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కావ‌డం వ‌ల్ల‌.. ఈ బ‌యోపిక్‌ను మ‌రింత జాగ్ర‌త్త‌గా చేసే అవ‌కాశ‌ముంటుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?

‘వీర‌భోగ వ‌సంత‌రాయలు’ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కొత్త క‌థ‌లు వింటున్నాను.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here