నా పాత్ర 2 గంట‌లు ఉందా? 20 నిమిషాలుందా? అనే లెక్క‌లు వేసుకుని సినిమాలు చేయ‌ను – అదితి రావ్ హైద‌రీ

Actress Aditi Rao Hydari Latest Interview, Aditi Rao Hydari Interview, Aditi Rao Hydari Next Film Updates, Aditi Rao Hydari Upcoming Movies News, Heroine Aditi Rao Hydari Interview, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Aditi Rao Hydari Interview

స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌ అనిపించుకోవ‌డం కంటే మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మే త‌న లక్ష్యం అంటున్నారు అదితి రావ్ హైద‌రీ. తెలుగు మూలాలున్న ఈ ముద్దుగుమ్మ గ‌త ప‌న్నెండేళ్ళుగా త‌మిళ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో న‌టించి.. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవ‌లం క‌థానాయిక పాత్రైతేనే చేస్తాను అంటూ హ‌ద్దులు పెట్టుకోకుండా.. పాత్ర న‌చ్చితే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్నారు అదితి. గ‌తేడాది మ‌ణిర‌త్నం రూపొందించిన త‌మిళ అనువాద చిత్రం ‘చెలియా’తో ప‌ల‌క‌రించిన అదితి.. ఈ ఏడాది స్ట్ర‌యిట్ తెలుగు ఫిల్మ్ ‘స‌మ్మోహ‌నం’తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం (జూన్ 15) తెర‌పైకి రానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు అదితి.

‘స‌మ్మోహనం’లో సినిమా హీరోయిన్ పాత్ర‌లో న‌టించ‌డం ఎలా ఉంది?
ఇందులో నా పాత్ర పేరు స‌మీరా. సినిమా హీరోయిన్ పాత్ర‌లో న‌టించ‌డం ఇదే తొలిసారి. భావోద్వేగాల‌కు అవ‌కాశ‌మున్న పాత్ర ఇది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సార్ ఈ సినిమా కోసం ఈ పాత్ర అనుకున్న‌ప్పుడు మొద‌ట‌ న‌న్నే అనుకున్నార‌ట‌. కొన్ని కాంటాక్ట్స్ ద్వారా ఎలాగోలా నా ఫోన్ నెంబ‌ర్ సంపాదించి.. నాకు కాల్ చేశారు. అప్పుడు నేను.. ‘భూమి’, ‘ప‌ద్మావ‌త్’ చిత్రాల‌తో బిజీగా ఉన్నాను. అయితే రెండు నిమిషాల్లో ఐదు వాక్యాల్లో ఆ పాత్ర గురించి చెప్పారు. ”కాస్త స‌మ‌యం ఇవ్వండి.. త‌ప్ప‌కుండా ఆ పాత్ర చేస్తాను” అని చెప్పాను. అంత‌గా.. స‌మీరా పాత్ర న‌చ్చింది. ‘రోమ‌న్ హాలీడే’, ‘గుడ్డి’ (హిందీ) త‌ర‌హాలో సాగే అంద‌మైన క‌థ ఇది.

ట్రైల‌ర్ చూస్తుంటే.. స‌మీరా పాత్ర భావోద్వేగాల‌కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర అని అర్థ‌మ‌వుతోంది. ఈ పాత్ర‌కు ప్ర‌త్యేకంగా వ‌ర్క్ చేశారా?
సినిమా హీరోయిన్ పాత్ర‌ను చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. చాలా మంది.. హీరోయిన్ల గురించి గ్లామ‌ర్ కోణంలోనే ఆలోచిస్తారు. నా దృష్టిలో హీరోయిన్‌ అంటే హార్డ్ వ‌ర్క్‌. త‌మ‌వి కాని భావోద్వేగాల‌ను మ‌న‌సులోకి తెచ్చుకుని ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేయ‌డానికి హీరోయిన్లు కృషి చేస్తారు. ఆ కృషిని త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే. అంతేగానీ క‌థానాయిక అంటే కేవ‌లం ర‌క్తం, మాంసం ముద్ద‌గా చూడ‌కూడ‌దు. దాని వెనుక ఉన్న మ‌న‌సును చూడాలి. క‌థానాయిక‌లు కూడా స‌గ‌టు అమ్మాయిలే అని అంద‌రూ అనుకోవాలి. నేన‌యితే స్త్రీ, పురుషులంతా స‌మాన‌మే అని అనుకుంటాను. న‌న్ను మా వాళ్లు పెంచిన విధానం అలాంటిది. అలా కాకుండా అమ్మాయి కొంచెం త‌క్కువ అని ఎవ‌రికైనా చిన్న‌ప్ప‌టి నుంచి చెప్పి పెంచితే.. వారిలో ఎలాంటి మార్పూ రాదు. స‌మీరా పాత్ర‌లో ఓ న‌టికి వెనుక ఉన్న కోణాన్ని, భావోద్వేగాల‌ను మోహ‌న్ సార్ చాలా చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.

తెలుగులో తొలిసారిగా న‌టించ‌డం ఎలా అనిపించింది?
నేనెప్పుడూ సినిమాల‌ను ప్రాంతీయ‌త‌ను బ‌ట్టో.. భాష‌ను బ‌ట్టో ఎంపిక చేసుకోను. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌ను బ‌ట్టి, పాత్ర‌ను బ‌ట్టి సినిమాల‌ను ఎంచుకుంటాను. ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ఎక్కువ స్కోప్ ఉందంటే.. అది ఏ భాష అయినా చేయ‌డానికి ముందుంటాను. ఇక తెలుగు విష‌యానికి వ‌స్తే.. నా మూలాలు తెలుగు ప్రాంతానికి చెందిన‌వే అయిన‌ప్ప‌టికీ నేను పెరిగిందంతా ఉత్త‌రాదిలోనే. 12 సంవ‌త్స‌రాలుగా సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాను. నాకు ఎక్క‌డ మంచి అవ‌కాశం వ‌స్తే అక్క‌డ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను.

తొలి తెలుగు చిత్రంతోనే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ఎలా అనిపించింది?
ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఉన్నాన‌ని చెప్ప‌డం లేదు కానీ.. న‌న్ను ఎప్పుడు ఎవ‌రు అడిగినా నేను `హైద‌రాబాదీ`నే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవ‌డాన్నే నేను గ‌ర్వ‌ప‌డ‌తాను. ఇంట్లో మా తాత ఉర్దూ, తెలుగు మాట్లాడమ‌ని ఎప్పుడూ చెప్పేవారు.నేనే ఏ రోజూ వాళ్ల మాట విన‌లేదు. డ్యాన్సింగ్‌, సింగింగ్‌.. ఇలా చాలా నేర్చుకున్నాను కానీ.. తెలుగు మాత్రం నేర్చుకోలేదు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డ‌బ్బింగ్‌ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ విష‌యంలో మోహ‌న్ సార్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది.

సుధీర్ బాబుతో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
సుధీర్ బాబు ఎఫ‌ర్ట్ లెస్ యాక్ట‌ర్‌. షూటింగ్ లేక‌పోతే చాలా క్వైట్‌గా ఉంటారు. ఒక సారి కెమెరా ముందుకు వ‌స్తే.. ఆ స‌న్నివేశంలో అలా ఒదిగిపోతారు. మంచి కో-స్టార్‌. త‌న‌తో న‌టించ‌డానికి ముందే సుధీర్ న‌టించిన ‘బాఘీ’ చూశాను. విల‌న్‌గా బాగా న‌టించారు.

మీ కెరీర్‌ను ప‌రిశీలిస్తే.. క‌థానాయిక పాత్ర‌లే కాకుండా చిన్న చిన్న పాత్ర‌ల్లోనూ క‌నిపించారు. అది కెరీర్‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని మీక‌నిపించ‌లేదా?
స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌ అనిపించుకోవ‌డం కంటే మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మే నా లక్ష్యం. క‌థానాయిక పాత్ర‌లైతేనే చేస్తాను అని గిరి గీసుకుని ఉంటే.. ఇవాళ‌ ప్ర‌తిభావంతులైన గొప్ప గొప్ప ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసే అవ‌కాశాన్ని కోల్పోయేదాన్ని. ‘ప‌ద్మావ‌త్‌’లో నా పాత్ర ప‌రిధి త‌క్కువ అయినా.. నాకు మంచి పేరే వ‌చ్చింది. మున్ముందు కూడా ఇలాగే మంచి సినిమాల్లో భాగం కావాల‌నుకుంటున్నాను. అంతేగానీ.. నా పాత్ర 2 గంట‌లు ఉందా? 20 నిమిషాలుందా? అనే లెక్క‌లు వేసుకుని సినిమాలు చేయ‌ను. మంచి సినిమాల్లో భాగ‌మ‌వ‌డం కంటే కావాల్సిందేముంది?

మ‌ణిర‌త్నంతో వ‌రుస‌గా రెండు సినిమాలు చేసే అవ‌కాశం అందిపుచ్చుకున్నారు. ఎలా అనిపిస్తోంది?
చిన్న‌ప్ప‌ట్నుంచి మ‌ణిర‌త్నం సార్ సినిమాల‌ను చూస్తూ పెరిగాను. ఆయ‌న డైరెక్ష‌న్‌లో సినిమా చేయాల‌నేది ఓ క‌ల‌గా ఉండేది. ‘చెలియా’ చిత్రంతో అది తీరింది. ఆ సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా.. నాకు న‌టిగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఆయ‌న‌ నాకు మెంట‌ర్‌, టీచ‌ర్‌. మ‌న‌లోని టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డంలో ఆయ‌న్ని మించిన వారు ఉండ‌రు. మ‌నం ప్ర‌మాదంలో ప‌డిపోతున్నామంటే కాపాడ‌టంలోనూ ఆయ‌నే ముందుంటారు. అందుకే ఆయ‌న‌తో సినిమా అంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. త‌న‌తో రెండో సారి సినిమా చేసే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.

ద‌క్షిణాదిలో ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారే..?
ప్రేమ ఎప్పుడూ నిత్య‌నూత‌న‌మే. నా విష‌యానికి వ‌స్తే.. మా గ్రాండ్ పేరంట్స్ ల‌వ్ స్టోరీని ఇప్ప‌టివ‌ర‌కు 1000 సార్లు విని ఉంటాను. ఎన్నిసార్లు విన్నా.. ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. నా వ‌ర‌కు ప్రేమ‌క‌థా చిత్రాలు చూడ‌డాన్ని చాలా బాగా ఆస్వాదిస్తాను. ‘బాంబే’ సినిమాలోనూ.. ‘ఖామోషి’ సినిమాలోనూ మ‌నీషా కోయిరాలా చేసిన పాత్ర‌లు న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. ఎంత‌లా అంటే.. ఆ పాత్ర‌లు చూస్తున్న‌ప్పుడు న‌న్ను నేను ఆ పాత్ర‌ల్లో ఊహించేసుకుంటాను. అలాంటి సినిమాలు తీసిన మ‌ణిర‌త్నంతోనూ.. సంజ‌య్ లీలా భ‌న్సాలీతోనూ సినిమాలు చేయ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

ఎలాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల‌నుకుంటున్నారు?
మ‌ణిర‌త్నం సార్ సినిమాల్లో న‌టించాల‌నేది నా క‌ల‌. అది నెర‌వేరింది. మిస్కిన్‌, కార్తిక్ సుబ్బ‌రాజ్‌, గౌత‌మ్ మీన‌న్‌, శేఖ‌ర్ క‌మ్ముల‌, త‌రుణ్ భాస్క‌ర్‌, వెంకీ అట్లూరి.. ఇలా యూనిక్ విజ‌న్ ఉన్న ప్ర‌తి ద‌ర్శ‌కుడి సినిమాలోనూ భాగ‌మ‌వ్వాల‌నుకుంటాను. నా వ‌ర‌కు క‌థ న‌చ్చితే చాలు.. ఫ‌లితాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచ‌న ప‌క్క‌న‌పెట్టి సినిమాలు చేస్తుంటాను.

సంక‌ల్ప్ రెడ్డి సినిమా గురించి చెప్పండి?
ఇందులో నేను వ్యోమ‌గామి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. ఇది కూడా ఛాలెంజివ్‌గా ఉండే పాత్రే. ఇంత‌కుమించి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడేమీ చెప్ప‌లేను.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here